గిలిగింతలు పెట్టిన బాబాయ్ అబ్బాయిలు - Nostalgia

By iDream Post Jul. 29, 2020, 09:25 pm IST
గిలిగింతలు పెట్టిన బాబాయ్ అబ్బాయిలు - Nostalgia

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అరుణాచలం గుర్తుందిగా. చేతిలో పైసా లేకుండా నగరానికి వచ్చిన హీరో నెల రోజుల్లో అనూహ్యంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పందేనికి ఒప్పుకోవడం అది రివర్స్ లో సంపదను రెట్టింపు చేయడం అంతా చాలా సరదాగా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. దర్శకుడు సుందర్ తీర్చిద్దిద్ధిన విధానం సూపర్ హిట్ అయ్యేలా చేసింది. నిజానికి ఇలాంటి కథతో గతంలోనే సినిమాలు వచ్చాయి. అందులో మొదటిది స్వర్గీయ ఎన్టీఆర్ వద్దంటే డబ్బు. ఆయనతో పాటు కమెడియన్ పేకేటి శివరాం చేసిన కామెడీ అప్పట్లో ఓ రేంజ్ లో పేలింది. దీన్నే స్ఫూర్తిగా తీసుకుని హాస్యబ్రహ్మ జంధ్యాల గారు 1985లో బాబాయ్ అబ్బాయి తీశారు.

రూపాయి కాసు కోసం అల్లాడిపోయే బాబాయ్ (సుత్తివీరభద్రారావు) అబ్బాయి (బాలకృష్ణ)లకు అనుకోకుండా లక్షల సొమ్ము ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది. అది అబ్బాయ్ ప్రేమించిన అమ్మాయి తండ్రి పెట్టిన కండీషన్ వల్ల. కానీ ఊహించని రీతిలో ఎంత దుబారా చేద్దామని చూసినా అంతకు రెట్టింపు సొమ్ము వచ్చి పడుతుంది. మరి చివరికి ఏమైంది, అబ్బాయి తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా అనేదే అసలు కథ. సినిమా ఆసాంతం జంధ్యాల మార్కు హాస్యంతో సాగుతుంది. సుత్తివేలు, నిర్మలమ్మ, శ్రీలక్ష్మి, కోట శ్రీనివాసరావు, చిడతలు అప్పారావు ఇలా అందరిని మంచి క్యాస్టింగ్ సెట్ చేసుకున్నారు. రాజేంద్రప్రసాద్, ఉదయ్ కిరణ్ నువ్వు నేను విలన్ వైజాగ్ ప్రసాద్(ఇది మొదటి సినిమా)లు క్యామియోల్లో కనిపిస్తారు. అప్పటికి నట కిరీటి ఇంకా హీరోగా సెటిల్ కాలేదు. హీరోయిన్ గా అనితారెడ్డిని పరిచయం చేశారు.

అయితే మంగమ్మ గారి మనవడు బ్లాక్ బస్టర్ హిట్ తో మాస్ లో ఫాలోయింగ్ పెరిగిన బాలయ్యను ఇలాంటి పాత్రలో ప్రేక్షకులు అంగీకరించలేకపోయారు. ఇప్పుడు చూస్తే సరదాగా అనిపిస్తుంది కానీ ఆ సమయంలో బాబాయ్ అబ్బాయి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సంగీతం చక్రవర్తి అందించారు. విచిత్రంగా ఈ సినిమా షూటింగ్ లో సుమారు 20 దాకా యాక్సిడెంట్లు అయ్యాయట. ముఖ్యంగా ఓ సీన్లో హీరోయిన్ అనితా కారు డ్రైవ్ చేస్తూ బ్రేక్ వేయబోయి యాక్సిలేటర్ నొక్కడంతో నేరుగా బాలయ్యనే గుద్దేసింది. అదృష్టవశాత్తు తక్కువ గాయాలతో ఆయన బయటపడ్డారు. దీన్ని సినిమాలో యధాతధంగా వాడుకున్నారు. హీరోయిన్ అనితా దీని కన్నా ముందు శ్రీవారి శోభనం కూడా చేశారు. ఆ తర్వాత హీరో సురేష్ ని పెళ్లి చేసుకున్నారు కానీ కొంతకాలం తర్వాత విడిపోయారు. ఆవిడ గాయని కూడా . ఈ సినిమా గొప్పగా ఆడకపోయినా జంధ్యాల-బాలకృష్ణ తర్వాత చేసిన సీతారామకళ్యాణం హిట్టయ్యింది. ఇదండీ బాబాయ్ అబ్బాయిల కథాకమామీషు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp