ఇద్దరమ్మాయిల జీవిత పాఠాలు - Nostalgia

By iDream Post Sep. 27, 2020, 09:12 pm IST
ఇద్దరమ్మాయిల జీవిత పాఠాలు - Nostalgia

ఏ మనిషికైనా ఆశ ఉండొచ్చు. కానీ దురాశ చాలా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అందులోనూ అమ్మాయిలు దీని పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. దానికి మంచి సినిమాలు ఉదాహరణలుగా నిలుస్తాయి. అందులో ఒకటి కాంచనగంగ. 1984లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మాతగా వి మధుసూదనరావు దర్శకత్వంలో దీన్ని రూపొందించారు. యద్దనపూడి సులోచనరాణి రాసిన నవల ఆధారంగా సినిమాకు అనుగుణంగా డైరెక్టర్ దీనికి డివి నరసరాజుతో కలిసి స్క్రీన్ ప్లేని మార్పులతో తయారుచేశారు. కాలేజీలో చదువుకుంటున్న కాంచన(సరిత)లా చదివి సంఘంలో గొప్ప పేరు తెచ్చుకోవాలనే లక్ష్యం ఉంటుంది. ప్రాణ స్నేహితురాలు గంగ(స్వప్న) తక్కువ సమయంలో ధనవంతురాలు కావాలని పగటి కలలు కంటూ ఉంటుంది.

క్లాస్ మేట్ ధనవంతుడైన ప్రభాకర్(చంద్రమోహన్)కాంచన ప్రేమించుకుంటారు. పెళ్లికి సిద్దమవుతూ ఉండగా అతని ఆస్తిపాస్తులు కళ్లారా చూసిన గంగ తనవైపు ఆకర్షితుడయ్యేలా తిప్పుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది. కాంచన హృదయం బద్దలై ఊరికి వెళ్ళిపోతుంది. అయితే ఆస్తంతా ప్రభాకర్ మేనత్త(అన్నపూర్ణ)పేరు మీద ఉందని తెలిశాక కొత్త దంపతులు రోడ్డు మీదకు వస్తారు. గంగ మీద కన్ను పడ్డ మోహన్(ప్రతాప్ పోతన్)దురుద్దేశంతో తన కంపెనీలో ప్రభాకర్ కు ఉద్యోగం ఇస్తాడు. కాంచనను అండగా చదువు రాని ఆటో డ్రైవర్ జయదేవ్(శరత్ బాబు)నిలుస్తాడు. అలా వీళ్ళ జీవితాలు రకరకాల మలుపులు తిరిగి గంగ మోహన్ ని హత్య చేస్తుంది. ఆ కేసుని కాంచన టేకప్ చేసి తనను నిర్దోషిగా బయటికి తీసుకొస్తుంది. ఇది స్థూలంగా కథ. అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మధుసూదనరావు గారు సినిమాను చాలా హృద్యంగా తెరకెక్కించారు.

ఎక్కువ డ్రామా లేకుండా ఆడపిల్లల ఆలోచనా ధోరణి, వాళ్ళ బలహీనతలను వాడుకుని మగాళ్లు ఎంత దుర్మార్గాలకు పాల్పడతారో చక్కగా చూపించారు. సరిత, స్వప్న స్వభావపరంగా పూర్తి వ్యతిరేకపాత్రల్లో అద్భుతంగా జీవించారు. చక్రవర్తి సంగీతం ప్రాణంగా నిలిచింది. ముఖ్యంగా 'వనిత లత కవితా మనలేవు లేక జత' పాట బాలు గాత్రంలో ఎవర్ గ్రీన్ గా నిలిచింది. 'బృందావని ఉంది యమునా నది ఉంది' గీతానికి వేటూరి గారికి నంది అవార్డు దక్కింది. ఆ ఏడాది ఉత్తమ చిత్రం పురస్కారాన్ని కూడా కాంచనగంగ గెలుచుకుంది. సరిత, స్వప్నలతో శరత్ బాబు పాత్రలు ఇందులో ప్రధాన హై లైట్ గా నిలిచాయి. ముఖ్యంగా స్వప్న పాత్ర మహిళలను ఆలోచనలో పడవేసింది. తొందరపాటు నిర్ణయాలు ఎంతటి వినాశనానికి దారి తీస్తాయో చూపించడం వాళ్లకు నచ్చింది. ఫలితంగా కాంచనగంగ పెట్టిన బడ్జెట్ కి న్యాయం చేకూరుస్తూ వసూళ్ల పరంగానూ మంచి విజయం సొంతం చేసుకుంది. కుటుంబ కథా చిత్రాల ఒరవడిలో తనకంటూ ఓ స్థానాన్ని దక్కించుకుంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp