నీకు సెలవు ఉండదు బాలూ - Nostalgia

By Ravindra Siraj Sep. 26, 2020, 01:15 pm IST
నీకు సెలవు ఉండదు బాలూ - Nostalgia

బాలు,

ఏంటి నీ అనుభవమంత వయసున్న నేను ఇలా ఏకవచనంతో పిలిచానని కోపంగా ఉందా. పర్లేదు. మరి ఉన్నఫళంగా చెప్పా పెట్టకుండా స్వర్గానికి వెళ్లిపోయిన నీ మీద నాకెంత రావాలి. అయినా అన్నయ్య, నాన్నలను కూడా నేను ఇలాగే పిలుస్తాను. నువ్వు వాళ్ళ కంటే తక్కువేమి కాదు. అందుకే ఇలా కానిచ్చేద్దాం. ఏంటిదంతా అనుకుంటున్నావా. మధ్యాన్నం నుంచి మనసంతా ఏదోలా ఉంది. ఈ నాలుగు ముక్కలు అప్పుడే చెప్పుకుందామనుకున్నా. బయటికి రాని కన్నీళ్లు గొంతులో నొప్పిగా మారి ఒకటే మెలిపెడుతుంటే ఏం చేయను. అందుకే మౌనంగా నా చుట్టూ ఉన్న వెలుగులోనే చీకటిని వెతుక్కుని మరీ చూస్తున్నా టీవీలో నీ చివరి చూపుని.

నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు ఒంటి మీద దుస్తులు ఆడుతున్నాయో లేదో తెలియని లేలేత పసివయసులో ఇంట్లో టీపాయ్ మీదున్న రేడియోలో నుంచి పాటలు వస్తున్నప్పుడు మనసులో ఏదో కనెక్ట్ అవుతున్న ఫీలింగ్. అది అన్వేషణో ప్రేమాభిషేకమో సర్దార్ పాపారాయుడో ఛాలెంజో గుర్తుపెట్టుకునేంత గొప్ప జ్ఞాపకశక్తి నాకు లేదు. కానీ అవి మళ్ళీ ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వింటానా అని నా వయసుతో పాటు సంగీతం పట్ల కుతూహలం పెరగడంలో నీ పాత్ర చిన్నదంటే అది పచ్చి అబద్దమే. స్కూల్ కు వెళ్లే దారిలో టీ కోట్ల దగ్గర కిలోమీటరు దాకా వినిపించే సౌండ్ తో బోటనీ పాఠముంది మేటనీ ఆటఉంది పాట కోసం అదేపనిగా ఓ పదడుగులు వెనక్కు వచ్చి మెల్లగా నడుచుకుంటూ మళ్ళీ నీ గొంతు వినేందుకు పడిన తాపత్రయం నా బిడ్డ పొందగలడా.

మా ఊరి మెహబూబియా థియేటర్లో జగదేకేవీరుడు అతిలోకసుందరి చూస్తున్నప్పుడు ప్రియతమా నను పలకరించు ప్రయాణమా అంటూ మైమరిచేలా నీ స్వరం వినిపిస్తుంటే అది నిజంగా చిరంజీవే పాడాడని ఫ్రెండ్స్ తో గొడవపడటం ఇప్పటికీ ఎంత బాగా అనిపిస్తుందో. నాన్న పదే పదే టేప్ రికార్డర్ లో శంకరాభరణం పాటలు వింటున్నప్పుడు ఆయన్ని తదేకంగా చూసేవాడిని. బొమ్మ కనిపించకుండా కేవలం గొంతు వినిపిస్తుంటే ఎందుకు ఆయన ఇంత తన్మయత్వంలో ఉన్నాడా అని. అది మామ మహదేవన్ తో కలిసి నువ్వు చేసిన మాయాజాలమని తర్వాత తెలుసుకుని ఆ అమృతాన్ని నేనెన్ని సార్లు తాగానో. స్వర్ణకమలం క్యాసెట్ అరిగిపోయినా, పక్కింట్లో అరువు తెచ్చుకున్న బొబ్బిలిరాజా క్యాసెట్ గూట్లో దాచి విరిగిపోయిందని వాళ్ళతో అబద్దం చెప్పినా దాన్ని పలికించిన అసలు నేరస్థులు ఇళయరాజా, నువ్వేగా.

నేను పుట్టాక ఊహతెలిసే వయసుకి ఘంటసాల ఎవరో నాకు తెలియదు. అందరికీ ఒకేలా పాడే ఆయన శైలీ నచ్చలేదు. అప్పటి నా అజ్ఞానానికి గాయకుడంటే ఒక్కడే ఎస్పి బాలసుబ్రమణ్యం. అంతే. ఇప్పటికీ నా అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదు. మధ్యలో ఎందరు హరిహరన్ లు, శంకర్ మహదేవన్ లు, ఉన్ని కృష్ణన్ లు, మనోలు వచ్చినా వాళ్లంతా నావరకు నీ నీడను మాత్రమే ముట్టుగోగలిగే ప్రతిభ ఉన్నవాళ్లు. నిన్ను తాకడం కలలో మాటే. అంతగా మా హృదయాల్లో పెనవేసుకున్నావు. వేటూరి రాసిన పదాల అల్లికైనా సిరివెన్నెల కూర్చిన మాటల గారడైనా అది నీ గొంతులో నుంచి వస్తేనే కదా దానికి అందం, మాకు ఆనందం. ఇళయరాజా అందించిన అమృతంలో నీ గొంతులోనుంచి జాలువారిన స్వరాల ముత్యాలు ఎప్పుడు విన్నా మదిలో కలిగే పులకరింతలు గురించి ఏమని చెప్పను. ఎంతని రాయను. నా వల్ల కాదు.

నువ్వు లేవని నువ్వే అన్నా నేను ఒప్పుకోను బాలు. అయినా ఎక్కడికి వెళ్ళావని ఈ రిప్పులు, శోకాలు. భౌతికంగా ఉండవు. విశ్రాంతి కోసం వెళ్తున్నావ్ అంతేగా. ఇక్కడే ఉంటే ఈ వయసులోనూ మా సినిమాలకు పాడమని, లైవ్ షోలు చేయమని వీళ్లంతా వెంటపడుతూనే ఉంటారు. అందుకే అక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండు. అదీ కష్టమేలే. రాక రాక వచ్చిన నిన్ను చూసి ఘంటసాల, కోదండపాణి, చక్రవర్తి, మహదేవన్, సత్యం, సాలూరి, మాస్టర్ వేణు,ఎంఎస్ విశ్వనాథన్ వీళ్లందరూ ఊరుకుంటారా. అయినా జాగ్రత్త బాలు. నా జీవితంలో లోటుగా ఏదైనా ఉందంటే అది నిన్ను ప్రత్యక్షంగా కలుసుకోలేపోవడమే. ఏ జన్మ పాపమో ఆ అదృష్టానికి నోచుకోలేకపోయాను. ఇలా చెప్పుకుంటూ పొతే పదే పదే నీ పాటలే గుర్తొచ్చి పెదవులు ఉప్పగా మారిపోయేలా ఉన్నాయి. ఇంత చెప్పిన నేను కన్నీళ్లు పెడితే బాగుండదు. ఎక్కడున్నా నువ్వు రాజావే. నీ తరంలో నేనున్నా అనే గర్వంతో తృప్తి పడుతూ ఇక్కడితో ముగిస్తాను.

ఉంటా మరి,

నా పిచ్చిగానీ నేనున్నా నువ్వే లేవని తెలిసే ఉంటా అని చెప్పా.

సరే ఇక సెలవు...

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp