నిండా ముంచేసిన పుత్రప్రేమ - Nostalgia

By iDream Post Jul. 13, 2020, 05:52 pm IST
నిండా ముంచేసిన పుత్రప్రేమ - Nostalgia

తమ బిడ్డలను హీరోలుగా చూసుకోవాలని స్టార్లకే కాదు దర్శకులకు ప్రొడ్యూసర్లకూ ఉంటుంది . అయితే ఇది చెప్పుకున్నంత సులభం కాదు. అందరికీ కలిసి రాదు. రామానాయుడు గారి అబ్బాయి వెంకటేష్ లాంటి వాళ్ళు మాత్రం పెద్ద రేంజ్ కు వెళ్తారు. ఇక్కడ కావాల్సింది సరైన ప్లానింగ్. కథల ఎంపికలో జాగ్రత్త. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా లెక్క మారిపోయి నిండా మునిగిపోవాల్సి వస్తుంది. దానికి ఉదహరణగా ఈ ఉదంతాన్ని చెప్పుకోవచ్చు. కెటి కుంజుమోన్. ఒకప్పుడు అగ్ర నిర్మాత. చెప్పాలంటే సౌత్ సినిమా మేకింగ్ లో హాలీవుడ్ స్టాండర్డ్స్ ని తీసుకొచ్చి శంకర్ లాంటి డైరెక్టర్లతో వెండితెర అద్భుతాలు తీయించిన ఘనత ఈయనదే.

కెరీర్ మొదలుపెట్టింది మలయాళం సినిమాలతోనే అయినా స్థిరపడి గొప్ప పేరు తెచ్చుకుంది మాత్రం కోలీవుడ్ లోనే. 1992లో కుంజుమోన్ నిర్మించిన 'మండే సూర్యుడు' వల్లే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శరత్ కుమార్ ఒక్క రోజులో పెద్ద రేంజ్ హీరో అయిపోయాడు. 'జెంటిల్ మెన్' తో శంకర్ ను పరిచయం చేయకపోయి ఉంటే చరిత్ర ఇంకోలా ఉండేదేమో. వినీత్, అబ్బాస్ అనే కొత్త కుర్రాళ్ళను హీరోలుగా పెట్టి 'ప్రేమదేశం' లాంటి సబ్జెక్టు మీద కోట్లు గుమ్మరించాలంటే దానికి చాలా ధైర్యం కావాలి. బక్కపలచని ప్రభుదేవాతో 'ప్రేమికుడు' రూపంలో బ్లాక్ బస్టర్ ఈయన ఖాతాలోనే ఉంది. డబ్బింగ్ వెర్షన్లు కాబట్టి మనకు ఏఏం రత్నం పేరు కనిపిస్తుంది కానీ నిజానికివి తీసింది కుంజుమొనే. కానీ ఇలాంటి గ్రాఫ్ తో అప్రతిహతంగా దూసుకుపోతున్న కుంజుమోన్ కు మొదటి బ్రేక్ 1997లో నాగార్జున 'రక్షకుడు' రూపంలోపడింది. దాని డిజాస్టర్ దెబ్బకు కోలుకోవడానికి ఆయనకు బాగానే టైం పట్టింది.

ఇది కాకుండా విజయ్, వినీత్ లతో తీసిన మరో రెండు సినిమాలు కూడా గట్టి దెబ్బ వేశాయి. అయినా వెనుకడుగు వేయకుండా కొడుకు ఎబీ కుంజుమోన్ ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ తో 2000 సంవత్సరంలో 'కోటీశ్వరుడు' సినిమాని అనౌన్స్ చేశారు. సిమ్రాన్ హీరోయిన్ గా కరిష్మా కపూర్ స్పెషల్ సాంగ్ చేయించి మంచినీళ్లలా డబ్బుని ఖర్చు పెట్టి తీయడం మొదలుపెట్టారు. అట్టహాసనంగా ఆడియో కూడా విడులయ్యింది. నందకుమార్ దర్శకత్వంలో ఈ సినిమాకు రూపొందించిన సెట్టింగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కోసం పెట్టిన ఖర్చు గురించి తెలుసుకుని మీడియా సైతం నోరెళ్ళబెట్టింది . కానీ ఇంత చేసినా సినిమా థియేటర్లకు రాలేదు. ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుని కుంజుమోన్ ఎంత ప్రయత్నించినా రిలీజ్ చేయలేకపోయారు. ఆఖరికి అది ల్యాబులోనే మగ్గిపోయింది కాని కనీసం టీవీలో కూడా రాలేదు. నిజానికి ఇది పూర్తయ్యిందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత కుంజుమోన్ సినిమాలకు స్వస్తి చెప్పి రిటైర్ అయిపోయారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp