హృదయాన్ని తాకే ప్రొఫెసర్ - Nostalgia

By iDream Post Sep. 28, 2020, 09:17 pm IST
హృదయాన్ని తాకే ప్రొఫెసర్  - Nostalgia
కొన్ని సినిమాలు ఒక్కోసారి రాంగ్ టైమింగ్ లో విడుదల కావడమో లేదా పోటీగా ఉన్న ఇతర చిత్రాల ప్రభావం వల్లనో ఆశించిన ఫలితాలు అందుకోలేక దూరమవుతాయి. వీటిలో క్లాసిక్స్ కూడా ఉంటాయి. అలాంటిదే ప్రొఫెసర్ విశ్వం. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ చందమామ విజయ కంబైన్స్ 1994లో తమిళంలో 'నమ్మవర్' పేరుతో ఓ సినిమా తీసింది.ఇది 1987లో వచ్చిన మోహన్ లాల్ మలయాళం మూవీ 'చెప్పు' ఆధారంగా రూపొందింది. వీటికి అసలు మూలం ఓ కెనెడియన్ సినిమా. కమల్ హాసన్, గౌతమి జంటగా నటించగా నగేష్, కోవై సరళ, శ్రీవిద్య తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. కెఎస్ సేతుమాధవన్ దర్శకుడు. మధు అంబట్ ఛాయాగ్రహణం అందించారు. 

హిస్టరీ లెక్చరర్ అయిన విశ్వం(కమల్ హాసన్)ఓ పేరున్న కాలేజీకి వైస్ ప్రిన్సిపాల్ గా వస్తాడు. దాని చైర్మన్ కొడుకు రమేష్(కరణ్) వ్యసనాలకు బానిసై విపరీత అలవాట్లకు లోను కావడంతో కళాశాల వాతావరణం అస్తవ్యస్తంగా ఉంటుంది. దాన్ని ప్రక్షాళన చేయడానికి పూనుకుంటాడు విశ్వం. కానీ ఈ క్రమంలో ఎన్నో అవమానాలు, పోరాటలు చేయాల్సి వస్తుంది. అయినా వెనక్కు తగ్గడు. అదే కాలేజీలో పనిచేసే వసంతి(గౌతమి)ముందు విశ్వం పట్ల వ్యతిరేకత చూపినా తర్వాత మద్దతు ఇస్తుంది. విశ్వంని దెబ్బతీసే ప్రయత్నంలో రమేష్ చేసిన కుట్ర వల్ల ఓ అమాయకురాలు బలవుతుంది. అదే సమయంలో విశ్వంకు క్యాన్సర్ అనే చేదు నిజం బయటపడుతుంది. తర్వాత ఏం జరిగిందన్నదే మిగిలిన కథ. తమిళనాట నమ్మవర్ ఘన విజయం సాధించింది. దీనికి స్క్రీన్ ప్లే కమల్ స్వయంగా సమకూర్చడం విశేషం. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఓ స్టార్ హీరో నటించిన సినిమా ఎంటర్ టైనింగ్ గానూ మెసేజ్ ఇచ్చేలానూ ఉండటం పట్ల క్రిటిక్స్ సైతం ప్రశంశలు అందించారు. 

దీనికి తమిళ ఉత్తమ చిత్రంతో పాటు నగేష్ కు నేషనల్ అవార్డులు దక్కాయి. స్పెషల్ క్యాటగిరీలో సంగీతానికి దక్కింది. మ్యూజిక్ డైరెక్టర్ కు సంబంధించి ఓ విశేషం ఉంది. మహేష్ మహదేవన్ దీనితోనే పరిచయమయ్యాడు. తెలుగులో వెంకటేష్ ప్రేమించుకుందాం రాకు ట్యూన్స్ అందించింది ఇతనే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం మణిశర్మ ఇచ్చారు. ఆ తర్వాత నాలుగు తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు చేశాక 2002లో క్యాన్సర్ తో ఆయన కన్నుమూయడం విషాదం. నమ్మవర్ తెలుగులోనూ విజయ సంస్థ డబ్బింగ్ చేసి విడుదల చేసింది. అయితే మనవాళ్లకు ఇది అంతగా కనెక్ట్ కాలేకపోయింది. ఏ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించుకున్నా  మిగిలిన కేంద్రాల్లో మాత్రం సోసోగానే ఆడింది. దీనికి చిరంజీవి మాస్టర్ కి దగ్గరి పోలికలు గమనించవచ్చు. నమ్మవర్ వచ్చిన మూడేళ్ళకు మాస్టర్ విడుదలైంది. కమల్ హాసన్ తన కెరీర్ బెస్ట్ లో నమ్మవర్ ని ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. భ్రష్టుపట్టిన కాలేజీని తీర్చిదిద్దే హీరో పాత్రలకు ఒకరకంగా శ్రీకారం చుట్టింది ప్రొఫసర్ విశ్వమే. 
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp