రెండు అడుగులకు భారీ మూల్యం - Nostalgia

By iDream Post Jan. 24, 2021, 08:33 pm IST
రెండు అడుగులకు భారీ మూల్యం  - Nostalgia
గొప్ప ఖ్యాతి దక్కించుకున్న దర్శకులందరూ అంతే స్థాయిలో మంచి నటులవుతారన్న గ్యారెంటీ ఎక్కడా లేదు. అది వాళ్ళ ఆసక్తిని బట్టి తమలో ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ ని బట్టి ఉంటుంది. ఈ రెండు పడవల ప్రయాణం చేయడం అంత సులభమూ కాదు. కేవలం కొందరే ఇలా చేయడంలో సక్సెస్ అయ్యారు. దాసరి నారాయణరావు లాంటి వారిని మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే డైరెక్టర్ గా టాప్ ఫామ్ లో ఉన్నప్పుడు ఇలాంటి రిస్కులు చేసి దెబ్బలు తిన్నవాళ్ళు లేకపోలేదు. హీరోగా తెరమీద తమను చూసుకోవాలన్న తపన తప్పని చెప్పలేం కానీ ప్రాక్టికల్ గా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే అంచనాలు సరిగ్గా వేసుకోకపోవడం దెబ్బ తీస్తుంది.

90వ దశకంలో జంధ్యాల గారి తర్వాత ఆరోగ్యకరమైన సినిమాలతో ఫ్యామిలీ మొత్తం థియేటర్లు ధైర్యంగా వచ్చేలా ప్రభావితం చేసిన అతి కొద్ది దర్శకుల్లో ఎస్వి కృష్ణారెడ్డి ఒకరు. కేవలం పోస్టర్ మీద ఈయన పేరు చూసే టికెట్లు తెగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలీ లాంటి కమెడియన్ తో యమలీల ఇండస్ట్రీ హిట్ సాధించడం ఈయనకే చెల్లింది. రాజేంద్ర ప్రసాద్ తో తీసినవి చెప్పుకుంటూ పోతే వాటి మీద ఏకంగా పుస్తకాలు రాయొచ్చు. హాస్య చిత్రాలతో పాటు కుటుంబకథా చిత్రాలను బ్యాలన్స్ చేయడంలో ఈయనే టాలెంటే వేరు. మ్యూజికల్ గానూ కృష్ణారెడ్డి గారి సినిమాలు ఆడియో రంగంలో సంచలనం సృష్టించాయి.

అలాంటి టైంలో 1997లో తను హీరోగా స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేశారు కృష్ణారెడ్డి. అదే ఉగాది. లైలా హీరోయిన్ గా టాలీవుడ్ టాప్ క్యాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా సంగీతం విడుదలకు ముందే క్యాసెట్ల అమ్మకాల్లో రికార్డులు నమోదు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో వినోదం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గానే మిగిలిపోయింది. కొంత గ్యాప్ తీసుకుని మధ్యలో వేరే హీరోలతో సినిమాలు చేసిన ఎస్వి మళ్ళీ 1999లో అభిషేకంతో ఏకంగా డ్యూయల్ రోల్ చేసి ఆడియన్స్ ముందుకు వచ్చారు. సెంటిమెంట్ ఓవర్ కావడంతో దీన్ని ప్రేక్షకులు తిరస్కరించారు. దీంతో ఎస్వి మళ్లీ ఆ ఆలోచన చేయలేదు. తిరిగి డైరెక్టర్ గా కొనసాగారు కానీ 2014 దాకా ఎన్ని సినిమాలు తీసినా పెళ్ళాం ఊరెళితే, హంగామా తప్ప ఇంకో హిట్టు చూడలేకపోయారు
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp