కొత్త సినిమా ... నేడే చూడండి - Nostalgia

By G.R Maharshi Jan. 24, 2021, 06:07 pm IST
కొత్త సినిమా ... నేడే చూడండి - Nostalgia

సినిమా బండి. పిర‌మిడ్ ఆకారంలో (చ‌ప్ప‌రం) అటూఇటూ సినిమా పోస్ట‌ర్లు. వాటి ప‌క్క‌న తారాగ‌ణం అని హీరోహీరోయిన్ల పేర్లు. మీ అభిమాన KB. పిక్చ‌ర్ ప్యాలెస్‌లో ఎన్ని ఆట‌లో నీలి అక్ష‌రాల‌తో రాసేవాళ్లు. సాధార‌ణంగా 2 ఆట‌లు. కొత్త సినిమా అయితే శుక్ర‌, శ‌ని, ఆదివారాలు 3 ఆట‌లు. మార్నింగ్ షో చాలా అరుదు.

రాయ‌దుర్గంలో స్కూల్ వ‌దిలిన త‌ర్వాత పిల్ల‌లంద‌రికీ ఈ సినిమా బండి ఒక వినోదం. 4 గంట‌ల‌కి థియేట‌ర్ ద‌గ్గ‌ర బ‌య‌ల్దేరి , 4.30కి ల‌క్ష్మిబ‌జార్ చేరేది. ఒంటెద్దు ఈ ప్ర‌పంచంతో ఏమీ సంబంధం లేన‌ట్టు న‌డుస్తూ ఉండేది. దాన్ని న‌డిపే మ‌నిషి కూడా ఒక మాసిపోయిన అంగీతో , గ‌ళ్ల లుంగీతో ఏదో అజ్ఞాత శ‌క్తికి లోబ‌డిన‌ట్టు ముందుకి చూస్తూ , గ‌త జ‌న్మ స్మృతుల్లోంచి ఉలికిప‌డ్డ‌ట్లు అప్పుడ‌ప్పుడు హాయ్ హాయ్ అని ఎద్దుని అదిలించేవాడు. బండి ముంద‌ర ముగ్గురు బ‌క్క ప్రాణులు ఖాకీ నిక్క‌ర్ , అంగీల‌తో త‌ప్పెట్లు కొట్టేవాళ్లు. ఇద్ద‌రి చేతిలో లేత పసుపు రంగు చ‌ర్మానికి గుండ్ర‌టి ఆకారం ఇచ్చిన త‌ప్పెట్లు ఉండేవి. కుల్పి ఆకారంలో బ‌లంగా ఉండే రెండు పుల్ల‌లు "జ‌జ్జ‌న‌క్క‌, జ‌జ్‌న‌క్క" అని ద‌రువేసేవి. వీటికి స‌పోర్ట్‌గా మ‌ధ్య‌లో వాడి చేతిలో త‌బ‌లా కంటే పెద్ద సైజులో ఉన్న గుండ్ర‌టి ప‌ల‌క మీద ఈత పుల్లల కంటే పెద్ద సైజు పుల్ల‌ల‌తో ద‌రువేసేవాడు. త‌ప్పెట్లు భుజానికి వేలాడితే ఈ త‌బ‌లా మెడ‌లో వేలాడేది.

ఈ జ‌ర్నీ మ‌ధ్య‌లో త‌ప్పెట్ల‌లో వేడి త‌గ్గేది. ఎద్దుకి కాస్త రెస్ట్‌. బండి ఆగేది. క‌ర్ర పుల్ల‌ల‌తో మంట పెట్టి త‌ప్పెట్ల చ‌ర్మానికి సెగ త‌గిలించే వాళ్లు. వాటి ర‌క్తం మ‌రిగి "జగ్‌న‌క‌న‌క" అని ఊపందుకునేవి. ఈ ద‌రువుకి అద‌నంగా మైక్‌లో సినిమా పాట‌లొచ్చేవి. ఈ బండి చీక‌టి ప‌డేస‌రికి ఊరంతా ఒక రౌండ్ వేసేది. కొత్త సినిమాలు వ‌స్తే ఉద‌యం, సాయంత్రం తిరిగేది.

కొత్త‌వి , హిట్ సినిమాలైతే బ్యాండ్ మేళం ఎక్స్‌ట్రా. ద‌స‌రాబుల్లోడుకి పులివేషాలు కూడా వేసారు. ఈ బండి వెనుక చిరుగుల అంగీ నిక్క‌ర్‌తో ఒక మూగోడు న‌డిచేవాడు. వాడికి 16 ఏళ్లు ఉంటాయేమో. వాడి చేతిలో రంగురంగుల సినిమా పాంప్లేట్లు ఉండేవి. పిల్ల‌లు అడిగితే ఇవ్వ‌కుండా త‌రుముకునేవాడు. వెంట‌ప‌డి వేధిస్తే ఒక‌టి ఇచ్చి ఇక వెళ్లిపొమ్మ‌ని మూగ‌సైగ‌ల‌తో బెదిరించేవాడు. నేను 3లో ఉన్న‌ప్పుడు 2వ త‌ర‌గ‌తిలో ఎల్ల‌ప్ప అనేవాడు ఉండేవాడు. మా చేతిలోని గోలీలు నిస్స‌త్తువుగా జారితే , వాడి చేతిలో తుపానుండేది. గురి పెడితే గోలి ప‌గిలిపోయేది. ప్ర‌తి ఆట‌లో నంబ‌ర్ 1. వాడు ఒక రోజు సినిమా బండి ముందు త‌ప్పెట కొడుతూ క‌నిపించాడు. "మా నాయిన స్కూల్‌కి పోవ‌ద్ద‌న్నాడురా" అని చెప్పాడు. కొంత కాలానికి అమ్మ‌వారు పోసి చ‌నిపోయాడు. ఇప్ప‌టికీ త‌ప్పెట‌ని చూస్తే వాడే గుర్తుకొస్తాడు.

సినిమా బండిలో పాట‌కి పాట‌కి మ‌ధ్య‌న మీ అభిమాన బాల‌ప్ప సినిమాలో (KB.పిక్చ‌ర్ ప్యాలెస్‌ని బాల‌ప్ప సినిమా అని కూడా అనేవాళ్లు) నేడే చూడండి గండికోట ర‌హ‌స్యం అని చెప్పేవాళ్లు. ప్ర‌తిప‌నిలో ఒక మాస్ట‌ర్ ఉంటాడు. అజీజియా సినిమా బండిలో ఈ కొత్త అనౌన్స‌ర్ వ‌చ్చాడు. అనంత‌పురం నుంచి బ‌త‌క‌డం కోసం ఒక కుర్రాడు రాయదుర్గం వ‌చ్చాడు. సినిమా బండిలో ప‌ని. అత‌ను అనౌన్స్ చేస్తూ హ‌ఠాత్తుగా పాట పెట్టేవాడు. పాట వ‌స్తూ వుంటే ఆపి అనౌన్స్ చేసేవాడు. రేడియో సిలోన్‌లో అప్ప‌ట్లో ఆ ర‌కంగా యాడ్స్ వ‌చ్చేవి. రోడ్డుపై వెళుతున్న జ‌నం కూడా ఆగి ఈ అనౌన్స్‌మెంట్ వినేవాళ్లు.

తెల్లారి నిద్ర‌లేచే స‌రికి గోడ‌ల మీద కొత్త సినిమా పోస్ట‌ర్లు ప‌డేవి. వాటిని ఎవ‌రు అతికిస్తారో తెలిసేది కాదు. వేరే ఎవ‌రో లోకం మ‌నుషులొచ్చి ఆ ప‌ని చేస్తారేమో అన్న‌ట్టుండేది. ఒక రోజు సెకెండ్ షో సినిమా నుంచి వ‌స్తుంటే వాళ్లు క‌నిపించారు. ఒంటి మీద బ‌ట్ట‌లు కూడా స‌రిగా లేని ముగ్గురు , ఒక సైకిల్‌కి చిన్న నిచ్చెన త‌గిలించుని, చిన్న బ‌కెట్లో మైదాపిండి బంక‌, పోస్ట‌ర్ల క‌ట్ట మోసుకుని , అర్ధ‌రాత్రి దెయ్యాల్లా తిరుగుతున్నారు. జ‌నం వినోదం కోసం వాళ్లు అర్ధ‌రాత్రి ప‌నిచేసిన‌ట్టు, పేప‌ర్ చ‌దివే వాళ్ల కోసం చాలా ఏళ్లు అర్ధ‌రాత్రులే ప‌నిచేస్తాన‌ని నాక‌ప్పుడు తెలియ‌దు. అన్నీ రాసి పెట్టి ఉంటాయి.

పోస్ట‌ర్లు అతికించే వాళ్లే కాదు, పేడ విసిరే బ్యాచ్ కూడా అర్ధ‌రాత్రే ప‌నిచేసేది. NTR అభిమానులు నాగేశ్వ‌ర‌రావు పోస్ట‌ర్ల‌పైన‌, NTRపైన‌ ANR అభిమానులు విసిరి సంతోషించేవాళ్లు. ఇపుడు సినిమా బ‌ళ్లు లేవు. పోస్ట‌ర్లు కూడా ఎక్క‌డో త‌ప్ప ఉండ‌వు. పాట‌ల పుస్త‌కాలు మాయ‌మై చాలా కాల‌మైంది. ఏమున్నా లేక‌పోయినా సినిమా ఎప్ప‌టికీ ఉంటుంది. క‌రోనా కూడా ఏమీ చేయ‌లేక‌పోయింది. జ‌నం ఇళ్ల‌లో ఉండి కూడా విపరీతంగా చూశారు. సినిమా ఒక క‌ల‌. అది లేకుండా బ‌త‌క‌డం క‌ష్టం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp