నీ గానం మృదుమధురం అమృతం - Nostalgia

By iDream Post Sep. 25, 2020, 04:21 pm IST
నీ గానం మృదుమధురం అమృతం - Nostalgia

"ఔరా అమ్మకుచెల్లా ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో ఆనందలాల" - అమృతం చెవుల్లో పోసినట్టు వినసొంపైన ఈ పాటను బాలు కాకుండా ఇంకెవరకైనా పాడటం కనీసం ఊహించగలమా

"ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే" - కోరుకున్న తోడు దక్కుతుందో లేదోనని నిరాశలో ఉన్న యువతీయువకులలో స్ఫూర్తి రగిలించేలా ఉన్న ఈ గీతం వేరొకరు పాడి ఉంటే అంత ప్రభావం ఉండేనా

"శంకరా నాదశరీరాపరా వేదవిహారాహరా జీవేశ్వరా" - రాళ్లు సైతం కరిగేలా శివుడు సైతం నేలకు దిగివచ్చేలా బాలసుబ్రమణ్యం పాడిన తీరు పండిత పామరులన్న తేడా లేకుండా పదే పదే వినేలా కట్టిపడేయడం చరిత్ర ఎప్పటికీ మర్చిపోడు

"ఆగదు ఆగదు ఈ నిమిషము ఈ కోసము" - అంటూ జీవన వేదాంతాన్ని తాగుబోతు గొంతుతో ఒలకబోసినా

" సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా" అని దిగాలుగా ఉన్న మనసులకు హుషారు తెప్పించినా ఆది ఆయనకే చెల్లింది.

"జననీజన్మభూమిస్చ్య స్వర్గాదపీ గరీయసి" అంటూ హృదయాన్ని తడిమేలా దేశభక్తిని నరనరాల్లో ఇంకిపోయేలా ఉద్వేగాన్ని కలిగించినా అది బాలుకే సాధ్యం

ఒకటా రెండా ఒక్క తెలుగులోనే ఇలాంటి 10 వేలకు పైగా పాటలతో తన గానామృతాన్ని తరతరాలకు పంచి ఎన్నటికీ తరిగిపోని నిధిని ఎస్పి బాలసుబ్రమణ్యం మనల్ని వదిలి శాశ్వతంగా వెళ్లిపోయారు. కానీ భౌతికంగా మాత్రమే. ఘంటసాల గారు పరమపదించాక అలాంటి స్వర దిగ్గజం మళ్ళీ తెలుగు సినిమా పరిశ్రమ చూడగలదా అనే అనుమానం అప్పట్లో ఎందరిలోనో మెదిలిన మాట వాస్తవం. కానీ ఎల్లలు లేని తన విద్వత్తుతో స్వరసరస్వతికి అతనొక గొప్ప ఆభరణం కాగలడని కొందరే ఊహించారు. ఒకప్పుడు తెరముందు హీరోలకు రికార్డింగ్ స్టూడియోలో పాటలు పాడే గాయకులంతా ఒకే గొంతు ఇచ్చి ఒకేలా పాటలు పాడతారనే సూత్రాన్ని నిలువునా మారుస్తూ తనకంటూ ఒక బాణీని సృష్టించుకోవడం ఒక్క బాలుకే చెల్లింది.

మేజర్ చంద్రకాంత్ లో పుణ్యభూమి నా దేశం అన్నప్పుడు అన్న ఎన్టీఆర్ లా, ఇంద్రలో ఘల్లు ఘల్లుమంటు సిరిమువ్వల్లే విన్నప్పుడు చిరంజీవిలా, సీతారామకళ్యాణంలో రాళ్ళలో ఇసకల్లో రాశాను ఇద్దరి పేర్లు పాటను చూసినప్పుడు అచ్చం బాలకృష్ణలా, క్రిమినల్ లో తెలుసా మనసా అంటూ ప్రేయసికి తన ప్రేమను నివేదించినప్పుడు నాగార్జునలా ఇలా తాను కనిపించకపోయినా ఇలాంటి పాటలు విన్నప్పుడు అచ్చం ఆ కథానాయకులే పాడారేమో అన్నంత గొప్పగా భ్రమించడం గాన గంధర్వులకే చెల్లింది. రాజకుమారుడులో మహేష్ బాబు, తొలిప్రేమలో పవన్ కళ్యాణ్, స్టూడెంట్ నెంబర్ వన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఇప్పటి జనరేషన్ హీరోలకు సైతం తన గొంతులోని అద్భుతాన్ని పంచిన అజరామర కీర్తి బాలసుబ్రమణ్యం.

మనం రోజూ గంటల తరబడి మాట్లాడితేనే అలసినట్టు భావిస్తాం. అలాంటిది ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా బాలు గాత్రం 40 వేలకు పైగా పాటలు పాడింది, పాడుతూనే వచ్చింది. దానికి అలుపు తెలియదు. విశ్రాంతి అనే మాటకు చోటు లేదు. ఆగాలి అంటే అస్సలు సహించదు. బాషా భేదాలను పట్టించుకోదు. గాయకుడిగా కెరీర్ మొదలుపెట్టాక ఆయన పాట పాడని రోజంటూ ఉండదు. పాడించుకోని సంగీత దర్శకులూ లేరు. గురువు కీర్తిశేషులు ఎస్పి కోదండపాణితో మొదలుపెట్టి ఇప్పటి తమన్ దాకా అందరూ తమ కీర్తి కిరీటంలో బాలు పాడిన పాటలను వజ్రాలుగా అద్దుకున్న వాళ్ళే. తమ సినిమాలో బాలు పాటలు ఉండాల్సిందేనని పట్టుబట్టని దర్శకులు ఉండరు. ఎందుకంటే దేవుడు భూమికి ఒక్క బాలసుబ్రహ్మణ్యంనే ఇచ్చాడు. అందుకే ఆ గానాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించిన ఇప్పటి తరం ముమ్మాటికి అదృష్టవంతులు. ఇప్పుడు తమకూ ఆ భాగ్యం దక్కాలని పట్టుబట్టి దేవుళ్ళు పిలిపించేసుకున్నారు కాబట్టి ఇకపై ఆ గాత్రం నిత్యం మన ఫోన్లలో, టీవీలలో, యుట్యూబ్ లో ఎన్నో వందల వేల రూపాల్లో మన మధ్యే వినపడుతుంది, తిరుగాడుతుంది. ఎందుకంటే ఆ గానం మృదుమధురం అమృతం....

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp