మిర్యాలగూడ మారుతీరావు షెడ్ లో మరో మిస్టరీ

By Sridhar Reddy Challa Mar. 02, 2020, 03:35 pm IST
మిర్యాలగూడ మారుతీరావు షెడ్ లో మరో మిస్టరీ

2018లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువుహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు మిర్యాలగూడకు చెందిన మారుతీరావుకు చెందిన ఒక షెడ్ లో గుర్తుతెలియని మృతదేహం లభించడం సంచలనంగా మారింది. దీనితో మరోసారి మారుతీరావు పేరు ప్రముఖంగా వినపడుతుంది. మిర్యాలగూడ పట్టణం శివారుల్లోని అద్దంకి-నార్కెట్ పల్లి ప్రధాన రాహదారి పక్కన మారుతీరావుకి సంబంధించిన స్థలంలో ఒక షెడ్ వుంది. గతంలో ఇందులో ఒక హోటల్ నిర్వహించినట్టు సమాచారం. అయితే గతంలో ఆ షెడ్ ముందు ప్రధాన రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణ సమయంలో ఆ షెడ్ లో నిర్వహిస్తున్న హోటల్ ని మూసివేశారని తెలుస్తుంది.

అయితే అప్పటినుండి ఖాళీగా ఉంటున్న ఆ షెడ్ లో తాజాగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వెలుగుచూడడం సంచలనంగా మారింది. పోలీసులు చెబుతున్న దానిని బట్టి వారంరోజుల క్రితమే ఆ మృతదేహన్ని గదిలో వేసినట్టు అనుమానిస్తున్నారు. అయితే మృతదేహం పక్కనే ఒక గొనె సంచి లభించడంతో ఎక్కడో హత్యా చేసి ఆ సంచిలో మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారా?? లేదా ఏదైనా ప్రమాదం జరగడంతో ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇక్కడ పడేశారో అన్న సంగతి విచారణలో తేలాల్సి ఉంది. మృతదేహాన్ని గుర్తు పట్టకుండా చిక్కటి ఆయిల్ చల్లడంతో కేసు ఇప్పడు మిస్టరీగా మారింది. ఆయిల్ చల్లడం వల్ల ఘటన జరిగిన వారం వరకు ఆ ప్రాంతంలో ఎటువంటి దుర్వాసన రాకపోవడంతో మృతదేహం తాలూకు ఆనవాళ్లు బయటపడేసరికి ఆలస్యమయ్యిందని పోలీసులు చెబుతున్నారు.

మృతుడి వయసు 35-40 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు అనుమాదాస్పద మృతిగా కేసు నమోదు చేసిన దర్యాప్తును ప్రారంభించారు. మిర్యాలగూడా టు టౌన్ ఎస్సై శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే మృతదేహం ఉన్న గదిలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో నల్గొండ నుండి క్లూస్ టీం సంఘటన స్థలాన్ని పరిశీలించి డెడ్ బాడీ వేలిముద్రలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

తమ ఏకైక కుమార్తె అమృతవర్షిణి (అమృత) తమని కాదని దళితుడైన పెరుమళ్ళ ప్రణయ్ కుమార్ (ప్రణయ్) ని కులాంతర వివాహం చేసుకుందనే కక్షతో మిర్యాలగూడ కు చెందిన వ్యాపారవేత్త తిరునగరు మారుతీరావు అతని సోదరుడు శ్రవణ్ కుమార్ తో కలసి హత్యకు పధక రచన చేసి ఉత్తరప్రదేశ్ కి చెందిన అబ్దుల్ కరీం అనే వ్యక్తి కి సుపారీ ఇచ్చి 2018 సెప్టెంబర్ 14 న మిర్యాలగూడలో తన భార్య, తల్లితో కలసి ఆసుపత్రి నుండి బయటకి వస్తున్న ప్రణయ్ ని అత్యంత దారుణంగా హత్య చేయించిన ఘటన అప్పట్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటపై అప్పట్లో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. భర్తని హత్య చేయించిన తన తండ్రిని కఠినంగా శిక్షించాల్సిందేనని మారుతీరావు కూతురు అమృత స్వయంగా మీడియా ముందుకు వచ్చిన పలుమార్లు డిమాండ్ చేసింది.

అయితే ఆ హత్యకేసులో అరెస్టయ్యి వరంగల్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మారుతీరావు హైకోర్టుని ఆశ్రయించి 2019 ఏప్రిల్ 28న బెయిల్ ద్వారా జైలు నుండి బయటకి వచ్చాడు. అప్పటినుండి ఆయన బయటే ఉన్నాడు. మారుతీరావు జైలునుండి బయటకి వచ్చిన తరువాత కూడా తనకు తండ్రి వైపు నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అమృత పలుమార్లు ఆరోపించింది. కాగా తాజాగా మారుతీరావుకి చెందిన స్థలంలో అనుమానాస్పదస్థితిలో మృతదేహం లభించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp