వైసీపీలో నామినేటెడ్‌ పదవుల పండగ.. నెలాఖరులోపు 600 పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌..

By Kotireddy Palukuri Jul. 20, 2020, 07:19 pm IST
వైసీపీలో నామినేటెడ్‌ పదవుల పండగ.. నెలాఖరులోపు 600 పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌..

ఎన్నికలకు ముందు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన బీసీ సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్, ఎన్నికల సభల్లో బీసీలకు ఇచ్చిన మరో ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. బీసీ సంక్షేమం కోసం 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఈ రోజు బీసీ ప్రజా ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. ఈ నెలాఖరు లోపు 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి చైర్మన్లు, డైరెక్టర్లను నియామకం పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆయా కార్పొరేషన్లు ఆయా కులాలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా..? అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందా..? అనే అంశాలను కార్పొరేషన్లు పర్యవేక్షిస్తాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై అధ్యయనం చేసిన జగన్‌ సర్కార్‌ వివిధ బీసీ కులాల జనాభా ఆధారంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బీసీల్లో ఉన్న మొత్తం 139 కులాలకు ఈ కార్పొరేషన్లలో ప్రాతినిధ్యం దక్కనుంది. కనీసం 30 వేల జనాభా ఉన్న ప్రతి బీసీ కులాన్ని ఏదో ఒక కార్పొరేషన్‌లో చేర్చేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జనాభా ఆధారంగా మూడు విభాగాలుగా కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. 10 లక్షలకుపై బడి జనాభా ఉన్న జనాభాకు 6 కార్పొరేషన్లు, లక్షకుపైబడి పది లక్షలకు లోబడి జనాభా ఉన్న బీసీ కులాలకు 27 కార్పొరేషన్లు, లక్ష లోపు జనాభా ఉన్న బీసీ కులాలకు 19 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది.

52 కార్పొరేషన్లకు ఒకే భవనం నిర్మించాలని వైసీపీ సర్కార్‌ నిర్ణయించింది. ఈ నెలఖరు లోపు ప్రతి కార్పొరేషన్‌కు చైర్మన్, డైరెక్టర్లను కూడా నియమించాలని జగన్‌ నిర్ణయించారు. ప్రతి కార్పొరేషన్‌కు చైర్మన్‌ తోపాటు 7 నుంచి 12 మంది డైరెక్టర్లను నియమించాలని జగన్‌ స్పష్టతనిచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీలో నామినేటెడ్‌ పదవుల పండగ ప్రారంభం కాబోతోంది. 52 చైర్మన్‌ పోస్టులతోపాటు సరాసరి 520 డైరెక్టర్ల పోస్టులు కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఈ పోస్టులన్నీ ఆయా కులాల నేతలతోనే భర్తీ చేయనున్నారు.

బీసీల్లో అధిక జనాభా ఉన్న సామాజికవర్గ నేతలకే ఇప్పటి వరకూ రాజ్యాధికారం దక్కింది. యాదవ, గౌడ, శెట్టిబలిజ, తూర్పు కాపు వంటి అధిక జనాభా ఉన్న సామాజివర్గ నేతలకే ఆయా పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. బీసీలలో ఉన్న ఇతర ఉపకులాల వారికీ జనాభా తక్కువగా ఉన్న కారణంగా రాజకీయాల్లో సరైన ప్రాతినిధ్యం దక్కడంలేదు. అయితే ఇది గతం కానుంది. తాజాగా వైసీపీ సర్కార్‌ ఏర్పాటు చేయదల్చుకున్న కార్పొరేషన్ల ద్వారా అన్ని కులాల వారికీ పదవులు దక్కనున్నాయి. పార్టీలో ఆది నుంచి కష్టపడ్డ వారికి ప్రాధాన్యత దక్కే అవకాశం పుష్కలంగా ఉంది. దీంతో వైసీపీ నేతల్లో కోలాహలం నెలకొంది.

Read Also: టార్గెట్‌ విశాఖ..! మళ్లీ దుష్ప్రచారం మొదలెట్టిన ఎల్లో మీడియా..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp