నాన్నా పులి! ఒక అబ‌ద్ధ‌పు క‌థ‌!

By G.R Maharshi Jul. 29, 2021, 08:00 pm IST
నాన్నా పులి! ఒక అబ‌ద్ధ‌పు క‌థ‌!

మ‌నిషి పులిని చంపితే వేట‌. పులి మ‌నిషిని చంపితే హింస‌, దాడి. పులిని మ‌నిషి బంధిస్తే అది స‌ర్క‌స్‌. మ‌నిషిని పులి బంధించ‌దు. తినేస్తుంది. దానికి అంత తెలివిలేదు. నిజానికి జంతువుల‌న్నీ జ్ఞానులు. త‌మ గురించి ఇత‌రులు ఏమ‌నుకుంటారో అన‌వ‌స‌రం. త‌మ ఇష్టానికి జీవిస్తాయి.

జూలై 29 అంత‌ర్జాతీయ పులుల దినోత్స‌వం. ఈ విష‌యం పులికి తెలియ‌దు. అందుకే సెల‌బ్రేట్ చేసుకోదు. పులి ఒక మృగ‌మే అయినా, దానికి మ‌నుషుల‌తో అవినాభావ సంబంధ‌ముంది. నిజానికి మ‌నిషే అస‌లు మృగం, కోర‌లు, చార‌లు పైకి క‌న‌బ‌డ‌వు.
ప్ర‌తి మ‌నిషి పులిని స‌ర్క‌స్‌లోనో, జూలోనో చూసి ఉంటాడు. అడ‌విలో చూసే అవ‌కాశం అంద‌రికీ రాదు. ఒక‌సారి ముదుమ‌లై అడ‌విలో స‌ఫారీ వెళ్లాం. పులి క‌నిపిస్తుంద‌ని ఆశ‌పెట్టారు కానీ, జింక‌లు మాత్ర‌మే క‌న‌బ‌డ్డాయి. త‌ల‌కోన అడ‌విలో వుంది కానీ, అదృష్టం కొద్దీ ఎదురుప‌డ‌లేదు.

త‌ల‌కోన ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో వెంక‌టేష్ వాచ్‌మ‌న్‌. అత‌ని ఇంటికి ఒక‌రాత్రి పులి వ‌చ్చింది. త‌లుపులు వేసుకుని, భార్యాపిల్ల‌ల‌తో వ‌ణుకుతూ వుండిపోయాడు. తెల్లారే వ‌ర‌కూ అత‌ని ఇంటికి కాప‌లా కాసి వెళ్లిపోయింది. ఇంత రిస్క్ వుద్యోగం ఎందుకు చేస్తున్నావ‌ని అడిగాను. పులి ఒక రోజు వ‌చ్చి వెళ్లిపోతుంది. తింటే ఒకేసారీ తింటుంది. ఆక‌లి రోజూ వుంటుంది, రోజూ తింటుంది అన్నాడు.
చిన్న‌ప్పుడు స‌ర్క‌స్‌లో పులిని చూడ్డం స‌ర‌దా. రాయ‌దుర్గం అజీజీయా టాకీస్ ద‌గ్గ‌ర గ్రౌండ్‌లో స‌ర్క‌స్ వ‌చ్చేది. గుంత‌లు త‌వ్వి గుడారాలు వేస్తున్న‌ప్ప‌టి నుంచి అక్క‌డే. బోనులో నుంచి పులి అరుస్తూ వుంటే భ‌యం.

Also Read:చెయ్యేరు,అన్నమయ్య ప్రాజెక్ట్ ప్రయాణం

స‌ర్క‌స్‌లో పులుల షో మొద‌టి ఆట‌, లేదా ఆఖ‌రి ఆట‌గా వుండేది. చుట్టూ ఇనుప క‌మ్మీల తెర క‌ట్టేవాళ్లు. పులి కుర్చీ మీద నిల‌బ‌డ‌డం, మంట‌ల్లో నుంచి దూక‌డం ఇలాంటి ఫీట్స్. కొర‌డా ప‌ట్టుకున్న రింగ్‌మాస్ట‌ర్ ప్ర‌పంచంలోనే గొప్ప వ్య‌క్తిగా క‌నిపించేవాడు. మాస్ట‌ర్‌, పులి ఇద్ద‌రూ పొట్ట‌కూటి కోసం ఆ ప‌ని చేస్తున్నార‌ని తెలియ‌దు.

గొర్రెలా వందేళ్లు బ‌త‌క‌డం కంటే, పులిలా ఒక సంవ‌త్స‌రం బ‌తికితే చాలు ఇది సామెత‌. నిజానికి పులి కంటే గొర్రె బాగా బ‌తుకు తుంది. బ‌తికినంత కాలం దానికి ఎవ‌రో ఒక‌రు తిండి పెడ‌తారు. ఒక‌రోజు కోసి వండుకు తింటారు. మ‌ర‌ణం ఎపుడు వ‌స్తుందో దానికి తెలియ‌దు. కానీ పులి బ‌తికినంత కాలం ప్ర‌తిరోజూ వేటాడాలి. వేటాడే శ‌క్తి పోతే అదే మ‌ర‌ణం.

యూట్యూబ్ వీడియోలు చూస్తే అర్థ‌మ‌వుతుంది. పులికి అంత సుల‌భంగా వేట దొర‌క‌ద‌ని. శ‌రీరాన్ని బాణంలా చేసి ప‌రిగెత్తాలి. వేట‌కి గురైన ప్రాణి శ‌క్తి మేర‌కు ప్ర‌తిఘ‌టిస్తుంది. కిందామీదా ప‌డాలి. ఒక్కోసారి అడ‌వి దున్న‌ల చేతిలో పులి చచ్చిపోతుంది కూడా. వేట దొరికినా , న‌క్క‌లు, తోడేళ్లు, హైనాలు వాటాకి వ‌స్తాయి. పులి వేటాడే వ‌ర‌కూ పొంచి వుండి, చేతికందింది నోటికి అందుతున్న‌ప్పుడు లాక్కోడానికి ప్ర‌య‌త్నించ‌డం హైనాల ల‌క్ష‌ణం. చాలా హైనాలు మ‌నుషుల రూపంలో మ‌న మ‌ధ్యే తిరుగుతూ వుంటాయి. గుర్తు ప‌ట్టాలంతే.

గ‌తంలో మ‌న హీరోలు పులుల‌తో పోరాడేవాళ్లు. గోళ్లు తీసేసి, నోరు కుట్టేసిన ఆ మూగ‌జీవాల‌తో ఫైటింగ్‌. ఇపుడు చ‌ట్టం ఒప్పుకోదు. పులిని గ్రాఫిక్స్‌లో తీయాల్సిందే. స‌ర్క‌స్ పులులు కూడా లేవు. ఒక ర‌కంగా హింస త‌గ్గింది. జూలో మాత్రం క‌నిపిస్తాయి.

మా చిన్న‌ప్పుడు పులిగోరు ప‌త‌కం వేసుకునే వాళ్లు బాగా రిచ్ కింద లెక్క‌. పులి చ‌ర్మానికి ఇప్ప‌టికీ బాగా గిరాకీ. 40 ఏళ్ల క్రితం అనంత‌పురం ఫోర్త్‌రోడ్ ప‌రిస‌రాల్లో పులి వ‌చ్చింది. దాన్ని కాల్చి చంపేశారు. చ‌ర్మం ఎవ‌రింట్లో వుందో తెలియ‌దు. దాని శ‌వాన్ని అశోక్‌న‌గ‌ర్ మైదానంలో వెట‌ర్న‌రి వాళ్లు ప‌డేసి వెళ్లారు. దుర్వాస‌న భ‌రించ‌లేక ఇద్ద‌రు కూలీల‌తో గొయ్యి త‌వ్వించి పాతి పెట్టించాను. అది గాడిద‌ని అనుకున్నా. కానీ కూలీ వాళ్లు చ‌ర్మం ఒలిచేసిన పులి అని గుర్తించారు. అది న్యూస్ అనే విష‌యం కూడా తెలియ‌దు. ఇపుడైతే అన్ని టీవీ చానెళ్లు అక్క‌డే వుండేవి. ఆంధ్ర‌ప్ర‌భ వీక్లీలో అన‌గ‌న‌గా ఒక పులి అనే క‌థ రాసాను. పులి కంటే ఈ వ్య‌వ‌స్థే ప్ర‌మాద‌క‌ర‌మైంది. 40 ఏళ్ల త‌రువాత ఈ అభిప్రాయం ఇంకా బ‌ల‌ప‌డింది.

Also Read: తండ్రి కొడుకులే కాదు తండ్రి కూతుళ్లు కూడా సీఎంలు అయ్యారు తెలుసా?

ఎయిడ్స్ మీద చేసిన పులిరాజు యాడ్ చాలా సెన్సేష‌న‌ల్‌. ఆ రోజుల్లో అంద‌రూ దీని గురించే మాట్లాడుకున్నారు. చిరంజీవి హీరోగా చేసిన మృగ‌రాజు ప్లాప్‌. ఎందుకంటే సినిమా అంతా ఒక పులితో చిరంజీవి ఫైట్ చేయ‌డం జ‌నాల‌కి న‌చ్చ‌లేదు. ఆయ‌న ఒక్క‌డే వంద పులుల‌తో స‌మాన‌మ‌ని అభిమానుల న‌మ్మ‌కం.

నాన్నా పులిక‌థ‌లో నాకు అర్థం కానిది ఏమంటే, కొడుకు మాట‌లు న‌మ్మ‌ని నాన్న రాలేదు కాబ‌ట్టి బ‌తికి పోయాడు. వ‌స్తే వాన్ని కూడా తినేసేది. దీంట్లో నీతి ఏముంది? అబ‌ద్ధం వ‌ల్ల తండ్ర‌యినా బ‌తికాడు.

ఇంట్లో పిల్లి, వీధిలో పులి అంటారు. పిల్లిగా వుంటే పాలు పెరుగు తాగి బ‌త‌కొచ్చు. పులిలా వుంటే రోజూ మాంసం ఎవ‌డు వండి పెడ‌తాడు?
గొర్రెల అభిప్రాయాల్ని ఆలోచిస్తూ పులి నిద్ర పాడుచేసుకోదు. అస‌లు అభిప్రాయాలంటూ వుంటే అవి గొర్రెలు ఎందుక‌వుతాయి. సొంత అభిప్రాయాలు దేశ‌ద్రోహంతో స‌మానం.

వేల ఏళ్లుగా మ‌నుషులు పులుల్ని వేటాడుతూనే వున్నారు. అడ‌వి అంటే పులి ఇల్లు. దాని ఇంట్లోకి వెళ్లి చంపుతున్నాం. అది మ‌నింటికి వ‌స్తే చంపుతున్నాం. పులి పారించిన మ‌నిషి నెత్తుటి క‌థ మ‌న‌కి తెలుసు. మ‌నిషి పాలించిన పులి నెత్తుటిక‌థ తెలియ‌దు. అది తెలియాలంటే పులి త‌న ఆత్మ‌క‌థ‌ని రాయాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp