భయపెట్టి బెదరగొట్టిన 'దెయ్యం' - Nostalgia

By iDream Post Oct. 13, 2020, 09:11 pm IST
భయపెట్టి బెదరగొట్టిన 'దెయ్యం' - Nostalgia

ఇప్పుడంటే టాలీవుడ్ లో విరివిగా హారర్ సినిమాలు చూస్తున్నాం కానీ ఒకప్పుడు వీటిని కేవలం ఇంగ్లీష్ లోనే చూసేవాళ్ళు ప్రేక్షకులు. ఒకరిద్దరు కొన్ని ప్రయత్నాలు చేశారు కానీ అవేవి ఆశించినంత గొప్ప ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. భయం భయం, కాళరాత్రి, ఇంటి నెంబర్ 13 లాంటివి కొన్ని కమర్షియల్ గా సేఫ్ అనిపించుకున్నాయే తప్ప గుర్తుండిపోయేలా ప్రభావం చూపలేకపోయాయి. వర్మ ఈ విషయంలో కాస్త ఎక్కువ చొరవ తీసుకున్న దర్శకుడిగా చెప్పుకోవచ్చు. రేవతి లాంటి నోటెడ్ హీరోయిన్ తో రాత్రి అతనికి మంచి ప్రశంసలు తెచ్చి పెట్టింది. సీరియస్ హారర్ ని తెలుగులోకి తీసుకొచ్చిన ధైర్యానికి ప్రశంసలు కూడా దక్కాయి. అదే స్ఫూర్తితో 1996లో వర్మ చేసిన మరో ప్రయత్నం దెయ్యం. ఇందులో కూడా జయసుధ, జెడి చక్రవర్తి, మహేశ్వరి, జీవా లాంటి పేరున్న క్యాస్టింగ్ ని తీసుకోవడంతో మంచి హైప్ వచ్చింది.

హాలీవుడ్ కథల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ వర్మ తనదైన శైలిని దీన్ని రూపొందించారు. కథ కూడా ఆసక్తికరంగా మలుచుకున్నారు. సింధు(జయసుధ), మురళి(అజిన్ కె డియో )లు ఊరి బయట దట్టమైన అడవి లాంటి ప్రాంతంలో శ్మశానానికి దగ్గరగా ఓ ఖరీదైన ఇంటిని కొంటారు. వీళ్ళతో పాటు మూడేళ్ళ బాబు చిన్నూ, సింధు చెల్లెలు మహీ(మహేశ్వరి)కూడా ఉంటారు. రోజులు గడిచే కొద్దీ అందులో ఉన్న దెయ్యాలు ఒక్కొకటిగా బయటికి వస్తాయి. ముందు చిన్నూ బలవుతాడు. ఆ తర్వాత సింధు, మురళి కూడా దెయ్యాలుగా మారి అక్కడే తిష్ట వేస్తాడు. ఇదో దెయ్యాల కొంపని లవర్ నర్సింగ్(జెడి చక్రవర్తి)ఎంత చెప్పినా మహీ వినిపించుకోదు. ఆఖరికి నిజం తెలుసుకుని అక్కడి నుంచి ఇద్దరూ పారిపోయి నర్సింగ్ ఇంటికి వచ్చే లోపు అక్కడ స్మశానంలోని దెయ్యాలన్నీ తిష్టవేసుకుని ఉంటాయి. అన్నీ కలిసి ఆ జంటను చుట్టుముడతాయి. అక్కడితో కథ ముగుస్తుంది.

అప్పుడే వచ్చిన డాల్బీ సౌండ్ టెక్నాలజీ సహాయంతో సంగీత దర్శకుడు విశ్వనాథ సత్యనారాయణ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే విపరీతంగా భయపెట్టేశారు. ఆయనకు మణిశర్మ అసిస్టెంట్ గా చేయగా హరీష్ జైరాజ్ కీ బోర్డు ప్లేయర్ గా ఉన్నారు. ఉన్న నాలుగు పాటలు కూడా థీమ్ కు తగ్గట్టు కంపోజ్ చేశారు. జయసుధ కెరీర్ లో మొదటిసారి దెయ్యంగా నటించడం విశేషం. మంచి సౌండ్ సిస్టం ఉన్న థియేటర్లో దెయ్యం చూసి నిజంగానే జనం జడుసుకున్నారు. కాకపోతే ఇలాంటి జానర్ మన పబ్లిక్ కి పెద్దగా అలవాటు లేకపోవడంతో కమర్షియల్ గా యావరేజ్ గా నిలిచిపోయింది. భూత్ కన్నా ముందు వర్మ చేసిన బెస్ట్ వర్క్స్ లో దెయ్యం ఒకటి. నవల రచయిత కొమ్మనపల్లి గణపతిరావు సంభాషణలు అందించడం విశేషం. రెండున్నర గంటల నిడివికి అలవాటు పడిన ప్రేక్షకులకు దెయ్యం కేవలం 90 నిమిషాల్లో పూర్తి కావడం కొత్తగా అనిపించింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp