బీహార్‌లో కైమూర్ ప్రాంత గిరిజనులు సంచలన నిర్ణయం

By Srinivas Racharla Oct. 24, 2020, 08:03 pm IST
బీహార్‌లో కైమూర్ ప్రాంత గిరిజనులు సంచలన నిర్ణయం

రాజకీయ పార్టీల ప్రచారంతో బీహార్‌ హోరెత్తుతోంది.అధికార ఎన్డీయే,ప్రతిపక్ష మహా కూటమి ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి.అయితే 108 గ్రామాల గిరిజనులు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి రాజకీయపక్షాలకు షాక్ ఇచ్చారు.

బీహార్‌లోని కైమూర్ ప్రాంతంలో అటవీ శాఖ తమపై పోలీసులతో బలప్రయోగం చేయిస్తున్న నేపథ్యంలో గిరిజన గ్రామాల ప్రజలు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. కైమూర్ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కొంతకాలంగా కైమూర్ ముక్తి మోర్చా నాయకత్వంలో స్థానిక గిరిజనులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.తాజాగా పోలీసులు తప్పుడు కేసులు బనాయించి 25 మంది కైమూర్ ముక్తి మోర్చా కార్యకర్తలను అరెస్టు చేశారు. దీంతో పోలీసుల నిరంకుశ వైఖరికి నిరసనగా 108 గిరిజన గ్రామాల ప్రజలు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ని బహిష్కరిస్తున్నట్లు కైమూర్ ముక్తి మోర్చా ప్రకటించింది.

ఇక బీహార్‌లోని కైమూర్‌ను షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించాలని కైమూర్ ముక్తి మోర్చా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించాలనుకుంటే గ్రామ సభలను నిర్వహించి, గిరిజనుల అభిప్రాయాలను తెలుసుకోవాలని కేఎంఎం కోరుతుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 10న అధౌరా అటవీ శాఖ కార్యాలయం ఎదుట 108 గ్రామాలకు చెందిన వేలాది మంది ఆదివాసీలు శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఆందోళనలో పాల్గొన్న గిరిజనులను చెదరగొట్టేందుకు పోలీసులు విచక్షణా రహితంగా లాఠీఛార్జి చెయ్యగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.అలాగే ఏడుగురు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా కైమూర్‌ ప్రాంతంలోని గిరిజన గ్రామాల ప్రజలను బలవంతంగా అక్కడ నుంచి తరలించడాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. కానీ ఈ ఉత్తర్వులను నితీశ్ ప్రభుత్వం తుంగలో తొక్కడంతో గిరిజనులు పోరుబాట పట్టారు. అసంతృప్తితో ఉన్న కైమూర్ ఆదివాసులను ఎన్నికలలో పాల్గొనేటట్లు చేసేందుకు ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు చేపడుతుందని వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp