జీవించే పాట "బాలు" - Nostalgia

By G.R Maharshi Sep. 25, 2020, 08:23 pm IST
జీవించే పాట "బాలు" - Nostalgia

ఆస్ప‌త్రి నుంచి కోలుకుని తిరిగి వ‌స్తాడ‌నుకున్న బాలు, రాకుండానే వెళ్లిపోయాడు. పాట‌ల ప‌క్షి ఎగిరిపోయింది. మ‌నుషులు పోతారు. జ్ఞాప‌కాలు మిగులుతాయి. చిన్న‌ప్పుడు రేడియోలో పాటలు ఎట్లా వ‌స్తాయో అర్థం కాక అయోమ‌యంగా చూస్తూ ఉంటే బాలు ప‌ల‌క‌రించేవాడు. ఫైటింగుల కోసం కృష్ణ సినిమాలు తెగ చూస్తున్న‌ప్పుడు "కోరిన‌ది నెర‌వేరిన‌ది" అంటూ మోస‌గాళ్ల‌కు మోస‌గాడులో కృష్ణ పాడిన‌ట్టే పాడేవాడు.

దేవుడు చేసిన మ‌నుషుల్లో "దోర వ‌య‌సు చిన్న‌ది , ల‌లాలాల‌హ" పాట‌ని కృష్ణ పాడాడంటే న‌మ్మేసేవాళ్లం. జ‌మీందారుగారి అమ్మాయిలో "ముత్యాలు వ‌స్తావా" అని అల్లు రామ‌లింగ‌య్య‌ని దించేశాడు. ఈ పాట‌ని స్కూల్లో ప్ర‌తివాడూ ఇమిటేట్ చేసేవాడు. ఒక‌సారి స్కూల్ స‌మావేశంలో పెంచ‌ల్‌రావు అనేవాడు ఈ పాట స్టార్ట్ చేస్తే ప్రిన్సిపాల్‌కు తిక్క‌లేసి "ప‌నికి మాలినోడా ఏం పాట‌రా అది" అని క‌ర్ర తీసుకుంటే మేము మామూలుగా న‌వ్వామా?

బుల్లెమ్మ బుల్లోడు చూసి ఒక తాడుని కొర‌డాగా ఊహించుకుని "నీ పాపం పండెను నేడు" అని పాడుతూ ఉతుకుతుంటే ఫ్రెండ్సంతా పారిపోయే వాళ్లు. కొంచెం పెద్దాళ్లు అయ్యేస‌రికి "మ‌ధువొల‌క‌బోసే నీ చిలిపి క‌ళ్లు" అని రాగ‌జ్ఞానం లేని కీచు గొంతుతో పాడితే అమ్మాయిలు జ‌డుసుకుని భ‌య‌భ్రాంతుల‌కి గుర‌య్యే వాళ్లు క‌దా!
టెన్త్ క్లాస్ దాటే స‌రికి కృషి వుంటే మ‌నుషులు రుషుల‌వుతారు అన్న కాసేప‌టికే ఆరేసుకోబోయి పారేసుకున్నావు అని థియేట‌ర్‌ని ఊపేసింది నువ్వే బాలు! శంక‌రాభ‌ర‌ణం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఒక్క గొంతులో అన్ని గొంతులు ఎలా దాచావో!

హాస్యం , విషాదం, శృంగారం , శాంతం అన్ని ర‌సాలు తేనెలో స్నానం చేసి గొంతులో ప‌లికించిన బాల‌సుబ్ర‌మ‌ణ్యం ఇక ప‌ల‌క‌డు. చైనాలో పుట్టిన క‌రోనా చెన్నైలో ఉన్న బాలుని తీసుకుపోతుంద‌ని ఊహించ‌లేక పోయాం.

ఆయ‌న ఏదో ఒక పాట గుర్తు తెచ్చుకోకుండా , విన‌కుండా, హ‌మ్ చేయ‌కుండా కొన్ని త‌రాల వాళ్ల‌కి జీవితంలో ఒక్క‌రోజు కూడా గ‌డిచి ఉండ‌దు.

వ‌చ్చేస్తాడు , మ‌ళ్లీ టీవీలో క‌నిపిస్తాడు. తీయ‌ని తెలుగులో మాట్లాడ్తాడు, పాడుతాడు అనుకున్నాం. మృత్యువుకి ర‌స‌జ్ఞ‌త లేదు. తీసుకెళ్లి పోయింది. కానీ బాలు పాట‌ని తీసుకెళ్ల‌డం దాని వ‌ల్ల కూడా కాదు. అది చిరంజీవి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp