తెరపై పొంగిన చల్లని గోదావరి - Nostalgia

By iDream Post Apr. 19, 2021, 08:30 pm IST
తెరపై పొంగిన చల్లని గోదావరి - Nostalgia

సున్నితమైన భావోద్వేగాలతో ప్రేమకథలను అన్ని వర్గాలను మెప్పించేలా తీయడం చాలా కష్టం. ఎందుకంటే వీటిలో కమర్షియల్ అంశాలకు చోటు ఉండదు. మాస్ కోరుకునే మసాలాలు ఉండవు. ఒక వర్గం ఆడియన్స్ ని మాత్రమే తీసినట్టుగా అనిపిస్తాయి. అలా కాకుండా జనరంజకంగా మెప్పించే ట్రీట్మెంట్ తో తనదైన శైలిని ఏర్పరుచుకున్న దర్శకుడు శేఖర్ కమ్ములది విలక్షణ శైలి. 2006 సంవత్సరం. అప్పటికి ఆయన తీసిన ఆనంద్ తాలూకు సక్సెస్ షాక్ గురించి ఇంకా ఇండస్ట్రీ మాట్లాడుకుంటూనే ఉంది. శంకర్ దాదా ఎంబిబిఎస్ మెగా పోటీని తట్టుకుని మరీ ఆ మూవీ వంద రోజులు ఆడటం ఎప్పటికీ మర్చిపోలేని ఓ గొప్ప జ్ఞాపకం.

శేఖర్ కమ్ముల డెబ్యూ మూవీ 'డాలర్ డ్రీమ్స్' అయినప్పటికీ సగటు ప్రేక్షకులకు తెలిసింది మాత్రం 'ఆనంద్'తోనే. మూడో సినిమా ఇంకా ఉన్నతంగా ఉండాలనే ఉద్దేశంతో కథల గురించి ఆలోచిస్తుండగా ఆయన అభిమాన దర్శకుడు బాపు గారు గుర్తొచ్చారు. 1973లో వచ్చిన ఏఎన్ఆర్ 'అందాల రాముడు' శేఖర్ కమ్ములకు ఇష్టమైన సినిమాల్లో ఒకటి. గోదావరి అలలపై ఓలలాడుతూ నేతి గారెలు తింటూ పానకం తాగినంత మధురంగా అనిపించే అలాంటి చిత్రం ఇప్పటి జెనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా తీయాలనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే గోదావరి. సుమంత్, కమలిని ముఖర్జీ జంటగా రూపొందిన ఈ సాఫ్ట్ లవ్ స్టోరీ ఎప్పటికీ ఒక క్లాసిక్.

2003లో 'సత్యం'తో సూపర్ హిట్ కొట్టాక సుమంత్ మార్కెట్ స్టాండర్డ్ అయ్యింది. 'గౌరీ' డబ్బులు తీసుకురాగా 'ధన 51' డిజాస్టర్ కొట్టి హెచ్చరికగా నిలిచింది. 'మహానంది' పర్వాలేదు అనిపించుకుంది. అప్పుడు ఒప్పుకున్నదే ఈ గోదావరి. అమెరికాలో సాఫ్ట్ వేర్ చేసినా ఇండియాలో రాజకీయాల్లోకి ప్రవేశించి జనాలకు మేలు చేయాలనుకునే ఓ యువకుడు, స్వంతకాళ్ళ మీద నిలబడి తనకంటూ వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకుని ముక్కుసూటిగా వెళ్లే ఓ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమను గోదావరిపై నడిచే లాంచీ మీదుగా శేఖర్ కమ్ముల నడిపిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. కెఎం రాధాకృష్ణన్ పాటలు సంగీత ప్రియులను మైమరపింపజేశాయి. 2006 మే 19 విశాల్ పందెం కోడితో పాటుగా విడుదలైన గోదావరి మంచి విజయం దక్కించుకుని ఫీల్ గుడ్ మూవీస్ లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp