ABN Andhra Jyothi : బాబు - రాధాకృష్ణల కాంట్రాక్టు ప్రేమ

By Aditya Oct. 13, 2021, 09:35 pm IST
ABN Andhra Jyothi : బాబు - రాధాకృష్ణల కాంట్రాక్టు ప్రేమ

చంద్రబాబుకి జలుబు చేస్తే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు తుమ్ములు వచ్చేస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. అవిభక్త కవలల మాదిరి వారి అనుబంధం అలాంటిది. ఆయన గళాన్ని తన కలం ద్వారా వినిపిస్తారు. బాబుకు ఏ కష్టం వచ్చినా తన కలాన్ని అడ్డమేసి కాపాడగలనని ఈయన భావిస్తారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టర్లు పడుతున్న ఇబ్బందులపై బాబుగారు ఆవేదన వ్యక్తం చేసేసరికి రాధాకృష్ణ కలం చలించిపోయింది. తెల్లారేసరికి 'పని..పోయింది' అంటూ  ఫస్ట్ పేజీలో కథనం వండి వార్చేసింది.

బాబు మొసలి కన్నీరు..

ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టర్లను ప్రభుత్వం వేధిస్తోందని, వారికి బిల్లులు చెల్లించకుండా కావాలనే ఇబ్బంది పెడుతోందని చంద్రబాబు ఆరోపించారు. కాంట్రాక్టర్ల లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని, ఉద్దేశ పూర్వకంగా వారిని వేధించటం తగదని అన్నారు. దాదాపు రూ.80 వేల కోట్ల విలువైన బిల్లులు చెల్లించక పోవడం అన్యాయం అని, వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాబుగారు మొసలి కన్నీరు కార్చారు. గురువింద గింజ సామెతను తలపించే ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఆంధ్రజ్యోతి కథనం సాగింది.

మూడేళ్లుగా అవస్థలంటూ అభిప్రాయాలు..

బిల్లులు చెల్లించక పోవడంతో మూడేళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని కొందరు బాధిత కాంట్రాక్టర్లు చెప్పినట్లు కథనానికి అభిప్రాయాలు కూడా జోడించారు. రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వచ్చి ఇంకా రెండున్నరేళ్లు కూడా దాటలేదు. అయినా మూడేళ్ల క్రితం ఆగిన బిల్లుల చెల్లింపుల పాపం కూడా జగన్ ఖాతాలో వేసేశారు. కేవలం రూ. వంద కోట్ల రూపాయలతో ఉన్న ఖజానాను తెలుగుదేశం ప్రభుత్వం జగన్ సర్కారుకు అప్పగించింది. అంతేకాకుండా తాము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి రాష్ట్రానికి అప్పులు తెచ్చేశామని, ఇక జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి అప్పులు కూడా పుట్టవని టీడీపీ ప్రభుత్వం చివరి నాళ్లలో అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణడు గొప్పగా చెప్పారు. ఉద్దేశ పూర్వకంగానే అతిగా అప్పులు చేసి వచ్చే ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయాలనే వారి కుట్ర అప్పుడే అందరికీ అర్థం అయింది.

Also Read : తెలుగు రాష్ట్రాల సీఎంల మనసులోని మాట కూడా చెబుతోన్న రాధాకృష్ణ

బాబు హయాంలోనే చెల్లింపుల నిలిపివేత..

రాష్ట్రం విడిపోయే సరికి 93 వేల కోట్ల అప్పుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను మరింత అప్పుల కుప్పగా చంద్రబాబు మార్చేశారు. ఆయన హయాంలో దాదాపు లక్షా యాభై వేల కోట్ల అప్పు తెచ్చిన సంగతి తెలిసిందే. ఒక పథకం నిర్వహణకు తెచ్చిన అప్పును మరో పథకానికి మళ్లించడం, బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో ఉంచడం అప్పుడే ప్రారంభించారు. రైతుల రుణ మాఫీ విషయంలో మాట నిలుపుకోలేదు సరికదా ఏ పథకాన్ని సరిగా నిర్వహించలేదు. రోడ్లు వేయడం కోసమని రూ. మూడు వేల కోట్లు అప్పు తెచ్చి ఎన్నికల ముందు పసుపు కుంకుమ పథకానికి మళ్లించారు. నాలుగున్నరేళ్ళ పాలనలో గుర్తుకు రాని నిరుద్యోగ భృతి ఎన్నికల ముందే అమలు చేసి అప్పుచేసిన సొమ్మును ఆ పథకానికి ఖర్చు చేశారు.

ప్రతి కార్యక్రమాన్ని ఈవెంట్ లా నిర్వహించి డబ్బును దుబారా చేశారు. రాజధాని అమరావతి డిజైన్ పేరిట ప్రత్యేక విమానాల్లో వివిధ దేశాల్లో ఆయన, మంత్రి వర్గ సభ్యులు బలాదూర్ తిరిగారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసి జగన్ ప్రభుత్వానికి అప్పులనే అప్పగించి ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారు. బాబుగారు చేసిన అప్పులకు ఏటా వడ్డీ కింద రూ. 20 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.

కరోనా వేళా..

కరోనా కష్టకాలంలో సైతం అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ, సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఏదో విధంగా బదనాం చేయాలనే దురుద్దేశంతో తన హయాంలో చేసిన తప్పులను కూడా జగన్ ఖాతాలో వేసేయాలని బాబు యత్నిస్తున్నారు. దీనికీ రాధాకృష్ణ ఇతోధికంగా అక్షర సాయం అందిస్తూ దాన్నే జర్నలిజం అనుకుంటున్నారు. అయితే బాబు మాటలను, రాధాకృష్ణ రాతలను జనం నమ్మడం లేదు. పంచాయతీ, మునిసిపల్, పరిషత్ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ సాధించిన విజయాలే అందుకు నిదర్శనం.

Also Read : తరతరాల సమస్య.. శాశ్వత పరిష్కారం.. జగన్‌ చారిత్రాత్మక అడుగు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp