మాంత్రికుడి చేతిలో సక్సెస్ దండం - Nostalgia

By iDream Post Jul. 26, 2020, 08:33 pm IST
మాంత్రికుడి చేతిలో సక్సెస్ దండం - Nostalgia

మంత్రాలకు చింతకాయలు రాలవు. ముమ్మాటికి నిజం. కాని సరిగ్గా జపిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు ఖచ్చితంగా రాలుతాయి. అదెలా అంటారా.సమాజం బాగా ఆధునికం అయిపోయింది. దేవుణ్ణి మొక్కడం, హారతి తీసుకోవడం సైతం ఆన్ లైన్ లో చేస్తున్న దుస్థితి ని ఆనందంగా అనుభవిస్తున్నాం. మరి ఇలాంటప్పుడు దెయ్యాలు, మంత్రాలు, భూత వైద్యులు వగైరా లాంటివి ఎవరైనా చెప్తే వాళ్ళని పిచ్చోళ్లని చూసినట్టు చూస్తాం. కాని వెండితెర మాత్రం దీనికి మినహాయింపు.
ఈ మధ్యలో వీటి జోరు తగ్గింది కాని లారెన్స్ లాంటి దర్శకుల పుణ్యమా అని దెయ్యాలు భూతాలు అనే కాన్సెప్ట్ బాగా ప్రాచుర్యం పొందటం మొదలైంది. దెయ్యాలు అనే కాన్సెప్ట్ వెంటనే కనెక్ట్ కావడానికి కారణం వాటి పట్ల మనకున్న భయం, నిజంగా వాటిని చూసే అవకాశం లేకపోవడం తదితర కారణాలు ధియేటర్ వైపు మన లయినా వాటిని అదుపులో పెట్టే, శాశించే మాంత్రికుడి పాత్ర చాలా ముఖ్యం. మరి టాలీవుడ్ లో అలా భయపెట్టి భీభత్సం సృష్టించిన మంత్రికులని ఒకసారి గమనిస్తే....

ఎస్వి రంగారావు

పాతాళభైరవిలో సాహసం సేయరా డింభకా అంటూ ఎన్టీఆర్ ని దేవతకు బలిచ్చే విషయంలో ఎస్వి ఆర్ నటనకు భయపడని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. తీయని మాటలు చెబుతూ తోటరాముడిని వలలో వేసుకుని ప్రాణాలు తీసుకుందామని ఎత్తుగడ వేసే మాంత్రికుడిగా ఆయన పాత్ర నీరాజనాలు అందుకుంది. తర్వాత ఇలాంటివి మరికొన్ని చేసినా కూడా నేపాల మాంత్రికుడికి ఏవీ సాటిరాలేకపోయాయి. ఎందరో నటులు ఎస్వి ఆర్ ని అనుకరించే ప్రయత్నం చేసినప్పటికీ కనీసం దరిదాపులలోకి వెళ్లలేకపోయారు. తర్వాత ఎన్నోసౌమ్యమైన పాత్రలు చేసిన ఎస్వి రంగారావు గారు తనకు కెరీర్ లో అతి పెద్ద బ్రేక్ ఇచ్చిన పాతాళభైరవి అంటేనే విపరీతమైన మక్కువ చూపేవారు. జపాన్ తరహా మీసకట్టు గెడ్డంతో ఓ విలన్ పాత్రను తీర్చిదిద్దిన తీరు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిలిచిపోయింది.

అమ్రీష్ పూరి

80 దశకంలో వచ్చిన చిత్రాల్లో అడపదడపా మంత్రికులు ఉన్నప్పటికీ అమ్రీష్ పూరిది మాత్రం చాలా ప్రత్యేకమైన స్థానం. 'ఆఖరి పోరాటం'లో దొంగ బాబాగా బోడి గుండు, ఉత్తరీయంతో చూపులతోనే భయపెట్టే క్రూరమైన కసాయి పాత్రలో ఆయనని చూసి చిన్న పిల్లలే కాదు సున్నిత మనస్కులు కూడా జడుసుకునే పరిస్థితి. తెలుగు రాకపోయినా ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పటం ఆ పాత్రకు మరింత వన్నె తెచ్చింది. తన పాత్రకు హీరో సమానమైన ప్రాధాన్యం ఉండాలని కోరుకోకపోయినా ఆయన రూపం చూసే వారికి అలాగే అనిపించేది. తర్వాత 'కొండవీటి దొంగ' లో చేసిన పాత్ర, "నా కళ్ళలోకి చూడు" అనే డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' చిత్రంలోని మాంత్రికుడి పాత్ర. అద్భుతమైన వాచకం తో, గంభీరమైన స్వరంతో ఆయన నటన సినీమా ఇండస్ట్రీ హిట్ అవటంతో ముఖ్య పాత్ర పోషించింది. చిరంజీవి-శ్రీదేవి అందమైన కాంబినేషన్, అద్భుతమైన ఇళయరాజా పాటలు, అత్యున్నతమైన అశ్వినిదత్ నిర్మాణం, రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ ఇన్ని ఉన్నా కూడా అమ్రీష్ పూరి తన ఉనికిని చాటారు అంటే ఆయన ఆ పాత్రలో ఎంతగా లీనమయ్యారో అర్థమవుతుంది.

రామిరెడ్డి

అమ్మోరు సినిమాలో చేతబడులు చేసే అతి దుర్మార్గ పాత్రలో రామిరెడ్డి జీవించారు. అప్పటి దాకా రౌడీ వేషాలకు పరిమితమై చేసినవే మళ్ళీ మళ్ళీ చేస్తున్న తరుణంలో చేసిన ఈ పాత్ర రామిరెడ్డి కి కొత్త జీవితాన్ని ఇచ్చింది. క్లైమాక్స్ లో దేవత విగ్రహం ముందు భక్తురాలిని హింసిస్తూ రెచ్చగొట్టే నటనతో రామిరెడ్డి అబ్బుర పరుస్తారు.సౌందర్య పాత్ర అష్టకష్టాలు పడుతుండగా దేవతను బయటికొచ్చేలా చేసే క్షుద్ర మాంత్రికుడిగా రామిరెడ్డి పెర్ఫార్మన్స్ చూసి ఆడాళ్ళు నిజంగానే జడుసుకున్నారు. ఇది రిలీజయ్యాక బయటికి వెళ్తే మహిళలు తనకు దూరంగా జరిగి పారిపోయేవారని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత కూడా అలాంటి పాత్రలు ఎన్నో చేసి తనకు ప్రత్యాన్మయం లేదు అనిపించారు

విజయ రంగరాజు

1993లో భైరవ ద్వీపం పేరుతో జానపద చిత్రాన్ని విజయ వారు నిర్మాణానికి పూనుకున్నపుడు అందరికి ఒకటే సందేహం. పాతాళ భైరవి సినిమా చాయలున్న కథలో ఎన్టీఆర్ పాత్రకు బాలయ్య సరి. కాని కీలకమైన మాంత్రికుడి పాత్రకు ఎవరు సరితూగుతారు అనే ప్రశ్నను పటాపంచలు చేస్తూ విజయ రంగ రాజు అద్భుత అభినయంతో విజయ వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.భైరవద్వీప పాలిని అంటూ గంభీరమైన స్వరంతో ఆయన ఇచ్చిన డైలాగ్ టైమింగ్ కి దర్శకులు సింగీతం శ్రీనివాసరావు సైతం ఆశ్చర్యపోయారు. తను కాకుండా ఇంకెవరు పోషించినా ఆ మాంత్రికుడి పాత్ర అంతగా పండేది కాదని ఇప్పటికీ అభిమానులు ఒప్పుకునే మాట. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉండేదంటే అప్పటిదాకా చిన్న వేషాలకు పరిమితమైన విజయరంగరాజుకు భారీ ఆఫర్లు వచ్చేలా చేసింది

సోను సూద్

ఒక్క సినిమాతో వంద సినిమాల ఖ్యాతిని సంపాదించటం చాలా అరుదు. అది సోను సూద్ విషయంలో జరిగింది. అరుంధతి సినిమాలో వదల బొమ్మాళి వదల అని చెప్పిన డైలాగ్ ఇప్పటికీ టీవీ ఛానెల్ లో మోత మోగిస్తూ ఉంటుంది. అఘోర మాంత్రికుడు పశుపతిగా సోను నటన టైటిల్ రోల్ పాత్రధారిని అనుష్కను సైతం డొమినేట్ చేసిందనే స్థాయిలో కాంప్లిమెంట్స్ తెచ్చుకుంది. జేజెమ్మను ధీటుగా ఎదురుకుని సమాధిలో నుంచి బయటికి వచ్చి పశుపతి చేసే విశ్వరూపంలో సోనూ సూద్ ఊహించని స్థాయిలో కట్టిపడేసి ఔరా అనిపించాడు. రవి శంకర్ చెప్పిన డబ్బింగ్ అంతే స్థాయిలో పండటంతో సోనూ సూద్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పటికీ వదల బొమ్మాలి వదల అనే మాటను మిమిక్రీ చేయని ఆర్టిస్టు లేదంటే నమ్మరేమో.. అంత ప్రభావం చూపించిన పాత్ర ఇది.

ఇలా పాత కొత్త సినిమాలో ప్రేక్షకులను భయపెట్టిన మంత్రికులు చాలా ఉన్నారు. కైకాల సత్యనారాయణ గారు కూడా తనదైన ముద్రవేశారు కానీ వీరిది మాత్రం ప్రత్యేక స్థానం. తెలుగు సినిమాల్లో దెయ్యాలతో హాస్యం పండించటంలో విఠలాచార్య ఆద్యులు. జగన్మోహిని సినిమాతో ఆయన చేసిన ఇంద్రజాలం ప్రేక్షకులని సమ్మోహితుల్ని చేసింది. దెయ్యాలతో ఇలా కూడా హాస్యం చేయించవచ్చని ఆయన నిరూపించారు. కానీ కామెడీ లేకుండా సీరియస్ విలనీతో ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేయడం మాత్రం ప్రత్యేక విద్య.

ఎంత భయపెడితే అంత కనకం. అదే బాక్సాఫీస్ విజయ మంత్రం....

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp