కొల్లుకు రిమాండ్‌.. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు

By Kotireddy Palukuri Jul. 04, 2020, 02:34 pm IST
కొల్లుకు రిమాండ్‌.. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు

రవాణా శాఖ మంత్రి పేర్నినాని ముఖ్య అనుచరుడు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కర్‌ రావు హత్య కేసులో నిందితుడుగా ఉన్న కొల్లు రవీంద్రకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. నిన్న విచారణకు వచ్చిన పోలీసులు కళ్లు కప్పి పారిపోయిన రవీంద్రను నిన్న రాత్రి విశాఖకు వెళుతుండగా తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాత్రి గూడూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ రోజు వైద్య పరీక్షల అనంతరం కొద్దిసేపటి క్రితం మచిలీపట్నం రెండో అదనపు మేజిస్ట్రేట్‌ కోర్టు ముందు ఆన్‌లైన్‌ ద్వారా హజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌ను విధించారు. దీంతో పోలీసులు ఆయన్ను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

మోకా భాస్కర రావు హత్యలో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రే సూత్రధారి అని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఈ రోజు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ప్రధాన నిందితుడు చింతా చిన్ని ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా టెక్నికల్, ఇతర అంశాలను విచారించిన తర్వాతనే కొల్లు రవీంద్రను అరెస్ట్‌ చేశామని తెలిపారు. విచారణకు రావాలని తాము నోటీసు జారీ చేసిన తర్వాత కొల్లు రవీంద్ర తన ఇంటి వెనుక నుంచి నిచ్చెన సహాయంతో గొడ దూకి పారిపోయారని ఎస్పీ తెలిపారు. నాలుగు నెలలుగా మోకా భాస్కర రావు హత్యకు ప్లాన్‌ చేస్తున్నారని చెప్పారు. హత్య జరిగిన రోజుకు నాలుగు రోజుల ముందు ప్రధాన నిందితుడు చింతా చిన్న, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భేటీ అయ్యారని చెప్పారు. ఆ భేటీ సమయంలో రవీంద్ర పీఏ కూడా వారితో ఉన్నారని తెలిపారు. హత్యకు పథక రచన అంతా కొల్లు రవీంద్ర ఇంటి నుంచే జరిగిదని ఎస్పీ తెలిపారు. హత్య చేసిన తర్వాత నిందితుడు చిన్ని రవీంద్రకు ఫోన్‌ చేసి చెప్పాడని కూడా వెల్లడించారు.

Read Also : మంత్రి నాని అనుచరుడి హత్యలో కొల్లు రవీంద్రే సూత్రధారి.. వెల్లడించిన కృష్ణా ఎస్పీ

ఇటీవల భాస్కర్‌ రావును మచిలీపట్నం చేపల మార్కెట్‌ వద్ద కత్తులతో నరికి చంపారు. ఈ హత్య కేసులో కొల్లు రవీంద్ర ముఖ్య అనుచరుడు, మాజీ కౌన్సిలర్‌ చింతా చిన్ని తో సహా మరో నలుగురును అరెస్ట్‌ చేశారు. వారు ఇచ్చిన వాగ్మూలం ప్రకారం కొల్లు రవీంద్రను కూడా ఈ కేసులో నిందితుడుగా చేర్చారు. రవీంద్ర అరెస్ట్‌తో ఈ హత్య కేసులో అరెస్ట్‌ అయిన వారి సంఖ్య ఆరుకు చేరింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp