మరువలేని మధుర గాత్రం - Nostalgia

By iDream Post Sep. 25, 2021, 08:45 pm IST
మరువలేని మధుర గాత్రం - Nostalgia

బాలు వెళ్ళిపోయి అప్పుడే ఏడాది అయిపోయిందా. కాలం మరీ ఇంత వేగంగా పరిగెడుతోందా. అయినా నవ్వుకోవడానికి కాకపోతే బాలసుబ్రమణ్యం అనే స్వరానికి మరణం ఉంటుందా. భౌతికంగా సెలవు తీసుకుని స్వర్గంలో విశ్రాంతి తీసుకోవడానికి సెప్టెంబర్ 25ని ఒక వేదికగా మార్చుకున్నారు కానీ అసలు ఆ స్వరం వినిపించని రోజులు, ఆ పాటలు కనిపించని ఛానళ్లు, కేవలం ఈయన పాటల కోసమే మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ కి వెళ్లే శ్రోతలు లేకుండా పోతాయా. పాడుతా తీయగా కార్యక్రమం ఎందరి జీవితాల్లో వెలుగులు నింపిందో, ఎందరికి స్ఫూర్తినిచ్చిందో లెక్క బెట్టడం ఎవరి తరం. కోట్లాది వీక్షకులకు సంగీత జ్ఞానం దక్కేలా చేసింది పండితారాధ్యుల గళమేగా.

నిజమే బాలు ఎక్కడికీ వెళ్ళలేదు. వెళ్ళలేరు. ఓ విరహ ప్రేమికుడి ఆవేదనను 'ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం' అంటూ ఆర్ద్రత నిండిన స్వరంతో ఇంకొకరు పాడటం ఊహించగలమా. గుక్కతిప్పుకోకుండా పట్టుమని పది సెకండ్లు మాట్లాడలేం. అలాంటిది 'మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు' అంటూ ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతాన్ని ఆవిష్కరించడం ఇంకెవరి వల్ల అవుతుంది. ' 'హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం' అంటూ సరదా ఆటపట్టించే ప్రేమికుడి అల్లరిని అంత చిలిపిగా ఇంకెవరు పాడగలరు. 'లాలిజో లాలిజో ఊరుకో పాపాయి' పాట పెడితే ఎంత అల్లరి పిడుగులైనా కునుకుకు లొంగకుండా ఉండగలరా.

'ఏ దివిలో విరిసిన పారిజాతమో' అంటూ అమ్మాయిని అందమైన అమ్మాయిని వర్ణించిన కవి హృదయాన్ని బాలు కన్నా గొప్పగా పాడటం ఎవరి తరం. 'నా పాట పంచామృతం', 'శ్రీ తుంబుర నారద నాదామృతం'లో దిగ్గజాలు సైతం విస్మయం చెందే లయ విన్యాసాలు ఎన్నో. 'అత్తో అత్తమ్మ కూతురో'అంటూ సరస గీతాలు, 'చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది' అంటూ చైతన్యం రగిలించే స్వర సాహసాలు లెక్కబెట్టడం సాధ్యమా. 40 వేల పాటల్లో కేవలం కొన్ని మాత్రమే ప్రస్తావించడం సముద్రం నీటిని చేతితో పట్టే సాహసం చేయడమే. గాలి నీరు ఆకాశం వీటికి మరణం లేదు ఉండదు. అలాగే బాలు పాటకు మాటకు కూడా. ఇవి చిరంజీవులు

Also Read : మహేష్ ఎవర్ గ్రీన్ ఎంటర్ టైనర్ - Nostalgia

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp