జనహితం కోసం మిలియన్ల డాలర్ల పేటెంట్ హక్కులు వదులుకున్న మహానుభావులు

By Sannapareddy Krishna Reddy May. 13, 2021, 09:30 pm IST
జనహితం కోసం మిలియన్ల డాలర్ల పేటెంట్ హక్కులు వదులుకున్న మహానుభావులు

కరోనా సెకండ్ వేవ్ దేశంలో మరణమృదంగం మోగిస్తున్న సమయంలో దాన్ని అదుపు చేయాలంటే వీలయినంత త్వరగా దేశ జనాభాలో కనీసం అరవై శాతం మందికి వాక్సీన్ వేయాలని నిపుణులు చెప్తున్నారు.

అయితే ఇప్పుడు దేశంలో అందుబాటులో ఉన్న కోవిషీల్డ్ కానీ కోవాక్సీన్ కానీ అందుకు తగినట్టుగా ఆరోగ్య సిబ్బందికి అందుబాటులోకి రాకపోవడంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో పాటు మరికొందరు కోవాక్సీన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ నుంచి ప్రభుత్వం పేటెంట్ హక్కులు తీసుకుని వాక్సీన్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న ఇతర సంస్థలకు అనుమతి ఇస్తే ప్రజలకు వాక్సీన్ వేయడం మరింత వేగవంతం అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కోవాక్సీన్ ఉత్పత్తిలో కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేసింది కాబట్టి ఈ డిమాండ్ సమంజసమే అవుతుంది.

Also Read:కోవాగ్జిన్ సాంకేతికత బదిలీకి కేంద్రం ఓకే -ఫలించిన జగన్ ప్రయత్నం

ఒకసారి వైద్య శాస్త్రం చరిత్ర చూస్తే శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణలు అందరికీ అందుబాటులో ఉండాలని మిలియన్ల డాలర్లు తెచ్చిపెట్టగల పేటెంట్ హక్కులు తృణప్రాయంగా వదులుకున్న ఉదాహరణలు కనిపిస్తాయి.

పోలియో వాక్సీన్ సృష్టికర్తలు
ఇరవయ్యవ శతాబ్దం మొదటి అర్ధభాగం వరకూ ప్రపంచమంతా చిన్న పిల్లలను పట్టి పీడించిన వ్యాధి పోలియో. చాలా మందిలో ఏ ఇబ్బంది లేకుండా తగ్గిపోయినా కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీసి, అంతకు మించి చాలా సార్లు జీవితాంతం అంగవైకల్యం కలిగించే ఈ వ్యాధిని నిరోధించే టీకాని 1952లో అమెరికా వైరాలజిస్ట్ జోనాస్ సాల్క్ ప్రజలకు అందించాడు. నిర్జీవం చేయబడిన వైరస్ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం వలన శరీరంలో ఏర్పడే యాంటీబాడీలు జీవితాంతం ఆ వ్యక్తికి పోలియో నుంచి రక్షణ కల్పిస్తాయి.

అయితే ఆ వాక్సీన్ కి తను పేటెంట్ తీసుకుంటే తనకు వందల మిలియన్ల డాలర్ల సంపద వస్తుందని తెలిసినా, వినియోగదారుల మీద ప్రతి డోసుకూ రెండు నుంచి మూడు డాలర్ల అదనపు భారం పడుతుందని గ్రహించి పేటెంట్ హక్కులు వదులుకున్నాడు. ప్రపంచంలో పేద, ధనిక తేడా లేకుండా ప్రతి బాలుడికీ తన టీకా చేరాలన్నది తన లక్ష్యమని, అందుకే పేటెంట్ హక్కులు వదులుకున్నానని ప్రకటించాడు సాల్క్. కొన్ని రోజుల తర్వాత ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో యాంకర్ పేటెంట్ గురించి అడిగిన ప్రశ్నకు "సూర్యుడు ఇచ్చే కాంతికి పేటెంట్ ఉందా? అది అందరికీ స్వంతం. అలాగే నా వాక్సీన్ కూడా" అని చెప్పాడు సాల్క్.

పోలియో వాక్సీన్ ఆవిష్కరణలో సాల్క్ తో పోటీ పడిన మరో వైరాలజిస్ట్ ఆల్బర్ట్ సాబిన్ రూపొందించిన నోటి ద్వారా ఇచ్చే వాక్సీన్ 1962లో మార్కెట్ లోకి వచ్చింది. సజీవంగా ఉండి, నిర్వీర్యం చేయబడిన వైరస్ ఇందులో ఉంటుంది. సాల్క్ రూపొందించిన వాక్సీన్ కన్నా సాబిన్ వాక్సీన్ తక్కువ ధరలో రూపొందించబడి, నోటిద్వారా తేలిగ్గా ఇచ్చే వీలు ఉండడంతో ఎక్కువ దేశాలు సాబిన్ వాక్సీన్ ని పోలియో మీద పోరాటంలో తమ ఆయుధంగా ఎంచుకున్నాయి. సాల్క్ వాక్సీన్ కన్నా తన వాక్సీన్ ఎక్కువగా వాడబడుతోందని, దాని వల్ల తనకు వచ్చే ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుందని తెలిసినా సాబిన్ కూడా సాల్క్ దారిలోనే ప్రతి ఒక్కరికీ తన వాక్సీన్ అందుబాటులో ఉండాలని పేటెంట్ హక్కులు తీసుకోలేదు.

Also Read:కరోనా బాధిత చిన్నారులకు బాసట

ఒక డాలరుకే ఇన్సులిన్ మీద పేటెంట్
మధుమేహం జబ్బు ఎప్పటినుండో వైద్యశాస్త్రానికి తెలిసినా దాన్ని ఎదుర్కోవడానికి తగిన ఆయుధం మాత్రం వైద్యుల చేతుల్లో లేదు. క్లోమం(పాంక్రియాస్) లో రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించే రసాయనం ఉందని తెలిసినా దానిని వేరుచేయగలిగే పద్ధతి కోసం జరిగిన ప్రయత్నాలు మాత్రం విఫలమవుతూ వచ్చాయి.

క్లోమంలోని లాంగర్ హాన్స్ కణాలు స్రవించే ఇన్సులిన్ ని వేరు చేసే పద్ధతిని 1923లో కెనడాకు చెందిన ఫ్రెడరిక్ బాంటింగ్, జేమ్స్ కోలిప్, ఛార్లెస్ బెస్ట్ కలిసి కనిపెట్టారు. వారు రూపొందించిన ఇన్సులిన్ రక్తంలో షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోయి, కోమాలోకి జారుకుని, మృత్యుముఖంలో ఉన్న అనేకమందిని బ్రతికించింది.

తమ ఆవిష్కరణకు ఉన్న ప్రాముఖ్యతను, బహుళజాతి మందుల కంపెనీల చేతిలోకి అది వెళ్తే దాని అవసరం ఉన్న రోగులకు కలగబోయే నష్టాన్ని సరిగా అంచనా వేసి, వాళ్ళు ఇన్సులిన్ మీద పేటెంట్ హక్కులు ఒక డాలరుకి యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకి ఇచ్చేశారు. అయితే ఇన్సులిన్ రూపొందించడంలో వేరువేరు పద్ధతులు వాడి అనేక కంపెనీలు అనేక రకాల ఇన్సులిన్లను రూపొందించి, వాటి ధరలు పెంచేసి దాని ఆవిష్కర్తల ఆశయాన్ని దెబ్బతీసి ఇన్సులిన్ వ్యాపారాన్ని తమ గుప్పిటలోకి తీసుకున్నాయి.

Also Read:వైసీపీ-తొలి విజయానికి దశాబ్దం

పేటెంట్ తీసుకోని సీట్ బెల్ట్ ఆవిష్కర్త
వైద్య రంగానికి చెందినది కాకపోయినా జనం కోసం పేటెంట్ హక్కులు వదులుకొన్న మరో ఆవిష్కరణ సీట్ బెల్ట్. మోటారు వాహనాల ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడే ముఖ్యమైన సాధనం సీట్ బెల్ట్ అని తెలిసినా దాన్ని ధరించడం, విప్పడం చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల చాలా మంది డ్రైవర్లు హైవేల మీద కూడా సీట్ బెల్ట్ ధరించకుండా డ్రైవ్ చేయడం, ప్రమాదం జరిగినప్పుడు చాలా సార్లు ప్రాణాలు కోల్పోవడం జరిగేది.

భద్రతలో రాజీ పడకుండా, తేలిగ్గా ధరించగల సీట్ బెల్ట్ రూపొందించడానికి అన్ని మోటారు కంపెనీలు ప్రయత్నాలు చేశాయి. స్వీడన్ కు చెందిన వోల్వో కంపెనీ సైంటిస్ట్ నీల్స్ బోలిన్ రూపొందించిన త్రీ పాయింట్ సీట్ బెల్ట్ తేలిగ్గా ధరించడం, తీయడంతో పాటు, పటిష్టమైన భధ్రత కూడా ఇవ్వగలగడంతో చిన్న పాసెంజరు కార్ల నుంచి తాము తయారు చేసే భారీ వాహనాల్లో కూడా దాన్ని వాడడం మొదలుపెట్టింది వోల్వో కంపెనీ. జనం భధ్రతకు సంబంధించిన ఆవిష్కరణ కాబట్టి, బిలియన్ల డాలర్లు తెచ్చిపెట్టగల సీట్ బెల్ట్ మీద వోల్వో కంపెనీ కానీ, బోలిన్ కానీ పేటెంట్ హక్కులు తీసుకోలేదు. ఆ తర్వాత అందరు మోటారు వాహనాల తయారీదారులు తమ అన్ని వాహనాల్లో వోల్వో కంపెనీ రూపొందించిన సీట్ బెల్ట్ డిజైనునే ఈనాటికీ వాడుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp