వీర్నాయుడు విశ్వరూపం 'నాయకుడు' - Nostalgia

By iDream Post Oct. 21, 2020, 09:29 pm IST
వీర్నాయుడు విశ్వరూపం 'నాయకుడు' - Nostalgia

మాఫియా కథలకు హాలీవుడ్ ఫిలిం మేకర్స్ అందరూ ఒక బైబిల్ లా ఫాలో అయ్యే సినిమా గాడ్ ఫాదర్. చీకటి సామ్రాజ్యానికి అధిపతి అయిన ఒక వ్యక్తి జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు అది కూడా అతను చేసిన తప్పులు నేరాలు ప్రేక్షకులు ఒప్పుకునేటట్టు చేయడం అందులోనే సాధ్యమయ్యింది. అలాంటిది మనకూ ఒకటుండాలనే లక్ష్యంతో మణిరత్నం 1987లో ఆవిష్కరించిన అద్భుత దృశ్యకావ్యం నాయకుడు. తమిళనాడు వాస్తవ్యుడైన వరదరాజన్ ముదలియార్ ముంబైలో రాజ్యమేలిన ఉదంతాన్ని దీని కోసం స్ఫూర్తిగా తీసుకున్నారు. అంతకు ముందు 1980 ప్రాంతంలో గాడ్ ఫాదర్ ఇన్స్ పిరేషన్ తో ఓ కథను రచయిత ముక్తా శ్రీనివాసన్ సీనియర్ హీరో శివాజీ గణేశన్ కోసం తయారు చేశారు. కొడుకు పాత్రలో కమల్ హాసన్ మరో కీలక రోల్ కోసం అమలను కూడా అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. కొంతకాలం తర్వాత కమల్ సూచన మేరకు శ్రీనివాసన్ మణిరత్నంని కలవడం, ఇద్దరూ కలిసి తగినన్ని మార్పులు చేసి నాయకుడు సినిమాకు ఓ రూపం తీసుకురావడం జరిగింది.

ముందు అనుకున్న బడ్జెట్ 60 లక్షలు. కానీ అనుకున్నదాని కన్నా ఎక్కువ పెరిగిపోయి ఏకంగా ఖర్చు కోటి రూపాయలకు చేరుకుంది. కమల్ హాసన్ రెమ్యునరేషన్ ఆ సమయంలో 17 లక్షలు. 1986 చివరి రెండు నెలలు కేవలం టెస్ట్ షూట్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు మణిరత్నం దీని మీద ఎంత దృష్టి పెట్టారో. ఆ టైంలోనే కమల్ గెటప్పులకు సంబంధించి రకరకాల ప్రయోగాలు చేసి ఫోటో షూట్లు తీసి ఫైనల్ గా మూడు ఓకే చేశారు. 1987 జనవరిలో ముంబై ధారవి ప్రాంతంలో షూటింగ్ మొదలయ్యింది. అన్ని సన్నివేశాలు అక్కడ తీయడం సాధ్యం కాదు కాబట్టి ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఫోటోలు తీసుకుని చెన్నై వీనస్ స్టూడియోలో దాన్ని పునఃసృష్టించారు. కేవలం పోరాట దృశ్యాలను తీయడానికే 12 లక్షల దాకా వ్యయం చేయాల్సి వచ్చింది. పిసి శ్రీరామ్ తన ఛాయాగ్రహణంతో ప్రాణం పోశారు. హీరోయిన్ శరణ్య, జనగరాజ్, ఢిల్లీ గణేష్, చెల్లెలిగా నటించిన తార, కొడుకుగా చేసిన నిలగల్ రవి అందరూ సహజమైన నటనతో కెరీర్ బెస్ట్ ఇచ్చేశారు. వీర్నాయుడు అల్లుడు కం పోలీస్ ఆఫీసర్ గా నటించిన నాజర్ కు ఈ సినిమా గొప్ప మలుపు.

1987 అక్టోబర్ 21న నాయకన్ తమిళనాడులో భారీ ఎత్తున విడుదలైంది. మణిరత్నం దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు. ఇళయరాజా సంగీతం ఏళ్ళ తరబడి వెంటాడింది. ముఖ్యంగా 'నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది' పాటను దాటే ఎమోషనల్ సాంగ్ మరొకటి రాలేదంటే అతిశయోక్తి కాదు. వీరయ్య నాయుడు జీవితంలోని నాలుగు దశలను చూపించిన తీరు ఏకబికిన 175 రోజులు నాయకుడిని థియేటర్లలో తిష్ట వేసేలా చేసింది. తెలుగు వెర్షన్ కొంత ఆలస్యంగా అదే సంవత్సరం నవంబర్ 11న రిలీజయింది. ఇక్కడా అదే స్పందన. ఎక్కడ చూసినా వీర్నాయుడు విశ్వరూపం గురించే చర్చలు. ఎక్కడ విన్నా నాయకుడు పాటలే. మనిషి మంచికో చెడుకో తను చేసిన తప్పులకు ఏదో ఒక రూపంలో మూల్యం చెల్లించాల్సిందే అనే సందేశాన్ని ఇస్తూ వీర్నాయుడు పాత్రను క్లైమాక్స్ లో ఓ పిచ్చివాడి చేతిలో చంపించడం ఓ గొప్ప ముగింపు. ఇక నాయకుడుకు వచ్చిన అవార్డులు, గుర్తింపు, పురస్కారాలు తమిళ సినిమా చరిత్రలో అతి కొద్దివాటికి మాత్రమే దక్కాయి. అందుకే 33 ఏళ్ళు గడుస్తున్నా నాయకుడు కల్ట్ క్లాసిక్ స్థాయిని ఎప్పుడో దాటేసి నవతరం దర్శకులకు సైతం ఒక రిఫరెన్స్ బుక్ గా నిలిచిపోయింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp