భూములను తడపబోతోన్న గోదారమ్మ

By Jaswanth.T Jun. 15, 2021, 10:30 am IST
భూములను తడపబోతోన్న గోదారమ్మ

గోదావరి డెల్టా ప్రాంతంలో సాగు భూములకు నీటి విడుదలకు ఇరిగేషన్‌ అధికారులు సమాయత్తమయ్యారు. మంగళవారం ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి వద్ద నుంచి నీటి విడుదలను ప్రారంభించనున్నారు. ఎక్కడో మహాబలేశ్వరం వద్ద నుంచి పుట్టుకువచ్చే గోదారమ్మ భద్రాచలం వద్ద శబరి నది కలయికతో అఖండగోదావరిగా రూపుమార్చుకుంటుంది. పాపికొండలు దాటిన తరువాత దాదాపు మూడు కిలోమీటర్ల వెడల్పుతో ఉగ్రరూపంతో సముద్రంవైపు పయనిస్తుంటుంది.

మహోగ్రంగా తరలివచ్చే గోదావరి నీటిని ధవళేశ్వరం బ్యారేజి వద్ద నుంచి తూర్పు డెల్టా, మద్య డెల్టా, పశ్చిమ డెల్టాలకు మళ్ళిస్తారు. ఇందు కోసం ధవళేశ్వరం వద్ద తూర్పుడెల్టా కాలువ, ఆత్రేయపురం వద్ద మధ్యడెల్టా, విజ్జేశ్వరం (పశ్చిమగోదావరివైపు) పశ్చిమ డెల్టా కాలువలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి ఖరీఫ్‌ సీజన్‌లోనూ 10,13,161 ఎకరాలకు సాగు నీరు, ఆయా ప్రాంతాల్లో త్రాగునీటి అవసరాలకు గోదావరి నీరు అందుతుంది. అలాగే రబీలో 8,96,533 ఎకరాలకు సాగు, త్రాగునీరు అందుతుంది. ఖరీఫ్‌కు విడుదల చేసిన నీటి ద్వారానే ఈ మూడు డెల్టాల పరిధిలో ఉన్న చెరువులు నింపడానికి కూడా వినియోగిస్తారు. రబీలో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో అప్పుడు చెరువులు నింపేందుకు నీటిని వినియోగించరు.

110 టీయంసీలే..

మూడు డెల్టాల పరిధిలోనూ దాదాపు 10లక్షలకు పైగా ఎకరాల్లో సాగు, త్రాగునీరు అవసరాలకు 110 టీయంసీల నీరు సరిపోతుందంటే ఆశ్చర్యం కలగకమానదు. గత యేడాది వర్షాలు అధికంగా కురవడంతో 110 టీయంసీలను మాత్రమే విడుదల చేసారు. ఒక వేళ వర్షాభావ పరిస్థితులు ఎదురైతే ఇప్పటి వరకు మాగ్జిమమ్‌ విడుదల చేసిన నీరు 140 టీయంసీలుగా బ్యారేజీ వద్ద రికార్డులు చెబుతున్నాయి.

గోదావరికి ఎటువంటి వరద పోటు లేని సమయంలోనే 1000 టీయంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతుంటుంది. ఈ లెక్కన ఎన్ని లక్షల ఎకరాలకు సాగు, త్రాగు నీరు అందివచ్చో లెక్కేస్తే సంభ్రమాశ్చర్యంగానే ఉంటుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఎటువంటి పూడిక లేకపోతే కేవలం మూడు టీయంసీల కంటే తక్కువ నీటిని మాత్రమే నిల్వ చేయగలదు. కేవలం నీటిని కాలువల్లోకి మళ్ళించుందుకు అనువుగా మాత్రమే ఈ బ్యారేజ్‌ను నిర్మించడం జరిగింది. అందువల్లనే నిల్వ సామర్ధ్యం ఉండదు.

Also Read : నలుగురు ఎమ్మెల్సీలకు గవర్నర్‌ ఆమోదం

వేలాది టీయంసీల నీరు వృథాగా సముద్రంలోకి పోతున్న కారణంగానే ఆ నీటిని నిల్వ చేసుకుని అవసరాలకు వాడుకోవచ్చునన్న ఆలోచనతోనే పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసారు. పోలవరం వద్ద నీటిని నిల్వచేసుకోవడం ద్వారా రబీలో ఎదురయ్యే నీటి ఎద్దడి నుంచి బైటపడొచ్చు. రబీలో నీటి ఎద్దడి కారణంగా శివారు ప్రాంతాల్లో పంటలు ఎండిపోవడం వంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎదురు కాకుండా పోలవరం ప్రాజెక్టు వద్ద నిల్వ చేసిన గోదావరి నీరు తోడ్పడుతుంది.

ఇప్పటికే మూడు డెల్టాల పరిధిలోనూ 21.77 కోట్లతో 178 ఆపరేషన్స్‌ అండ్‌ నిర్వహణ పనులను పూర్తి చేసి నీటి పారుదలకు ఆటంకాల్లేకుండా చర్యలు చేపట్టారు. కాలువలకు నీటి విడుదల అనంతరం తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలో వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp