Suryavamsam : ద్విపాత్రల్లో వెంకటేష్ విశ్వరూపం - Nostalgia

By iDream Post Dec. 07, 2021, 09:30 pm IST
Suryavamsam : ద్విపాత్రల్లో వెంకటేష్ విశ్వరూపం - Nostalgia

ఇప్పుడు తగ్గిపోయింది కానీ ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలేజ్ డ్రామాలది విశిష్ట స్థానం. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఈ బ్యాక్ డ్రాప్ లో సూపర్ హిట్లు అందుకున్నవాళ్ళు ఉన్నారు. బలమైన ఎమోషన్లకు ఆస్కారం ఉండటం, పెర్ఫార్మన్స్ చూపించుకోవడానికి అవకాశం దక్కడం లాంటివి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఆ పరంపరలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సూర్యవంశం. ఓసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళదాం. 1997 తమిళంలో విక్రమన్ దర్శకత్వంలో వచ్చిన సూర్యవంశం ఆ ఏడాది అతి పెద్ద హిట్ గా నిలిచింది. శరత్ కుమార్ డ్యూయల్ రోల్ చేయగా దేవయాని, రాధిక ఆయనకు జంటగా నటించారు. క్లాసు మాస్ తేడా లేకుండా అందరూ దీన్ని ఆదరించారు.

నిర్మాత ఆర్బి చౌదరి దీన్ని తెలుగులోనూ రీమేక్ చేయాలని నిశ్చయించుకున్నారు. విక్టరీ వెంకటేష్ మంచి ఫామ్ లో ఉన్న టైం అది. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ప్రేమించుకుందాం రా లాంటి హిట్లతో దూకుడు మీదున్నారు. సూర్యవంశం సబ్జెక్టు తనకు యాప్ట్ అవుతుందని భావించిన చౌదరి గారు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావుని వెంటబెట్టుకుని ఒరిజినల్ వెర్షన్ చూపించారు. వెంకీకి గ్రామీణ నేపథ్యం కొత్త కాదు. చంటి, చినరాయుడు, వారసుడొచ్చాడు లాంటి సక్సెస్ లు ఈ బ్యాక్ డ్రాప్ లోనే అందుకున్నారు. అందుకే సూర్యవంశం చూడగానే మరో ఆలోచన లేకుండా వెంటనే ఒప్పుకున్నారు. మీనా మెయిన్ హీరోయిన్ కాగా రాధిక ఇందులోనూ ఉంటారు. ఒకే ఫ్రేమ్ లో వెంకటేష్ డ్యూయల్ రోల్ చేసిన సినిమాల్లో అగ్గిరాముడు, పోకిరిరాజా తర్వాత స్థానం సూర్యవంశందే

అవే ట్యూన్స్ తో ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ ఆల్బమ్ ని సిద్ధం చేశారు. సంఘవి, కోట, సత్యనారాయణ, సుధాకర్, ఆనంద్ రాజ్, మల్లికార్జునరావు, ఆలీ తదితరులతో భారీ క్యాస్టింగ్ సెట్ చేసుకున్నారు. ఊరంతా దేవుడిలా కొలిచే హరిశ్చంద్ర ప్రసాద్ కొడుకు భానుప్రసాద్ ఇంటికి దూరంగా బ్రతుకుతూ ఉంటాడు. కుటుంబం వెలేసినా భార్యను కలెక్టర్ చేసి తానూ గొప్ప స్థాయికి చేరుకోవడాన్ని ఇందులో చూపించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ, యాక్షన్, మాస్ అన్నీ సమపాళ్ళలో కుదరటంతో 1998 ఫిబ్రవరి 25 విడుదలైన సూర్యవంశం శతదినోత్సవంతో కలెక్షన్ల వర్షం కురిపించింది. ద్విపాత్రల్లో వెంకటేష్ నటన ఫ్యామిలీ ఆడియన్స్ ని మరింత దగ్గర చేసింది. తర్వాత దీన్నే హిందీలో అమితాబ్ తో రీమేక్ చేస్తే ఆశించిన ఫలితం దక్కలేదు

Also Read : Iddaru Mitrulu : నీరసం తెప్పించిన మెగా మిత్రులు - Nostalgia

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp