ఎన్టీఆర్ అభిమానులకు కోపం తెప్పించిన కోట - Nostalgia

By iDream Post Oct. 24, 2020, 09:15 pm IST
ఎన్టీఆర్ అభిమానులకు కోపం తెప్పించిన కోట - Nostalgia

సినిమాల్లో వివాదాలు కొత్త కాదు కానీ ప్రముఖుల మీద తీస్తునప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవలే ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 నుంచి విజయ్ సేతుపతి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో కళ్లారా చూసాం. ఇలాంటివి ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. అందుకు ఉదాహరణ 1987లో వచ్చిన మండలాధీశుడు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాక ఆయన విధానాలు సూపర్ స్టార్ కృష్ణకు అట్టే నచ్చేవి కావు. దానికి నిరసన సినిమాల రూపంలోనే చూపించాలని నిర్ణయించుకుని విజయనిర్మలతో కలిసి పలు చిత్రాలను నిర్మించారు. వాటిలో ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి వేరే నటుల ద్వారా ఆయన పాత్రను ధరింపజేసి ఎండగట్టేవాళ్ళు.

అందులో భాగంగా వచ్చిందే ఈ సినిమా. మండలాధీశుడులో టైటిల్ రోల్ కోసం కోట శ్రీనివాసరావును తీసుకున్నారు. నటులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి దీనికి దర్శకత్వం వహించారు. భానుమతి గారు ఓ కీలక పాత్ర చేయగా ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో నటించిన పద్మనాభం లాంటి సీనియర్లు ఇందులో పాలు పంచుకున్నారు. సినిమా మొత్తం ఎన్టీఆర్ ను వ్యంగ్యంగా చూపిస్తూ ఒక నటుడు రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరుకొని తన స్వార్థపూరిత విధానాలతో ఎంతటి పతనానికి తీసుకెళ్తాడో ఇందులో చెప్పే ప్రయత్నం చేశారు. ఎక్కడా నేరుగా ఎన్టీఆర్ పేరు ప్రస్తావించనప్పటికీ ఎవరికైనా సులువుగా అది ఎవరిని ఉద్దేశించి తీసిందో అర్థమవుతుంది

మండలాధీశుడు సక్సెస్ కాలేదు కానీ వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచింది. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు పట్ల నందమూరి అభిమానులు తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్నారు. ఓసారి రైల్వే స్టేషన్ లో కొట్టినంత పని చేశారు. దెబ్బకు ఓ ఏడాది పాటు వేషాలు కూడా పెద్దగా రాలేదు. అయితే కృష్ణ అండదండలు ఉండటంతో ఇతర ఆఫర్లతో కొన్నేళ్లు నెట్టుకొచ్చారు. ఓ సందర్భంలో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి కోట ఇది తాను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ టైంలోనే బాలకృష్ణ సినిమాల్లో కూడా కోటకు అవకాశాలు రాలేదు. అంత సీరియస్ గా జరిగింది వ్యవహారం. ఐదారేళ్ళ తర్వాత పరిస్థితి సద్దుమణిగి కోట పునర్వైభవానికి వచ్చేశారు. ఇదే తరహాలో గండిపేట రహస్యం, నా పిలుపే ప్రభంజనం, సాహసమే నా ఊపిరి చిత్రాలు వచ్చాయి. వాటిలో కూడా ఎన్టీఆర్ ని టార్గెట్ చేయడం గమనించవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp