'మనీ' చెప్పే సీక్వెల్ ముచ్చట్లు - Nostalgia

By iDream Post Jul. 08, 2020, 08:13 pm IST
'మనీ' చెప్పే సీక్వెల్ ముచ్చట్లు - Nostalgia

ఇప్పుడంటే సీక్వెల్స్ ట్రెండ్ ని చూస్తున్నాం కానీ ఒకప్పుడు అసలు ఈ ఆలోచనే పరిశ్రమలో ఉండేది కాదు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా ఒక్క భాగానికే పరిమితం. లేదంటే అడవి రాముడు, ఘరానా మొగుడు లాంటి ట్రెండ్ సెట్టర్లకు కొనసాగింపులు వచ్చేవేమో. కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను నిర్మాతగా 1993లోనే ఈ పోకడకు శ్రీకారం చుట్టారు. శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో స్టార్ హీరో లేకుండా కేవలం క్యారెక్టర్స్ ని నమ్ముకుని తీసిన సింపుల్ అండ్ క్లీన్ కామెడీ మూవీ మనీ. ప్రధాన పాత్రల్లో జయసుధ, పరేష్ రావల్, చిన్నా, జెడి చక్రవర్తి చేయగా ఖాన్ దాదాగా బ్రహ్మానందం కామెడీ ఓ రేంజ్ లో పేలింది.

డబ్బున్న భార్య కిడ్నాప్ అయితే ఆమెను విడిపించుకోవడం మానేసి ఆస్తిని ఎలా దోచేయాలనే ఆలోచనలున్న ఓ స్వార్థపరుడి కథే మనీ. లైన్ సీరియస్ గా అనిపించినా అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్రీట్మెంట్ శివ నాగేశ్వర్ గారు దీన్ని తీర్చిదిద్దారు. అసభ్యతకు తావు లేకుండా పాత్రల మధ్య హాస్యంతోనే మెప్పించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కీరవాణి స్వరపరిచిన టైటిల్ సాంగ్ తో పాటు చక్రవర్తి గారి అబ్బాయి శ్రీ ట్యూన్స్ చాలా హెల్ప్ అయ్యాయి. వెరసి మ్యూజికల్ గానూ మనీ మంచి సక్సెస్ అందుకుంది. భద్రం బీ కేర్ఫుల్ బెదరూ పాట ఇప్పటికీ ఎందరికో హాట్ ఫెవరెట్ దీంతో దీనికి సీక్వెల్ తీయాలని సంకల్పించిన వర్మ మనీ మనీ పేరుతో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఎక్కడైతే మనీ ఆగిపోయిందో అక్కడి నుంచే స్టోరీ కంటిన్యూ అవుతుంది.

మనీ క్లైమాక్స్ లో సుబ్బారావు(పరేష్ రావల్)ఎవరికి దొరక్కుండా ఓ డాబాలో పనికి చేరితే కిడ్నాప్ చేసిన ఇద్దరు కుర్రాళ్ళకు(జెడి,చిన్నా)లకు తన కంపెనీలో ఉద్యోగం ఇస్తుంది విజయ(జయసుధ). ఆ తర్వాత సుబ్బారావు మళ్ళీ రంగంలోకి దిగుతాడు. ఆపై ఏం జరిగిందన్నదే మనీ మనీ బాలన్స్ కథ. అయితే మొదటి భాగం స్థాయిలో మనీ మనీ అలరించలేక జస్ట్ యావరేజ్ గా మిగిలిపోయింది. అప్పుడు వర్మ అసిస్టెంట్ గా ఉన్న కృష్ణవంశీ దీన్ని కొంత డైరెక్ట్ చేశారన్న టాక్ వచ్చింది కానీ ఫైనల్ గా శివ నాగేశ్వరావు గారి చేతుల్లోకే అది వెళ్లిపోయింది.పాటల పరంగానూ మనీ మనీ ఫస్ట్ పార్ట్ అంత మేజిక్ చేయలేకపోయింది. జగపతిబాబు, ఊర్మిళ ఓ పాటలో అలా తళుక్కున మెరుస్తారు. ఎన్ని ప్రత్యేకతలు ఉన్నా మనీ మనీ మాత్రం యావరేజ్ గా నిలిచి అంచనాలు అందుకోలేకపోయింది. ఇప్పుడు చూస్తే మాత్రం డీసెంట్ ఎంటర్ టైనర్ గానే అనిపిస్తుంది. ఆ తర్వాత చాలా ఏళ్లకు 2011లో మనీ మనీ మోర్ మనీ పేరుతో జెడి చక్రవర్తి మూడో భాగం తీశాడు కానీ అది డిజాస్టర్ అయ్యింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp