1971 India-Pak War - కరాచీ దిగ్బంధం.. 1971 యుద్ధంలో మహోజ్వాల ఘట్టం

By Ramana.Damara Singh Dec. 04, 2021, 01:00 pm IST
1971 India-Pak War - కరాచీ దిగ్బంధం.. 1971 యుద్ధంలో మహోజ్వాల ఘట్టం

పాకిస్తాన్ నుంచి విముక్తి కోసం.. స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరణ కోసం తూర్పు పాకిస్తానీయులు చేస్తున్న ప్రయత్నాలకు భారత ప్రభుత్వం మద్దతు తెలపడంతో.. 1971లో ఇండో-పాక్ యుద్ధం అనివార్యమైంది. ఆ యుద్ధంలో భారత్ విజయం వెనుక మన నౌకాదళం సాహసకృత్యాలు, అరివీర భయంకరంగా సాగించిన దాడులు కీలకంగా మారాయి. ముఖ్యంగా  పాకిస్తాన్ ఆర్థిక రాజధాని అయిన కరాచీని భారత నావికాదళం దిగ్బంధించడంతో పాక్ కు తోక ముడవక తప్పని పరిస్థితి ఏర్పడింది. సోవియట్ రష్యా నుంచి అదే ఏడాది మొదట్లో కేవలం ఆత్మరక్షణ కోసం కొనుగోలు చేసిన క్షిపణి వాహక నౌకలను ఈ దాడుల్లో ఉపయోగించి విజయం సాధించడం అప్పట్లో రష్యా నౌకాదళ అధికారులనే విస్మయానికి గురిచేసింది.

డిసెంబర్ 4 రాత్రి తొలిదాడి

యుద్ధ తంత్రంలో భాగంగా పాక్ వాణిజ్య రాజధాని కరాచీ రేవును ముట్టడించి.. దిగ్బంధించాలని మన నౌకాదళం నిర్ణయించింది. పగటిపూట దాడులకు వెళితే పాక్ రాడార్లు గుర్తించే ప్రమాదం ఉన్నందున 1971 డిసెంబర్ 4న రాత్రి దాడులకు ముహూర్తం నిర్ణయించారు. కొత్తగా రష్యా నుంచి కొనుగోలు చేసిన మూడు క్షిపణి వాహక నౌకలు ఐఎన్ఎస్ నిఫాత్, నిర్ఘట్, వీర్ రాత్రి వేళ కరాచీ వైపు బయలుదేరాయి. రెండు పెట్యా తరగతి యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ కిల్టర్, కాచార్ వాటిని అనుసరించాయి. కరాచీ వాయువ్య తీరంలో పహారా కాస్తున్న పాక్ గస్తీ నౌక ఖైబర్ మొదట తారసపడింది. 1965 యుద్ధంలో ఈ నౌకే మన ద్వారకా నౌకా స్థావరంపై దాడికి పాల్పడింది. రాత్రి 10.15 గంటల సమయంలో కరాచీ వైపు వస్తున్న భారత నౌకలను గుర్తించిన ఖైబర్ దిశ మార్చుకుని వాటివైపు వెళ్లింది. 10.40 గంటల సమయంలో ఖైబర్ పై నిర్ఘట్ నౌక నుంచి తొలి క్షిపణిని ప్రయోగించారు. ఖైబర్ సిబ్బంది కూడా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్లతో కాల్పులు ప్రారంభించినా ఫలితం లేకపోయింది. భారత్ ప్రయోగించిన క్షిపణి ఖైబర్ బాయిలర్ రూమును తాకడంతో మంటలు అంటుకున్నాయి. ఆ వెంటనే నిర్ఘట్ సిబ్బంది మరో క్షిపణితో దాడి చేయడంతో ఖైబర్ వేగం పూర్తిగా మందగించింది. నౌకను దట్టమైన పొగలు అలుముకున్నాయి. 45 నిమిషాల్లోనే ఖైబర్ కరాచీకి 35 మైళ్ల దూరంలో నీట మునిగి జలసమాధి అయ్యింది.

Also Read : Central Minister Comments -అన్నమయ్య ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు, అసలు వాస్తవాలు

రాత్రి 11 సమయంలో నిఫాత్ నౌక రాడార్ కు ఎంవీ వీనస్ అనే నౌక కనిపించింది. దానిపైకి వెంటవెంటనే రెండు క్షిపణులను ప్రయోగించారు. దాంతో నౌకలో పొగలు కమ్ముకుని వెంటనే రెండు ముక్కలై కరాచీకి 26 మైళ్ల దూరంలో జలసమాధి అయ్యింది. ఆ నౌకలో పాకిస్థాన్ కు అమెరికా పంపిన ఆయుధాలు ఉన్నట్లు తర్వాత తెలిసింది. మరునాడు ఉదయం 11.20 గంటల సమయంలో మూడో క్షిపణి నౌక వీర్ మరో పాక్ యుద్ధ నౌక మూహాఫీజ్ పై దాడి చేసి 70 నిమిషాల్లోనే దాన్ని జల సమాధి చేసింది. మరోవైపు నిఫాత్ నౌక తన రాడార్ పరిధిలో కీమార్ చమురు కేంద్రం నుంచి వస్తున్న ట్యాంకర్ ను గుర్తించి కరాచీకి 18 మైళ్ల దూరంలో దానిపైకి క్షిపణి ప్రయోగించి నాశనం చేసింది.

ఆపరేషన్ పైథాన్

అక్కడికి రెండు రోజల తర్వాత కరాచీ రేవుపై మరో దాడికి ఆపరేషన్ పైథాన్ పేరుతో నౌకాదళం శ్రీకారం చుట్టింది. ఐఎన్ఎస్ వినాశ్ క్షిపణి వాహక నౌక కరాచీ వైపు బయల్దేరగా దానికి సహాయంగా త్రిశూల్, తల్వార్ యుద్ధనౌకలు అనుసరించాయి. అయితే కరాచీకి సమీపిస్తున్న తరుణంలో వినాశ్ నౌకలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో కరాచీ పోర్టుకు ఆనుకుని ఉన్న కీమార్ చమురు నిల్వ కేంద్రం వినాశ్ దృష్టిపథంలోకి వచ్చింది. వెంటనే నౌకలో ఉన్న బ్యాటరీల సహాయంతో దానిపైకి క్షిపణులను ప్రయోగించారు. అక్కడున్న మిగతా నౌకలపైనా దాడి చేశారు. దాంతో చమురు కేంద్రం భారీ మంటల్లో చిక్కుకుంది. కరాచీ రేవుకు కూడా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు, మంటలు 60 మైళ్ల వరకు కనిపించాయి. మూడు రోజులపాటు ఎండ కూడా కనిపించలేదు. మంటలను అదుపు చేయడానికి వారం రోజులు పట్టింది.

కరాచీ పోర్ట్ మొత్తాన్ని భారత నౌకాదళం దిగ్బంధించింది. అరేబియా సముద్రంలో కరాచీ ప్రాదేశిక జలాల్లోకి భారత అనుమతి లేకుండా పాక్ తో సహా ఇతర దేశాల నౌకలు ప్రవేశించలేని పరిస్థితి ఏర్పడింది. కరాచీ దిగ్బంధమే బంగ్లాదేశ్ యుద్ధంలో పాకిస్థాన్ చేతులెత్తేయడానికి ప్రధాన కారణంగా నిలిచింది. కాగా తాము అందజేసిన ఆత్మరక్షణ నౌకలతోనే భారత నావికాదళం ఇంత పెద్ద విజయం సాధించడం రష్యా నేవీ అధికారులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అప్పటి రష్యా నేవీ చీఫ్ అడ్మిరల్ గోర్షకోవ్ ఈ దాడుల్లో పాల్గొన్న ఇండియన్ నేవీ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

Also Read :, Prasanth Kishore - ప్రశాంత్ కిషోర్, రెండు లక్ష్యాలతో పావులు కదుపుతున్న వ్యూహకర్త

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp