చెప్పలేని ఉద్వేగం తెరపై నాన్న - Nostalgia

By iDream Post Jun. 20, 2021, 05:30 pm IST
చెప్పలేని ఉద్వేగం తెరపై నాన్న - Nostalgia

సినిమాల వరకు  అమ్మ గొప్పదనాన్ని చాటుతూ చాలా సినిమాలు వచ్చాయి కానీ నాన్న గురించి వచ్చినవి వాటితో పోలిస్తే తక్కువే అని చెప్పాలి. పిల్లల ఎదుగుదలలో ఇద్దరిదీ సమాన పాత్రే అయినప్పటికీ ఎమోషన్ పరంగా ఎక్కువగా వర్కౌట్ అయ్యేది తల్లినే కాబట్టి దర్శకులు అటువైపే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ తండ్రి కాన్సెప్ట్ మీద ఆణిముత్యాలు అని చెప్పుకోదగ్గ చిత్రాలు వచ్చాయి కానీ ఇప్పటి జెనరేషన్ కు పరిచయమున్న ప్రత్యేకించి ప్రస్తావించదగ్గ కొన్నింటి గురించి చూద్దాం

దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయనే టైటిల్ పాత్ర పోషించిన 'సూరిగాడు'లో బాగా చదివి కొడుకు ప్రయోజకుడు కావాలన్న తాపత్రయంతో తండ్రి ఎన్ని త్యాగాలు చేస్తాడో అద్భుతంగా చూపించిన తీరు ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ముఖ్యంగా దాసరి గారి నటన హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. తెలియక చేసిన తప్పు వల్ల బిడ్డ దూరమైతే ఓ వ్యక్తి పడే మానసిక క్షోభ సురేష్ కృష్ణ తీసిన 'డాడీ'లో చూడొచ్చు. కమర్షియల్ గా ఫెయిల్ అయినా ఇందులో హత్తుకునే భావోద్వేగాలు ఉంటాయి. పైకి 'బొమ్మరిల్లు' ప్రేమకథలా అనిపించినా సిద్దార్థ్ జెనీలియా ట్రాక్ ల కన్నా నాన్నగా నటించిన ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంది

త్రివిక్రమ్ దర్శకుడిగా మొదటి సినిమా 'నువ్వే నువ్వే'లో హీరొయిన్ శ్రేయ తండ్రిగా ప్రకాష్ రాజ్ పాత్రను తీర్చిదిద్దిన తీరు ఆడపిల్లను అపురూపంగా పెంచే నాన్న మనస్తత్వం ఎలా ఉంటుందో గొప్పగా చూపించారు. 'నువ్వు నాకు నచ్చావ్'లో కూడా తండ్రులుగా నటించిన ప్రకాష్ రాజ్, చంద్ర మోహన్ క్యారెక్టర్లు మర్చిపోలేని ఉదాహరణలుగా నిలుస్తాయి. 'సుస్వాగతం'లో దర్శకుడు భీమినేని శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ఫాదర్ గా చేసిన రఘువరన్ ని ప్రెజెంట్ చేసిన తీరు దానికిచ్చిన ముగింపు కాలేజీ కుర్రాళ్లను కూడా కన్నీళ్లు పెట్టించాయి. రీ క్లైమాక్స్ కు ముందు వచ్చే సన్నివేశాలు గుండెలు పిండేసేలా వెంటాడుతూనే ఉంటాయి.

తండ్రి తన పిల్లలను అమితంగా ప్రేమిస్తే ఆ బిడ్డలు ఆయన పోయాక ఆత్మశాంతి కోసం ఎలాంటి లక్ష్యాలు పెట్టుకుంటారనే పాయింట్ మీద సుకుమార్-జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'నాన్నకు ప్రేమతో' బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచిపోయింది. మానసిక పరిపక్వతకు దూరమైనా కన్నపేగు మమకారం తెలిసిన వాడిగా 'నాన్న'లో విక్రమ్ పెర్ఫార్మన్స్ ని మర్చిపోగలమా. ఇవి మాత్రమే కాదు తండ్రి పాత్ర ఔనత్యాన్ని గొప్పగా చాటే నాన్నగారు, బంగారు కుటుంబం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, పండంటి కాపురం లాంటి ఎన్నో గొప్ప చిత్రాలు ఉన్నాయి. అందుకే సినిమా నాన్న అంటే కేవలం పాత్ర కాదు మన జీవితాలతో ముడిపడిన ఒక ఎమోషన్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp