కొత్త ఫార్ములాతో మెప్పించిన పోలీస్ - Nostalgia

By iDream Post Jul. 19, 2020, 09:17 pm IST
కొత్త ఫార్ములాతో మెప్పించిన పోలీస్ - Nostalgia

సాధారణంగా మన సినిమాల్లో పోలీసు హీరోలు భారీగా కేకలు పెడుతూ డైలాగులు చెబుతూ విలన్ల తుక్కు రేగ్గొడుతూ మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తారు. నిజజీవితంలోనూ ఖాకీలు ఇలా ఉంటే బాగుంటుందనిపిస్తుంది కానీ ప్రాక్టికల్ గా అది సాధ్యం కాదు. అంకుశంలో రాజశేఖర్, పోలీస్ స్టోరీలో సాయి కుమార్, రౌడీ ఇన్స్ పెక్టర్ లో బాలకృష్ణ ఇలా ఏది చూసినా ఒక రకమైన కమర్షియల్ ఫార్ములా ఆయా పాత్రల వెనుక ఉంటుంది. కానీ దానికి భిన్నంగా కొంచెం డిఫరెంట్ అప్రోచ్ లో వచ్చిన మూవీగా రక్షణ గురించి చెప్పుకోవచ్చు. కింగ్ నాగార్జున - శోభన జంటగా ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీ 1993లో విడుదలయింది.

వైజాగ్ నుంచి హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ మీద వచ్చిన ఏసిపి బోస్(నాగార్జున)సిటీలో రౌడీ రాజ్యం నడిపిస్తున్న రాజకీయ నాయకుడు నల్ల శీను(కోట శ్రీనివాసరావు)అతని తమ్ముడు చిన్నా(సలీం బేగ్)లకు ఎదురుతిరుగుతాడు. కానీ పరమ దుర్మార్గుడైన చిన్న వల్ల బోస్ కొలీగ్ (నాజర్)ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ఎలాగైనా వాళ్ళ నేర సామ్రాజ్యాన్ని మట్టుబెట్టాలని డిసైడ్ అవుతాడు బోస్. కానీ అనూహ్యంగా చిన్నా ప్లాన్ వల్ల తనే ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. పెళ్ళై పాప కుండా ఉన్న బోస్ నల్లశీను, చిన్నాలను ఏం చేశాడన్నదే రక్షణ కథ. రెగ్యులర్ ఫార్ములా తరహాలో కాకుండా ఉప్పలపాటి నారాయణరావు చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో రక్షణను నడిపించారు. హీరో ఇంట్రోని ప్రేక్షకులు ఆశించే విధంగా కాకుండా ఒళ్ళంతా గాయాలతో, రక్తంతో నాగ్ పాత్రను పరిచయం చేయడం ఎవరూ ఊహించనిది.

అక్కడి నుంచే స్టోరీ ఫ్లాష్ మోడ్ లోకి వెళ్తుంది. ఇది చాలా డిఫరెంట్ థాట్ అని చెప్పొచ్చు. హడావిడి లేకుండా సీన్స్ చాలా కూల్ గా సాగుతాయి. చిన్నా క్రూరత్వాన్ని మితిమీరకుండా గ్లోరిఫై చేసి భయపెట్టేలా చేయడం ఉప్పలపాటి ప్రత్యేకత. ఈ శైలి నచ్చే నాగార్జున తనకు జైత్రయాత్ర రూపంలో ఫ్లాప్ ఇచ్చినా ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. ఆయన దాన్ని నిలబెట్టుకున్నారు. ఇలాంటి పోలీస్ కథల్లో పాటలకు పెద్దగా స్కోప్ ఉండదు. కాని ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీలు ఇచ్చారు. మ్యూజికల్ గానూ ఇది పెద్ద హిట్టు. కోట విలనీ ఓ రేంజ్ లో పండగా సలీం బేగ్ దీని దెబ్బకు చాలా అవకాశాలు దక్కించుకున్నాడు. ఘల్లుమంది బాసు పాటలో రోజా స్పెషల్ క్యామియో చేయడం విశేషం. అల్లరి అల్లుడు, వారసుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాంతో మాస్ సినిమాలతో దూకుడు మీదున్న నాగార్జునకు రక్షణ ఒక స్టైలిష్ థ్రిల్లర్ గా నిలిచిపోయింది. రికార్డులు బద్దలు కొట్టకపోయినా డీసెంట్ హిట్ గా నిలిచి మెమరబుల్ మూవీగా మిగిలిపోయింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp