ఎయిర్ ఇండియా - ఎక్కడ మొదలైందో అక్కడకే చేరింది

By Ramana.Damara Singh Oct. 01, 2021, 09:00 pm IST
ఎయిర్ ఇండియా - ఎక్కడ మొదలైందో అక్కడకే చేరింది

పెట్టుబడుల ఉప సంహరణ.. ప్రైవేటీకరణ.. నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను వదిలించుకోవడం.. పేరు ఏదైనా మొత్తానికి ఎయిర్ ఇండియా మళ్లీ కన్నవారింటికి చేరింది. తనకు పురుడు పోసి జన్మనిచ్చిన టాటా గ్రూపులో చేరనుంది. ఈ మేరకు టాటా సన్స్ సమర్పించిన బిడ్ కు ముగ్గురు సభ్యుల మంత్రుల కమిటీ ఆమోదం తెలపడంతో ఎయిరిండియా టాటాల సొంతం కానుందని తేలిపోయింది. ఒకనాడు జాతీయీకరణ పేరుతో టాటాల నుంచి అప్పటి కేంద్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది. 68 ఏళ్ల తర్వాత అదే కేంద్ర ప్రభుత్వం నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేట్ పరం చేసే క్రమంలో మళ్లీ టాటాల చేతిలోనే పెడుతోంది. ఈ మధ్య కాలంలో ఎయిర్ ఇండియా అనేక మార్పులు, ఆటుపోట్లను ఎదుర్కొంది.

టాటా ఎయిర్ సర్వీసుగా ప్రారంభం

భారత పారిశ్రామిక పితామహుడిగా పేరుపొందిన జేఆర్డీ టాటా విమాన రంగంపై ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తితోనే 1929లోనే దేశంలో లైసెన్స్ పొందిన మొట్టమొదటి పైలట్ గా గుర్తింపు పొందారు. సొంతంగా విమానయాన సంస్థ ఏర్పాటు చేయాలని నిశ్చయించుకొని 1932లో టాటా ఎయిర్ సర్వీస్ పేరుతో సంస్థ ప్రారంభించారు. ఆ సంస్థకు చెందిన మొదటి సర్వీసును ఆయనే స్వయంగా నడిపారు. సింగిల్ ఇంజిన్ విమానంలో కరాచీ నుంచి ముంబైకి ఎయిర్ మెయిల్ తీసుకొచ్చారు. 1938లో సంస్థ పేరును టాటా ఎయిర్ లైన్స్ గా మార్చారు. రెండో ప్రపంచ యుద్ధం తరవాత 1946లో ఎయిర్ ఇండియాగా మారి పబ్లిక్ లిమిటెడ్ సంస్థగా అవతరించింది. 1948లో కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థలో 49 శాతం వాటాలు కొనుగోలు చేసి భాగస్వామిగా మారింది. 1953లో జాతీయీకరణ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాను పూర్తిగా స్వాధీనం చేసుకుంది.

Also Read : టాటా చేతికి ఎయిర్ ఇండియా..?

టాటా విజ్ఞప్తికి నెహ్రూ నో

ఎయిర్ ఇండియాను ప్రభుత్వానికి స్వాధీనం చేయడం టాటాకు ఇష్టం లేదు. 1950 తర్వాత జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జాతీయీకరణ కార్యక్రమం చేపట్టింది. ప్రైవేట్ రంగంలో ఉన్న పెద్ద సంస్థలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. అప్పటి కమ్యూనికేషన్ల మంత్రి జగ్జీవన్ రామ్ ఈ అంశాలను పర్యవేక్షించారు. ఆ క్రమంలో ఆయన జేఆర్డీ టాటాతో సంప్రదింపులు జరిపారు. కానీ ఎయిర్ ఇండియా విషయం కాకుండా స్వాధీనం చేసుకునే ప్రైవేట్ సంస్థల యజమానులకు ఇవ్వాల్సిన పరిహారం గురించే మాట్లాడారు.

ఎయిర్ ఇండియాను కూడా కేంద్రం తీసుకోవాలనుకుంటున్న విషయం తెలుసుకున్న టాటా ప్రధానమంత్రి నెహ్రూకు లేఖ రాశారు. ఎయిర్ ఇండియాను తీసుకుంటున్న విషయంలో తమను సంప్రదించలేదని, కనీసం మాట మాత్రంగానైనా చెప్పలేదని ఆక్షేపించారు. సంస్థను తమకే వదిలేయాలని కోరారు. దానికి స్పందించిన నెహ్రూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని.. దాన్నుంచి వెనక్కి వెళ్లలేమని వివరించారు. టాటాను చల్లబరచడానికేమో అన్నట్లు ఎయిర్ ఇండియాను టేక్ ఓవర్ చేసుకున్నా.. దానికి చైర్మన్ గా ఆయన్నే నియమించారు. 1977 వరకు ఆయన ఆ పదవిలోనే కొనసాగారు.

Also Read : క‌బ్జా కేసులో ఎంపీ గల్లా జయదేవ్

సుదీర్ఘ ప్రస్థానం అనంతరం మళ్లీ సొంతింటికి..

ప్రభుత్వరంగ సంస్థగా మారిన ఎయిర్ ఇండియా 1948 జూలై ఎనిమిదో తేదీన ముంబై నుంచి లండన్ కు మొదటి అంతర్జాతీయ విమాన సర్వీసు నడిపింది. మలబార్ ప్రిన్సెస్ అనే పేరుతో ఉన్న విమానం ఆ ఖ్యాతి దక్కించుకుంది. తర్వాత కాలంలో బహుముఖంగా విస్తరించింది. 1960లో బోయింగ్ 707, 1971లో బోయింగ్ 747 విమానాలను సమకూర్చుకున్న ఎయిర్ ఇండియా వందలాది దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఎయిర్ ఇండియా నుంచి దేశీయ సర్వీసులను విడదీసి ప్రత్యేకంగా ఇండియన్ ఎయిర్ లైన్స్ ఏర్పాటు చేశారు.

నష్టాల పేరుతో 2007లో మళ్లీ ఆ సంస్థను ఎయిర్ ఇండియాలో విలీనం చేశారు. దాంతో ఆర్ధిక భారం పెరిగి ఎయిర్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయింది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్లో వంద శాతం పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన మోదీ ప్రభుత్వం ఎయిర్ ఇండియాతోనే దాన్ని మొదలు పెట్టింది. అమ్మకం ప్రక్రియను 2020 జనవరిలోనే ప్రారంభించారు. అయితే కోవిడ్ సంక్షోభంతో జాప్యం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు ఆహ్వానించింది. గత నెలలో ఆర్థిక బిడ్లు దాఖలు కాగా కేంద్ర మంత్రుల బృందం పరిశీలించి టాటా బిడ్ కు ఆమోదం తెలపడంతో ఎయిర్ ఇండియా మళ్లీ సొంత ఇంటికి చేరనుంది.

Also Read : క‌రోనా స‌మ‌యంలో కూడా కుబేరుల సంప‌ద ఎంత పెరిగిందో తెలుసా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp