అంతర్థానమవుతున్న ఆనవాళ్లు

By Vivek Segileti Jul. 26, 2020, 07:09 pm IST
అంతర్థానమవుతున్న ఆనవాళ్లు

కాలం చాలా వేగవంతమైనది. సమాజం, సాంకేతికతతో పాటు చరిత్రను, వాటి తాలూకు ఆనవాళ్లను కూడా అంతే వేగంగా కనుమరుగయ్యేలా చేస్తుంది. రాజుల, రాజ్యాల చరిత్రతో పాటు ఒకనాడు ఎంతో వైభవంగా వెలుగొంది తదనంతర పరిస్థితుల్లో మనలేక మొండి గోడల శిథిలాల చాటున నిక్షిప్తమైన గ్రామ సీమలు ఎన్నో కనిపిస్తాయి.
నిత్య కరువు కాటకాలు, వరదలు లేదా అగ్ని ప్రమాదాలు, దోపిడీ దారుల చొరబాట్లు, తమ ఉత్పత్తులకు తగ్గ మార్కెట్ ను వెతుక్కుంటూ వెళ్లడం వల్ల అయ్యుండొచ్చు లేదా మరే ఇతర కారణాల వల్లైనా కావొచ్చు ఆ ప్రాంతాన్ని వదిలి మరొక ప్రాంతానికి వలసెల్లి పోవడం వల్ల ఆ గ్రామం పూర్తిగా అంతర్థానమైపొయ్యుండొచ్చు గానీ చరిత్ర తాలూకు ఆనవాళ్లలో, ప్రభుత్వ రికార్డుల్లో, గ్రామ పూర్వీకుల మదిలో మెదిలే జ్ఞాపకాల రూపంలో నేటికీ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి.

ఉదాహరణకు కడప జిల్లా బద్వేలు తాలూకాలో వనంపుల అనే పంచాయితీ ఉంది. ఇప్పుడు అక్కడికెళ్లి చూస్తే గెట్టిగా ఒక ఇరవై ఇండ్లు కూడా ఉండవు మరి ఎందుకు పంచాయితీ కేంద్రంగా ఉంది అని పెద్దల్నెవర్నైనా అడిగితే "ఒకప్పుడు వనంపుల అనేది చాలా పెద్ద ఊరు. దాదాపు రెండు వేలకు పైగా కుటుంబాలు నివాసముండేవి. నిత్యం వంద కవ్వాలకు పైగా తిరిగేవంట" అని ఘనంగా చెప్తారు.

Also Read:నేడు కార్గిల్ విజయ్ దివస్ - అమరవీరులకు నివాళి

వాటి తాలూకు సజీవ సాక్ష్యాలన్నట్టుగా అతి పురాతనమైన రెండు స్వయంభూ శివలింగాలు గల శివాలయం, దాని పక్కగా రాజుల కాలం నాటి గింజలు భద్రపరిచే సున్నము గచ్చుతో కట్టిన పెద్ద గాదె, ఇళ్లు కట్టడానికి ఉపయోగించే పాత కాలం నాటి ఇటుకులు, మొండి గోడలు అన్నీ గమనించవచ్చు. ఎక్కడా లేని విధంగా ఆ ప్రాంతంలో రాయి విసిరితే వచ్చే ఖంగ్ ఖంగ్ అనే శబ్ధాలు భూమిలో నిక్షిప్తమైన బంగారు తాలూకు ఆనవాళ్లు అని పెద్దవాళ్లు భావిస్తుంటారు కూడా.

ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అంత ఘన చరిత్ర కలిగిన గ్రామం ఎందుకు ఖిలపడిపోయుంటది అనేది. దానికి వెనుక కారణాలు గల విశ్లేషించగలిగితే సగిలేటి ఒడ్డునే ఉంటుంది కాబట్టి అనుకోని వరదల వల్ల గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయుండొచ్చు లేదా అగ్ని ప్రమాదం లాంటిదేదైనా ఏదైనా సంభవించి బోద కొట్టాలన్నీ కాలిపోయిండవచ్చు లేదా ఒక మూలగా ఉండబట్టి దోపిడీ దారుల బెడద తట్టుకోలేక మైదాన ప్రాంతాలకు వలస వచ్చుండొచ్చు లేదా పెరుగుతున్న జనాభా ఆహారవసరాలకు తగ్గ సారవంతమైన భూములు తగ్గిపోయుండవచ్చు.

ఇవన్నీ కాకపోయినా ఆ గ్రామంలో నాడు ఎక్కువగా సాలె వాళ్లు(చేనేత) వాళ్లు ఉండే వాళ్లు అంటుంటారు. వాళ్లంతా చాలా వరకు బద్వేలు టౌను చుట్టుపక్కల నివాసాలు ఏర్పరచుకున్నారు అంటుంటారు. ఆ రకంగాచూస్తే తమ ఉత్పత్తులకు అనుగునంగా మార్కెట్ ను వెతుక్కూంటూ వెళ్లారేమో అనుకోవచ్చు.

Also Read:ఎల్లలు దాటిన దాతృత్వం

ఒక్క వనంపుల పరిస్థితే కాదు బద్వేలు తాలూకాలోని వీరబల్లె, కాశినాయన మండలంలోని కత్తెలగండ్ల, రంపాడు, అక్కెంగుండ్ల లాంటి పురాతన గ్రామాలు చాలానే కనిపిస్తాయి. ఒక్క బద్వేలు చుట్టుపక్కల వాటి సంఖ్య దాదాపు 50 కి పైగా ఉంటాయంట.

కైఫియ్యతులు లేదా మరికొన్ని చరిత్ర ఆధారాల మీదుగా వాటి మీద సరైన చర్చలు, పరిశోధనలు జరిగితే మరింత సమాచారాం దొరకవచ్చు. తద్వారా చరిత్ర గమనాన్ని విశ్లేషించే అవకాశం దొరుకుతుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp