సినిమా పత్రికలు - మధుర జ్ఞాపకాలు - Nostalgia

By iDream Post Aug. 01, 2020, 09:28 pm IST
సినిమా పత్రికలు - మధుర జ్ఞాపకాలు  - Nostalgia

నా చిన్నప్పుడు బహుశా తొమ్మిదో లేక పదో ఏట అనుకుంటా.....

మా ఇంట్లో ఈ సీన్ పదే పదే వారానికోసారి రిపీట్ అవుతూనే ఉండేది

"రేయ్ ఆ పక్కింటి గుర్నాథం గాడు ఉదయం అనంగా తీసుకెళ్లాడు. బుద్ది లేని గాడిద. తిరిగి తెచ్చివాలన్న ధ్యాసా లేదు, పరుల సొమ్మన్న భయమూ లేదు. ఇప్పటికే ఎంత నలిపేశారో. పోయి అర్జెంట్ గా పట్రాపో"

నాన్న ఆర్డర్ వేశారు....

అప్పటికప్పుడు కాళ్లకు మోటారు బిగించిన చక్రాలు కట్టుకుని మూడిళ్ల అవతల ఉన్న బానపొట్ట గుర్నాథం ఇంటికి వెళ్లకపోతే ఉప్పు నీటిలో హార్లిక్స్ కలిపి బలవంతంగా తాగించి కసి తీర్చుకునేలా ఉన్నాడు నాన్న. పిటి ఉషా తమ్ముడిలా పరుగులు పెడుతూ ఆయాసంతో రొప్పుతున్నా నేను తీసుకురాబోతున్న బంగారాన్ని తలుచుకుంటూ ఎట్టకేలకు గమ్యం చేరుకున్నా.

ఇదంతా దేనికీ అనుకుంటున్నారా. సితార, జ్యోతిచిత్ర, శివరంజని లాంటి సినిమా పత్రికల గురించి. అప్పట్లో న్యూస్ పేపర్లు సగటు మనిషి జీవితంలో గాలి నీరు తిండి లాంటి కనీస అవసరాలతో పోటీ పడుతూ ఒక భాగంగా మారిపోయాయి. అందులోనూ తారల కబుర్లు మోసుకొచ్చే ఇలాంటి మ్యాగజైన్లు అంటే ఇంకెంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

నా చిన్నప్పుడు 4జి టెక్నాలజీ లేదు ఆన్ లైన్లో ఫ్రీగా సినిమాలు చూసేందుకు....

.నా పసితనంలో ఆన్ లైన్ బుకింగ్ లేదు దర్జాగా షో స్టార్ట్ అవ్వడానికి అరగంట ముందు తాపీగా బయలుదేరడానికి.....

నాకు ఊహ తెలిసే రోజుల్లో టీవీ ఛానల్సే లేవు రోజుకో వంద సినిమాలు మొహం మొత్తే దాకా చూస్తూ ఉండడానికి......

నేను స్కూల్ కు వెళ్లే రోజుల్లో ఫేస్ బుక్, ట్విట్టర్లు లేవు కొత్త సినిమాల పోస్టర్లు, ట్రైలర్లు మొదటి రోజే చూసేందుకు.....

నా బాల్యం వీధుల్లో ఆడుకుంటున్న రోజుల్లో లైవ్ టెలికాస్ట్ లేదు ఆడియో విడుదలలు ప్రీ రిలీజులు ఇంట్లో సోఫా మీద దర్జాగా కూర్చుని ఎంజాయ్ చేయడానికి....

అందుకే

ఆ టైంలో రోజుకో మూడు నాలుగు గంటలు మాత్రమే చూసే టీవీ, నెలకోసారి వెళ్తే ఎన్నో జన్మల అదృష్టంగా భావించే థియేటర్ దర్శనం తర్వాత తారల కబుర్లు మోసుకొచ్చే పత్రికలే మాకు హోమ్ ఎంటర్ టైన్మెంట్

పత్రిక ఏదైనా పేరు ఏదున్నా అందులో స్టార్ల కొత్త సినిమాల విశేషాలు, వర్కింగ్ స్టిల్స్, ఇంటర్వ్యూలు, సరదా సంభాషణలు, వివాదాలు, వినోదాలు, బ్లో అప్పులు, విశ్వరూపాలు ఒకటా రెండా పట్టుమని పాతిక పేజీలు లేకపోయినా తనివితీరా వాటిని చూసుకుంటూ చదువుకుంటూ మురిసిపోవడానికి ఇంట్లో ఒక్కొక్కరికి 24 గంటలు సరిపోయేవి కాదు.

అమ్మకు వంటయ్యాక....
నాన్న షాపు నుంచి ఇంటికొచ్చాక....
నాన్నమ్మకు పక్కింటి బామ్మతో ముచ్చట్లయ్యాక....
తాతయ్యకు పడకుర్చీలో నడుం వాల్చడం మొదలయ్యాక....
పక్కింటి పిన్ని మా ఇంటికొచ్చి గ్యాసు కొట్టడం పూర్తయ్యాక....
నాన్న ఫ్రెండు పలకరింపు పేరుతో వీటి మీదే టార్గెట్ పెట్టడం దాకా....
అన్నయ్య ఫ్రెండు తన హీరో కొత్త పోస్టర్ కోసం తానే వచ్చేదాకా

అందరికీ ఇవే కాలక్షేప సాధనాలు.....

జుత్తు కత్తిరింపుకు సెలూన్ వెళ్లినా,
పావలాకు పాన్ షాప్ లో అద్దెకు తెచ్చుకున్నా,
అలవాటు లేకపోయినా వీటి కోసమే టీ కొట్టులో కాఫీ తాగినా,
ముక్కుమొహం తెలియని మనుషులను బస్ స్టాండ్ లోనో స్టేషన్ లోనో ప్రేమతో పలుకరించినా,

వీటి వెనుక కారణం ఈ వినోద ప్రపంచ నేస్తాలే....

వాటిని చూస్తున్నా తిరిగేస్తున్నా టైం మెషిన్ లో వెనక్కు వెళ్లి ఏదో తెలియని అనుభూతిని పొందుతున్న ఫీలింగ్ ....

ఇది సినిమా ప్రేమికులకు మాత్రమే కలుగుతుందేమో......

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp