పవన్ కళ్యాణ్ కి ప్రేమతో...

By Guest Writer Dec. 11, 2019, 06:22 pm IST
పవన్ కళ్యాణ్ కి ప్రేమతో...

మీ అన్నగారు పట్టుబట్టి మరీ వచ్చి, ఏ సపోర్ట్ లేకుండా సినీఫీల్డ్ లో అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతున్న అదే సమయంలో, తమరు ఇంటర్ ఫెయిల్ అవుతూ ఇంట్లో కూర్చుని కనిపించిన పుస్తకాలు తిరగేయడంతో వచ్చిన తెలివితో అప్పుడప్పుడు మాట్లాడేమాటలు మీకుటుంబానికి, మిమ్మల్ని ప్రేమించే మీ అన్నగారికి అద్భుతం అని అనిపించాయేమో కానీ బయటకువచ్చాక మీమాటలు విన్న జనానికి మాత్రం షాక్ కొట్టాయి.

మీరు గత 40ఏళ్లుగా నివసిస్తున్న ఊర్లో రోడ్లమీద ఒక్క పూటతిని సినిమా అవకాశాల కోసం వెంపర్లాడుతున్న బ్రతుకులు ఉండగా, పరీక్షలు అవసరంలేని పుస్తకాలు చదువుకుంటూ 25ఏళ్ల తరువాత జ్ఞానోదయం పొంది మీరు సినిమాలో చేస్తాను అనగానే సినిమా సిద్ధంగా ఉంచిన మీ అన్నగారి ప్రేమ,స్టేటస్ వల్ల మీకు మీ అన్నగారు ఎక్కిన మొదటి మెట్టు ఎత్తు ఎంతన్నది తెలియకుండా పోయింది.

చేసిన కొద్ది సినిమాలకే విపరీతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించి, గదిలో ఉన్న మిమ్మల్నసెలబ్రిటీ(చాలా చిన్నపదం) లా తయారుచేసిన సినిమాల మీద మాట్లాడుతూ, నటన మీద మీకు ఆసక్తి లేదని చెప్పిన మాటను బట్టి, మీకు మీ వృత్తి(అప్పటికి అది తప్ప మీరు వెలగబెడుతున్న ఇంకే ఉద్యోగం కూడా లేదు) మీద మీకున్న నిబద్ధత, ఆ సినిమా అవకాశం కోసం కడుపుమాడ్చుకుని రేయింబవళ్లు కష్టపడుతున్న వాళ్ళ కష్టం ఇసుమంత కూడా తెలియదని తెలుస్తుంది. అన్నగారి వల్ల వచ్చిన నటించే అవకాశం తప్ప ఇప్పుడు సామాన్యుడు చేయగలిగే ఏ ఉద్యోగ అర్హత మీకు లేదన్న విషయాన్ని మీరు గుర్తించకపోవడం విషాదం. ఆవేశంతో మీరు అప్పటికప్పుడు పెట్టే "common man protection force" లాంటి సంస్థలు తెల్లారేసరికి కనపడకపోవడాన్ని బట్టి మీకు వాటిమీద ఎంత శ్రద్ధ,పట్టుదల ఉందో తెలుస్తుంది.

కుల,మతాలకు అతీతంగా అని పార్టీ పెట్టి కొన్నేళ్ల తరువాత civil service exam పెడుతున్నట్టు హడావిడి చేసి మీరు పెట్టిన మండల స్థాయి పార్టీ నియామ పరీక్షల్లో ఫలితాలతో సంబంధం లేకుండా, ఉన్నవాళ్లలో 80% మీ కులం వాళ్లే అన్న విషయం మీకు తెలిసినా తెలియనట్టు ఉన్నారేమో. ఇప్పుడు వాళ్ళుకూడా లేరన్న సంగతి కూడా తెలియదేమో.
పార్టీ పెట్టి 6 ఏళ్ళు గడుస్తున్నా, 5% ఓట్లు వచ్చినా, గ్రామస్థాయిలో కనీస చలనం లేని పార్టీగా మీరే రికార్డ్ కొడతారేమో. పార్టీ అధ్యక్షుడికి, రాష్ట్రంలో మూల ఉన్న సామాన్యుడికి మధ్యలో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఒకటి ఉంటుందని వాళ్ళే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పార్టీ ప్రతినిధులు నాయకులని, వాళ్ళు లేకపోతే తమరి ఆక్రోశ తాండవ నాట్యాలన్నీ వేస్ట్ అని నాకు తెలిసినంతగా కూడా మీకు తెలియకపోవడం విడ్డూరం.

80% పైగా ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా గుర్తించను అంటే మీరు చదివిన పుస్తకాల్లో అత్యవసరమైన రాజ్యాంగం అనేపుస్తకాన్ని కనీసం సెల్ఫ్ లోనుండి కూడా తీయలేదని అర్ధం అవుతుంది . ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని పూర్తిపేరు పలకడానికి కూడా అహం అడ్డొస్తున్న మీకు అన్ని వర్గాలను కలువుని రాష్ట్ర రాజకీయాలు చేస్తానంటే వినడానికి జనం అంత అమాయకులు అనుకోవడం బాధాకరం.
చేగువేరా, అంబేద్కర్ ల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తూ, వెంటనే సనాతన ధర్మ పరిరక్షక పాత్ర చేయడంతో, సినిమాలు మీరు వదిలేసినానటన మాత్రం వదల్లేదని, ఈ పాత్ర మీకెరీర్ లో మీరు అత్యుత్తమ నటన నైపుణ్యం చూపిన పాత్ర అని మర్చిపోవద్దు. హక్కుల కోసం పోరాడిన అంబేద్కర్, చేగువేరా పేర్లు చెప్పుకుంటూ దేవాలయంలో మహిళల ప్రవేశంపై మాత్రం నమ్మకాలు ముఖ్యం అని చెప్పడం చూస్తే ఇన్నిరోజులు మీరు రాజకీయ నాయకుడుగా మారారని భ్రమలు పోయి రాజకీయ నాయకుడి "పాత్ర"పోషిస్తున్నారని మాకు అవగతమైంది.

అన్నింటిలో ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇతర పార్టీ వాళ్ళు మీపెళ్లిళ్ల గురించి మాట్లాడగానే వ్యక్తిగత కామెంట్స్ అని గొంతు చించుకునే మీరు, మీ అభిమాన వర్గం తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జీవితం అని నాయకుడికి ప్రత్యేకంగా ఉండదని. మీరు మీ వ్యక్తిగత వ్యవహారాలు అయిన మీఇంటర్ ఫెయిల్యూర్ ని, పడని కష్టాలని, చదివాననుకున్న పుస్తకాలని, మీనాన్నగారి జాబ్ ని పదే పదే సభల్లో మిమ్మల్ని మార్కెటింగ్ చేసుకోవడానికి వాడుకున్నప్పుడు మీ పెళ్ళిళ్ళని వాళ్ళు కూడా వాళ్ళ మార్కెటింగ్ కి వాడుకుంటారన్న విచక్షణని ఎలా వదిలేశారు?

దయచేసి ఇకనైనా సభలు పెట్టడం మాని అర్జంట్ గా వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఏదైనా విషయం ఎలా మాట్లాడాలో, ఎలా వ్యక్తపరచాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం. భాష గురించి మాట్లాడుతూ రేప్ దగ్గర ఆగడం, శిక్ష గురించి మాట్లాడుతూ కులం దగ్గర ఆగడంలాంటి విపరీత కామెడి పోకడలు వదిలించుకుంటే పువ్వుతో జత కట్టేవరకు మీ తుమ్మెద రెక్కలు ఊడకుండా ఉంటాయి.

ఫైనల్ గా తమరు ఎన్ని దానాలు చేశారు, ఎంత మంచివారు అన్నది మీ వ్యక్తిగతం. పరిపాలించడానికి మంచితనం ఏమాత్రం సరిపోదని కావాల్సింది పరిపాలన మీద అవగాహన, తెలివి, పరిపాలనాసామర్ధ్యం, నిర్ణయాలు తీసుకోగల సత్తా, వాటిని అమలు చేయగలిగే నిబద్ధత అని తెలుసుకుంటే మీరు మీతో పాటు మీ పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయి. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుందనే నానుడి గుర్తు వచ్చి మీ మీద ప్రేమతో ఇక్కడితో ఆపేస్తున్నా.. లేకుంటే పెద్ద పుస్తకమే రాయాల్సి వస్తుందని ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తున్నా.....

ఇట్లు మీ అభిమాని...


Written By - Srikar Devaram

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp