గాడిద త‌న్నుఎలా ఉంటుందంటే ..

By G.R Maharshi Jan. 16, 2020, 10:18 pm IST
గాడిద త‌న్నుఎలా ఉంటుందంటే ..

నాకు చిన్న‌ప్ప‌టి నుంచి గాడిద అంటే ఇష్టం. శంక‌ర‌ప్ప అనే రాక్ష‌సుడు భూమ్మీద అయ్య‌వారుగా జ‌న్మించి మా క్లాస్‌కి వ‌చ్చేవాడు. బోధ‌న త‌క్కువ‌, బాధ‌డం ఎక్కువ‌. మా దుర‌దృష్టం కొద్ది మేద‌ర‌వీధిలో ఉండేవాడు. రోజూ ఒక ఈత బెత్తంతో మోత మోగించేవాడు. ఎవ‌రినీ పేరు పెట్టి పిలిచేవాడు కాదు, అరే గాడిదా, అడ్డ గాడిదా అని సాధార‌ణంగానూ, జీతాలు లేట్ అయిన‌ప్పుడు గాడిద కొడ‌కా అనేవాడు. నా లాంటి కొడుకుని క‌న్నందుకు మా నాన్న‌కి ఆ మాత్రం తిట్లు ప‌డాల్సిందే!

ఆ ర‌కంగా గాడిద మీద ప్రేమ క‌లిగింది. దాని ప్ర‌త్యేక త ఏమంటే సౌమ్యంగా ఉంటుంది. చిరాకు ప‌డ‌దు. ఓండ్ర పెడితేనే డేంజ‌ర్‌, చెవుల తుప్పు వ‌దిలిపోతుంది. నిజానిక‌ది ఓండ్ర కాదు. గాడిద చాకిరి ఎక్కువై దేవున్ని ప్ర‌శ్నిస్తుందంట‌.

దేవుడా ...ఉన్నావా లేవా, ఉన్నావా లేవా, ఉన్నావా లేవా , లేవు పోరా నా కొడ‌కా! అని ముగిస్తుంది. ఇప్పుడు గాడిద‌లు క‌న‌ప‌డ్డం లేదు కాబ‌ట్టి, ఈ ఆర్త‌నాధం మీకు విన‌ప‌డ‌దు, అర్థం కాదు. దేవుడికే కోపం వ‌చ్చి గాడిద‌ల సంఖ్య‌ని త‌గ్గించి , ఆ స్థానంలో మ‌నుషుల్ని భ‌ర్తీ చేస్తున్నాడు.

చాక‌లోళ్ల పిల్లోడు మార‌న్న నా స్కూల్ స్నేహితుడు. వాటితో స్నేహం చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం వాడు రెండు గాడిద‌ల య‌జ‌మాని. వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా వాడి ఇంటికి వెళ్లేవాడిని. ఇంటి నిండా బ‌ట్ట‌ల మూటెలు ఉండేవి. వాళ్ల నాన్న చ‌మ‌ట‌లు కారుస్తూ ఎప్పుడూ ఇస్త్రే చేస్తుండే వాడు. వేడి ఇస్త్రీ పెట్టె మీద నీళ్లు చిల‌క‌రిస్తే అవి బుడ‌గ‌ల‌గా మారి పేలి పోయేవి. ఇదో స‌ర‌దా.

వాడి ఇంటి ముంద‌ర వేప చెట్టుకి ఈ గాడిద‌ల్ని క‌ట్టేసే వాళ్లు. అవి రెండు గ‌డ్డి తింటూ , చెవులు క‌దిలిస్తూ, ముక్కుతో శ‌బ్దాలు చేస్తుండేవి. మార‌న్న నోటితో ఏవో సౌండ్స్ చేస్తే రియాక్ష‌న్ ఇచ్చేవి. నేను ఫ్రెండ్సిప్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించా కానీ, ఒక గాడిద‌కి , ఇంకో గాడిద న‌చ్చ‌దు. న‌న్ను ప‌ట్టించుకునేవి కావు.

రోజుమార్చి రోజు తెల్లార‌గానే పెద్ద బ‌ట్ట‌ల మూటె వేసుకుని అవి రెండు మార్చ్ చేసుకుంటూ రేవుకు వెళ్లేవి. అక్క‌డ బ‌ట్ట‌లు దించేసి త‌చ్చాడుతూ ఉండేవి. ఈ విశ్రాంత స‌మ‌యంలో మార‌న్న వాటిపై స్వారీ చేసేవాడు. చెవుల్ని గ‌ట్టిగా ప‌ట్టుకుని, కాళ్ల‌ని పొట్ట దగ్గ‌ర అదిమి పెట్టి , ఒక క‌ర్ర పుల్ల‌తో పిర్రెల మీద కొడితే గాడిద , గుర్రం అయ్యేది. స్వారీకి నేను కూడా ఉత్సాహ ప‌డితే "వ‌ద్దురా మా అమ్మ కొడుతుంది" అని వాడు వారిస్తూ సింగిల్‌గా గండికోట ర‌హ‌స్యంలో NTR లా గాడిద‌ని, గుర్రం అనుకుని ఉరికించేవాడు.

భ‌లే త‌మ్ముడు సినిమా చూసి దొంగ‌ల నాయ‌కుడిలా బ‌త‌కాల‌ని అనుకున్న నాకు , చివ‌రికి గాడిద కూడా ద‌క్క‌క‌పోయే స‌రికి దిగులు దుక్కం ఒకేసారి వ‌చ్చాయి. మ‌న‌కంటూ సొంత గాడిద లేక‌పోవ‌డం వ‌ల్ల క‌దా, ఈ అవ‌మానం!
అస‌లు గాడిద‌ల్ని ఎక్క‌డ అమ్ముతారు?

జాత‌ర్ల స‌మ‌యంలో ప‌శువుల సంత జ‌రుగుతుంద‌ని తెలుసు. ఎద్దులు కావాల్సిన రైతులు అక్క‌డికి వెళ్లి కొంటారు. మ‌రి గాడిద‌ల సంత‌, అదే తెలుసుకోవాలి.

మా స్కూల్ ద‌గ్గ‌ర ఒక పిచ్చాయ‌న ఉండేవాడు. చెట్టు ఎక్కి త‌ల‌కిందులుగా వేలాడేవాడు. ఆయ‌న స్పెషాలిటీ ఏమంటే ఆంజ‌నేయ‌స్వామితో క‌బుర్లు చెప్పేవాడు. దేవుడితోనే మాట్లాడేవాడికి , గాడిద‌ల గురించి తెలియ‌కుండా ఉంటుందా?
ఆయ‌నకి రెండు కంబ‌ర క‌ట్‌లు (బెల్లం పాకం గ‌ట్టి ప‌డితే కంబ‌ర్ క‌ట్ అవుతుంది. వాటినే జీళ్లు అని కూడా అంటారు) లంచంగా ఇచ్చాను. వాటిని ఈ రోజు ఉద‌యం న‌మ‌ల‌డం స్టార్ట్ చేస్తే రేపు సాయంత్రానికి పూర్త‌వుతాయి. చిన్న‌ప్పుడు నా ప‌ళ్ల‌న్నికంబ‌ర్ క‌ట్ సాయంతోనే ఊడిపోయాయి.

పిచ్చాయ‌న కంబ‌ర్ క‌ట్ మైకంలో ఉండ‌గా గాడిద‌ల సంత గురించి అడిగాను. ఆయ‌న ఆలోచించి ఆంజ‌నేయ‌స్వామి స‌ల‌హా అడిగి, గొంతు స‌వ‌రించుకుని
"గాడిద‌ల సంత అంటే స్కూల్ రా" అని న‌వ్వాడు.
పిచ్చోళ్ల‌తో మాట్లాడితే, మ‌న‌మూ పిచ్చోళ్ల‌మై పోతాం.
గాడిద స్వారీ చేయాలంటే, మారిగాడి చేయి త‌డ‌పాల్సిందే. బ‌ఠాణీలు తీసుకెళ్లి వాడి జేబులో పోశాను. క‌ర‌క‌ర‌మ‌ని న‌ములుతూ మెత్త‌బ‌డ్డాడు.

చేతిలో రెండు గాడిద‌లు ఉన్న‌ప్పుడు, బుద్ధి ఉన్న‌వాడు ఎవ‌డైనా దొంగ‌ల నాయ‌కుడిగా మారుతాడు కానీ, స్కూల్‌కి పోయి శంక‌ర‌ప్ప చేతిలో దెబ్బ‌లు తింటాడా? దెబ్బ‌లంటే మామూలు దెబ్బ‌లా? నిక్క‌ర్ల మీద దుమ్ము గాలికి లేచి , పిర్రెల మీద కుడుములు మొలుస్తాయి. బ‌ఠాణీలు అయిపోయే వ‌ర‌కు నా మాట‌లు విని , త‌ర్వాత "మా అమ్మ కొడుతుంది" అనేవాడు మార‌న్న‌.

నాలుగైదు రూపాయ‌ల బ‌ఠాణీలు తిన్న త‌ర్వాత వాడిలో విశ్వాసం మొగ్గ తొడిగింది. గాడిద‌ల మీద బ‌ళ్లారికి పారిపోవ‌డానికి ఒప్పుకున్నాడు. బ‌ళ్లారి ఎక్క‌డుందో వాడికి తెలియ‌దు. నాకూ తెలియ‌దు. అయితే దారిలో క‌నీసం రెండు మూడు దోపిడీలు చేస్తాం కాబ‌ట్టి , ఎవ‌రో ఒక్క‌రు చెబుతారు.

స్కూల్‌కి ఎగ‌నామం, గాడిద‌ల‌పై బ‌ళ్లారికి ప‌రారీ, కొత్త దొంగ‌ల ముఠా ఆవిర్భావం. గుప్పిళ్ల కొద్ది బ‌ఠాణీలు న‌ష్ట‌పోవ‌డం వ‌ల్ల ఏర్ప‌డిన ప్ర‌ణాళిక‌. దీన్ని ఎంతో కొంత క్యాష్ చేసుకోవ‌డం మాన‌వ ధ‌ర్మం.

ఎవ‌రికీ చెప్ప కూడ‌ద‌ని ప్ర‌మాణాలు చేయించుకుని ఈ ర‌హ‌స్యాన్ని చాక్లెట్ల‌కి , పుల్ల ఐస్‌క్రీమ్‌కి అమ్మేశాను. నేను న‌లుగురికి అమ్మితే , మార‌న్న ఆరుగురికి అమ్మాడు. ఎంతైనా గాడిద‌ల య‌జ‌మాని క‌దా.

ఆదివారం ఉద‌యం ముహూర్తం, మార‌న్న అమ్మానాన్న రేవులో బిజీగా ఉంటారు. గాడిద‌లు ఫ్రీగా ఉంటాయి. అనుకున్న టైంకి ప‌రారీ స‌భ్యులు వ‌చ్చారు. మొత్తం 20 మంది. మేం 10 మందికి ర‌హ‌స్యం అమ్మితే 20 మంది వ‌చ్చారు. ర‌హ‌స్య‌మంటే అంతే, దానికి గుణింతాలు బాగా వ‌చ్చు.

ఉన్న‌వి రెండు గాడిద‌లు. నేను, మారన్న క‌లిస్తే 22 మంది. దొంగ‌ల ముఠాకి స‌రిప‌డా జ‌నం. కానీ బ‌ళ్లారికి పారిపోవ‌డం ఎలా?
ఒక్క దోపిడీ కూడా జ‌ర‌క్కుండానే గొడ‌వ మొద‌లైంది.
ఈ గ్రూప్‌లో వీర‌భ‌ద్రుడు అనేవాడు బ‌లంగా ఉన్నాడు. వాళ్ల‌మ్మ పాలు పెరుగు అమ్ముతుంది. జ‌నానికి నీళ్లు పోసినా , కొడుక్కి మీగ‌డ‌, వెన్న తినిపించి పెంచింది. మిగిలిన వాళ్లంతా నీళ్ల పాలు బాప‌తు కదా!
మొద‌ట స్వారీ త‌న‌దేన‌ని వీర‌భ‌ద్రుడు అడ్డం తిరిగాడు. మార‌న్న ఒప్పుకోలేదు. దాంతో వీర‌భ‌ద్రుడు వాడి కాల‌ర్ ప‌ట్టుకున్నాడు.
అంతే ...."గీకిమ్‌...య్" అని గాడిద Sound, దాని వెనుక కాళ్లు గాల్లో కనిపించాయి. ఆ త‌ర్వాత వీర‌భ‌ద్రుడు కూడా గాల్లోనే ఉన్నాడు.
మ‌రుస‌టి రోజు మార‌న్న కుంటుతూ స్కూల్‌కి వ‌చ్చాడు.
."కొడ‌క‌ల్లారా , మా అమ్మ ఎట్లా కొట్టిందో చూడుష‌ - ఒంటి మీద ఎర్ర‌టి చార‌ల‌తో పులిలా ఉన్నాడు వాడు.
బ‌ళ్లారి ప‌రారీ, దారి దోపిడీ అన్న అంతర్థాన‌మై, ఎదురుగా శంక‌ర‌ప్ప ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు.
నిగ‌నిగ‌లాడే బెత్తం....సుయ్‌సుయ్‌మ‌ని ధ్వ‌ని.
పిర్ర‌లు పూరీల్లా ఉబ్బుతున్నాయి.

గాడిద‌ల్లారా ...బ‌ళ్లారికి పారిపోతారా...ఎవ‌ర్రా మీ లీడ‌ర్‌.
నాతో స‌హా అంద‌రూ మార‌న్న వైపు చూపించారు.
గాడిద‌ల ఓన‌ర్ కావ‌డం వ‌ల్ల సాక్ష్యాలు బ‌ల‌ప‌డ్డాయి.
వాడి అరుపుల‌ ముందు గాడిద ఓండ్రింపు ప‌నికి రాలేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp