శ్రీ‌దేవి త‌ల్లి న‌టించిన శాంతి నివాసం - Nostalgia

By G.R Maharshi Nov. 26, 2020, 11:56 am IST
శ్రీ‌దేవి త‌ల్లి న‌టించిన శాంతి నివాసం - Nostalgia

1960 సంక్రాంతికి విడుద‌లైన శాంతినివాసం సినిమాలో చాలా విచిత్రాలున్నాయి.

1. ఇండియా సూప‌ర్ హీరోయిన్‌గా ఒక్క వెలుగు వెలిగిన శ్రీ‌దేవి త‌ల్లి రాజేశ్వ‌రి చిన్న పాత్ర‌లో న‌టించింది. హీరోయిన్ కావాల‌ని ఆమె కోరిక‌. కానీ చిన్న పాత్ర‌లు మాత్ర‌మే ద‌క్కేవి. కృష్ణ‌కుమారి చెల్లెలుగా న‌టించినా ఆమెకి గ‌ట్టిగా నాలుగు డైలాగ్‌లు కూడా లేవు. త‌మిళ్‌ , తెలుగులో అదృష్టాన్ని ప‌రీక్షించుకుని విఫ‌ల‌మైన రాజేశ్వ‌రి చివ‌రికి అయ్య‌ప్ప‌న్ అనే లాయ‌ర్‌ను పెళ్లి చేసుకుని ఇండ‌స్ట్రీకి దూర‌మైంది. అయితే తాను సాధించ‌లేనిది కూతురితో సాధించుకుంది. నాలుగేళ్ల వ‌య‌సు నుంచి శ్రీ‌దేవిని న‌టిగా చేసింది. మామూలుగా బాల‌న‌టులుగా చేసిన వాళ్లు యుక్త వ‌య‌సు వ‌చ్చేస‌రికి క‌నుమ‌రుగై పోతారు. శ్రీ‌దేవి దాన్ని జ‌యించింది. కూతురు హీరోయిన్ అయితే చాల‌నుకుంది రాజేశ్వ‌రి. ఆల్ ఇండియా అందాల న‌టి అవుతుంద‌ని ఊహించ‌లేక‌పోయింది. కూతురిని ప్రేమ‌లో ప‌డ‌కుండా కాపాడ్డానికి బాడీగార్డులా మారింది. కానీ దుర‌దృష్టం కొద్దీ బ్రెయిన్ ట్యూమ‌ర్ వ‌చ్చింది. 96లో న్యూయార్క్‌లో ఆప‌రేష‌న్ జ‌రిగింది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన హాస్పిట‌ల్ కూడా త‌ప్పు చేసింది. కుడి వైపున ట్యూమ‌ర్ వుంటే, ఎడ‌మ వైపు ఆప‌రేష‌న్ జ‌రిగింది. చూపు, జ్ఞాప‌క‌శ‌క్తి పోయింది. యూఎస్ మీడియాలో సంచ‌ల‌న‌మైంది. కోర్టులో శ్రీ‌దేవి గెలిచి కోట్ల రూపాయ‌ల ప‌రిహారం అందుకుంది. ఈ కేసు ఎంత దూరం పోయింది అప్ప‌టి అధ్య‌క్షుడు బిల్‌క్లింట‌న్ స్వ‌యంగా ఆస్ప‌త్రిపై చ‌ర్య‌ల‌కి ఆదేశించారు.

2. శాంతినివాసంకి మూలం త‌మిళ నాట‌కం B.S. రామ‌య్య రాసిన మ‌ల్లియం మంగ‌ళం. దీన్ని తెలుగులో పాల‌గుమ్మి ప‌ద్మ‌రాజు రాశారు. ప‌ద్మ‌నాభం దీని హ‌క్కుల్ని కొని స్టేజి నాట‌కంగా పెద్ద స‌క్సెస్ చేశారు. స్టేజి మీద కారు డ్రైవ్ చేసుకుంటూ ప‌ద్మ‌నాభం డ్యూయెట్ పాడ‌డం ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేసేది. దీన్ని చూసిన నిర్మాత సుంద‌ర్‌లాల్ న‌హ‌తా, డైరెక్ట‌ర్ C.S. రావు సినిమా కోసం హ‌క్కుల్ని కొన్నాడు. జూనియ‌ర్ స‌ముద్రాల స్క్రీన్ ప్లేని నాగేశ్వ‌ర‌రావుకి త‌గిన‌ట్టు మార్పులు చేశారు. సినిమా సూప‌ర్‌హిట్‌. హిందీలో ఘ‌రానా (1961)గా తీశారు. మ‌ళ‌యాళంలో డ‌బ్ చేశారు.

3. బృందావ‌న్ గార్డెన్స్‌లో తీసిన రెండు పాట‌లు మిన‌హా , మిగ‌తా సినిమా అంతా సింగిల్ షెడ్యూల్‌లో తీశారు. అప్ప‌టికి ఆది రికార్డ్‌. డైరెక్ట‌ర్ C.S. రావుకి ప్ర‌తిదీ తాను న‌టించి చూప‌డం అల‌వాటు. కృష్ణ‌కుమారి ఇంట్లోకి కాంతారావు వెళ్లే సీన్ చూపిస్తూ C.S. రావు కాలు స్లిప్ప‌యింది. ఆ సీన్ అలాగే న‌టించాల‌ని కాంతారావు కూడా స్లిప్ప‌య్యారు. "బావుంది, ఈ ఇంట్లోకి రావ‌డ‌మే త‌ప్ప‌ట‌డుగు" సింబాలిక్‌గా వుంది అన్నాడ‌ట C.S. రావు.

4. నిర్మాత‌లు జోక్యం చేసుకోవ‌డం ఇప్పుడూ, అప్పుడూ, ఎప్పుడూ వుంది. నిర్మాత న‌హ‌తాకి హిందీ పాట‌లంటే ఇష్టం. నాలుగు హిందీ పాట‌ల్ని తెలుగు చేయించాడు. ఇది ఇష్టం లేని సంగీత ద‌ర్శ‌కుడు ఘంట‌శాల , ఆ పాట‌ల్ని అసిస్టెంట్‌తో చేయించాడు. ఘంట‌శాల Own Composing "జ‌య ర‌ఘురాం, క‌ల‌నైనా నీ పిలుపే, రాగాల స‌రాగాల" సూప‌ర్ హిట్‌.

5. ర‌మ‌ణారెడ్డి, రేలంగి Translation కామెడీ , నువ్వూ నేనులో తేజ ధ‌ర్మ‌వ‌రం సుబ్ర‌మ‌ణ్యం మీద వాడాడు.టిఫెన్ తింటారా, కాఫీ తాగారా అని పిల్ల‌లు అడిగే సీన్‌ని 96లో పెళ్లి సంద‌డిలో వాడారు.

6. హీరోయిన్‌గా న‌టించిన రాజ‌సులోచ‌న త‌ర్వాత ద‌ర్శ‌కుడు సీఎస్ రావుని పెళ్లి చేసుకున్నారు. 1961లో చెన్నైలో డ్యాన్స్ స్కూల్ పెట్టి వేల మందికి డ్యాన్స్ నేర్పించారు. 77 ఏళ్ల వ‌య‌సులో ఆమె చ‌నిపోతే జ‌య‌ల‌లిత ముఖ్య‌మంత్రి హోదాలో వెళ్లి నివాళుల‌ర్పించారు.

7. ఈ సినిమాలో న‌టించిన లీడ్ యాక్ట‌ర్ల‌లో హేమ‌ల‌త మాత్ర‌మే ఇంకా జీవించి ఉన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp