చేతులు మారిన బ్లాక్ బస్టర్ హిట్ - Nostalgia

By iDream Post Jun. 23, 2020, 08:55 pm IST
చేతులు మారిన బ్లాక్ బస్టర్ హిట్ - Nostalgia

ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు ముందే రాసి ఉంటుందన్నట్టు సినిమా పరిశ్రమలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనకు రాసిపెట్టని అదృష్టం ఇంకొకరిని వరించడం ఎలాగో ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. 1971లో అక్కినేని నాగేశ్వర్ రావు, వాణిశ్రీ జంటగా వచ్చిన ప్రేమ నగర్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. దీని వెనుక ఆసక్తికరమైన కథ ఒకటుంది. సినిమా నిర్మాణానికి ముందు ఆ సమయంలో కోడూరి కౌసల్యదేవి గారు ఇదే పేరుతో రాసిన నవల అద్భుత స్పందన దక్కించుకుంది. దీన్ని ఏఎన్ఆర్ హీరోగా తెరమీదకు తీసుకురావాలని శ్రీధర్ రెడ్డి అనే నిర్మాత నిర్ణయించుకుని ఆ మేరకు రచయిత్రి వద్ద హక్కులు కొనేశారు.

స్క్రిప్ట్ సిద్ధం చేయించి అక్కినేనికి ఇచ్చారు. స్వతహాగా పూర్తిగా చదివే అలవాటు లేని ఏఎన్ఆర్ దాన్ని శ్రీమతి అన్నపూర్ణ గారికి చదవమని ఇచ్చారు. మొత్తం కూలంకుషంగా పఠనం పూర్తి చేసి దేవదాసులో లేని కమర్షియల్ అంశాలు ఇందులో ఉన్నాయని ఖచ్చితంగా ఆడుతుందని ఆవిడ జోస్యం చెప్పారు. దీంతో ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. హీరోయిన్ గా కెఆర్ విజయ ఫిక్స్ అయ్యారు. దీని కోసం కాస్ట్యూమ్స్ కొనేందుకు అవసరమైన డబ్బు తీసుకుని కారు ప్రయాణం చేస్తుండగా శ్రీధర్ రెడ్డి కారుకు యాక్సిడెంట్ అయ్యింది. దీంతో ఇదేదో అపశకునంలా భావించి శ్రీధర్ రెడ్డి భార్య ఈ సినిమా వద్దనేశారు.

అయితే కథలో దమ్ము తెలిసిన అక్కినేని దీన్ని కొనుక్కోమని రామానాయుడు గారికి రికమండ్ చేశారు. హీరో స్వయంగా అంత నమ్మకంతో చెబితే కాదంటారా. 60 వేల రూపాయలకు కొనేశారు. దర్శకుడిగా రాఘవేంద్రరావు గారి తండ్రి కెఎస్ ప్రకాష్ రావు గారిని తీసుకున్నారు. స్క్రిప్ట్ లో మార్పులు జరిగాయి. హీరొయిన్ స్థానంలో వాణిశ్రీ వచ్చి చేరింది. అప్పట్లోనే 15 లక్షల బడ్జెట్ తో రామానాయుడు గారు ప్రేమనగర్ ని భారీగా నిర్మించారు. 34 ప్రింట్లతో రిలీజ్ చేస్తే ఊహించని విధంగా 50 లక్షలు వసూలు చేసిందీ బ్లాక్ బస్టర్. రిలీజైన పదిహేను రోజులు భారీ వర్షాలు ఉన్నా జనం లెక్క చేయలేదు. గొడుగులు వేసుకుని మరీ తండోపతండాలుగా ఎగబడి చూశారు.

కెవి మహదేవన్ సంగీతం, ఆచార్య ఆత్రేయ మాటలు, వెంకటరత్నం ఛాయాగ్రహణం అన్ని కలిసి దీన్నో దృశ్యకావ్యంలా మలిచాయి. గుమ్మడి, శాంతకుమారి, సత్యనారాయణ, వరలక్ష్మి, రాజబాబు, ధూళిపాల లాంటి ఎందరో స్టార్లు క్యాస్టింగ్ లో భాగమయ్యాయి. దీన్నే తమిళ్ లో శివాజీ గణేషన్ హీరోగా రామానాయుడు గారే రీమేక్ చేశారు. హీరొయిన్ వాణిశ్రీనే. హిందిలోనూ రాజేష్ ఖన్నా, హేమమాలినిలతో తీస్తే అక్కడా సూపర్ హిట్. ఇలా శ్రీధర్ రెడ్డి, కేఆర్ విజయల చేయి జారిన అదృష్టం ఇలా రామానాయుడు, వాణిశ్రీలకు అద్బుతంగా కలిసి వచ్చింది. సురేష్ బ్యానర్ వేల్యూ దీని దెబ్బకు రెట్టింపయ్యింది. అందుకే అన్నారేమో పెద్దలు ఎవరికి చేరాలని రాసుంటే అది ఖచ్చితంగా వారికే చేరుతుందని.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp