తమిళ యముడు తెలుగు రౌడీ - Nostalgia

By iDream Post Jul. 21, 2020, 06:31 pm IST
తమిళ యముడు తెలుగు రౌడీ - Nostalgia

కొన్ని కథలకు యునివర్సల్ అప్పీల్ ఉంటుంది. ఒకసారి వాటి గొప్పదనం ఋజువైనా మళ్ళీ తీయాలి అనిపిస్తుంది. అలాంటిదే ఓ ఉదాహరణే ఈ కథ. తెలుగులో డబ్బింగ్ రూపంలో వచ్చి హిట్టయ్యాక మళ్ళీ అదే సినిమాను ఓ స్టార్ హీరో రీమేక్ చేయడం అంటే విశేషమేగా. అదేంటో చూద్దాం. 1989లో నటుడు పార్తీబన్ దర్శకుడవ్వాలని ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. అప్పటికే భాగ్యరాజా దగ్గర అసిస్టెంట్ గా చేసిన అనుభవం అందుకు ప్రేరేపించింది. సుందర్ అనే పంపిణీదారుడు నిర్మాతగా దొరికాడు. ఇద్దరూ కలిసి రజినికాంత్ కి కలిశారు. కథ నచ్చింది కానీ ఇది నువ్వే చేయమని హీరోగా మంచి డెబ్యూ అవుతుందని పార్తీబన్ ని ప్రోత్సహించారు రజిని.

వేరే హీరోలు కూడా అందుబాటులో లేకపోవడంతో పాటు సుందర్ కూడా ఎంకరేజ్ చేయడంతో 'పుదీయ పాదై' టైటిల్ తో తన హీరోగా స్వీయ దర్శకత్వంలో సినిమా తీశారు పార్తీబన్. నిజ జీవిత భాగస్వామి సీత హీరోయిన్ గా చంద్రబోస్ సంగీతంలో కేవలం 40 లక్షల లోపు బడ్జెట్ తో పూర్తి చేసి విడుదల చేశారు. భారీ పోటీ మధ్య రిలీజైన పుదీయ పాదై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బెస్ట్ రీజనల్ తమిళ్ ఫిలింగా, మనోరమకు సపోర్టింగ్ యాక్ట్రెస్ గా రెండు జాతీయ అవార్డులు సొంతమయ్యాయి. పార్తీబన్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. దీన్నే తెలుగులో 'యముడే నా మొగుడు' డబ్బింగ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తే కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అందుకుంది. పార్తీబన్ మనవాళ్లకూ రిజిస్టర్ అయ్యాడు.

ఆ తర్వాత రెండేళ్లకు 1991లో ఇదే సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 'రౌడీ గారి పెళ్ళాం'గా కెమెరామెన్ కెఎస్ ప్రకాష్ దర్శకత్వంలో రీమేక్ చేశారు. ఇక్కడ శోభన నటించగా బప్పీలహరి అదిరిపోయే మాస్ పాటలు ఇచ్చి ఘన విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించారు. దిక్కుమొక్కు లేని ఓ వీధి రౌడీ చేతిలో మానభంగానికి గురైన హీరోయిన్ అతన్నే పెళ్లి చేసుకుని మంచి బాట వైపు నడిపిస్తుంది. కానీ అతని గతం వల్ల విలన్ల కుట్రలో ప్రాణాలు కోల్పోతుంది. అప్పటికే కలిగిన బిడ్డతో హీరో మళ్ళీ ఒంటరైపోతాడు. ఇదీ ఇందులో పాయింట్. మంచి ఎమోషనల్ డెప్త్ తో కథానాయకుడి పాత్రను పార్తీబన్ తీర్చిదిద్దన తీరు ప్రేక్షకులను కదిలించింది . ముఖ్యంగా మహిళలు సీత/శోభన పాత్రల్లో తమను చూసుకుని కదిలిపోయారు. తాగుబోతు తిరుగుబోతు భర్తలను మార్చుకోవడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే ఈ సినిమా విజయ రహస్యం. ఇలా డబ్బింగ్ రూపంలో యముడిగా, స్ట్రెయిట్ వెర్షన్ లో రౌడీగా మారిన ఈ సినిమా ఇప్పటికీ అభిమానులకు ఓ మంచి జ్ఞాపకం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp