తండ్రి కొడుకుల డబుల్ ఎమోషన్ - Nostalgia

By iDream Post Aug. 02, 2021, 07:30 pm IST
తండ్రి కొడుకుల డబుల్ ఎమోషన్ - Nostalgia

సెంటిమెంట్ ని గొప్పగా పండించాలే కానీ క్లాసు మాస్ తేడా లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఎందరో దర్శకులు రుజువు చేశారు. దాసరి 'తాత మనవడు'తో మొదలుపెట్టి వెంకటేష్ 'కలిసుందాం రా' దాకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ స్టార్ తో డీల్ చేసేటప్పుడు తగిన మోతాదులో ఎమోషన్లు ఉండేలా చూసుకోవాలి. ఎక్కువైనా తక్కువైనా కష్టమే. 1998లో శరత్ కుమార్ హీరోగా తమిళంలో ఏఎం రత్నం తీసిన 'నట్పుకాగ' బ్లాక్ బస్టర్ హిట్టు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి చాలా అవార్డులు వచ్చాయి. ఈ కథ రాసిన నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ వయసు అప్పుడు కేవలం 18 సంవత్సరాలు. సబ్జెక్టు మీద నమ్మకం అంత గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. శరత్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని తెచ్చి పెట్టింది.

Also Read: సెంటిమెంట్ రిపీట్ అయితే ఫ్లాప్ తప్పదు - Nostalgia

దీన్ని తెలుగులో తీస్తే చిరంజీవితోనే రీమేక్ చేయాలని రత్నం ఆలోచన. రిలీజయ్యాక ఫలితంతో పాటు సినిమాను చూసిన మెగాస్టార్ ఇంకేమి ఆలోచించకుండా పచ్చజెండా ఊపేశారు. అది కం బ్యాక్ అయ్యాక మంచి ఫామ్ లో ఉన్న సమయం. హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్ అయ్యాయి. చాలా కాలం తర్వాత చిరంజీవి ఇందులో వయసు మళ్ళిన తండ్రిగా ఆవేశం నిండిన కొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు. మీనా హీరోయిన్ గా ఎస్ఎ రాజ్ కుమార్ స్వరాలు సమకూర్చగా ఒరిజినల్ వెర్షన్ తీసిన కెఎస్ రవికుమారే దీన్ని కేవలం 45 రోజుల్లో పూర్తి చేయడం అప్పట్లో రికార్డు.

Also Read: ముసుగుతో తీవ్రవాదుల ఆట కట్టు - Nostalgia

విజయ్ కుమార్ వేసిన స్నేహితుడి పాత్రకు ముందు డాక్టర్ రాజశేఖర్ ని అనుకున్నారు కానీ ఆ తర్వాత మళ్ళీ మనసు మార్చుకుని తమిళంలో చేసిన విజయ్ కుమార్ నే తీసుకున్నారు. తనను చేరదీసిన యజమాని(విజయ్ కుమార్) కుటుంబం కోసం జైలుకు వెళ్లిన సింహాద్రి దాని వల్ల కొడుకు చిన్నయ్య(చిరంజీవి)కి శత్రువుగా మారాల్సి వచ్చినా లెక్క చేయడు. శిక్ష అనుభవించి వచ్చాక జరిగే ఎమోషనల్ డ్రామానే అసలు సినిమా. 1999 జనవరి 1న విడుదలైన స్నేహం కోసం మంచి ఆదరణ దక్కించుకుంది. కేవలం రెండు వారాల వ్యవధిలో వచ్చిన 'సమరసింహారెడ్డి' ప్రభంజనం వల్ల తగ్గాల్సి వచ్చినా 52 కేంద్రాల్లో వంద రోజులు ఆడటం విశేషం. సింహాద్రిగా చిరంజీవి విశ్వరూపం అభిమానులకు ఎప్పటికీ మర్చిపోలేనిది.

Also Read: మధ్యతరగతి జీవి మహాభారతం - Nostalgia

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp