మహాభారత స్ఫూర్తితో రజినీకాంత్ సినిమా - Nostalgia

By iDream Post Apr. 18, 2021, 08:30 pm IST
మహాభారత స్ఫూర్తితో రజినీకాంత్ సినిమా - Nostalgia
సరిగా ఆలోచించి వెతకాలే కానీ మన పురాణాలు, ఇతిహాసాల నుంచి బోలెడు అద్భుతమైన కథలు రాసుకోవచ్చు. దానికో గొప్ప ఉదాహరణ మహాభారతం. ఈ గాథలో లేని ఎమోషన్లు, యుద్ధాలు, ప్రేమలు, సెంటిమెంట్లు లేవంటే అతిశయోక్తి కాదు. అందుకే మణిరత్నం పలుమార్లు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మాస్టర్ పీస్ అనిపించుకున్న సినిమాలు తీశారు. అందులో అగ్రపీఠం అందుకోదగిన అర్హత ఉన్నది దళపతి. 1990 సంవత్సరం. మణిరత్నం మాములు ఫామ్ లో లేరు. మౌనరాగం, నాయకుడు, ఘర్షణ, గీతాంజలి, అంజలి ఒకదాన్ని మించి మరొకటి ప్రశంసలు వసూళ్లు దక్కించుకున్నాయి. రచన చేసిన క్షత్రియుడు కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.

జివి ఫిలింస్ అధినేత వెంకటేశ్వరన్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ మంచి స్నేహితుడు. ఇతను మణిరత్నం సోదరుడు. ఈ కాంబోలో ఒక సినిమా రావాలని గట్టిగా కోరుకున్నారు. రజిని స్టార్ డంని దృష్టిలో ఉంచుకుని మణిరత్నం బ్రాండ్ టేకింగ్ తో ఎప్పటికీ నిలిచిపోయే సెల్యులాయిడ్ వండర్ ని ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పుడు మణిరత్నం చెప్పిన స్టోరీనే దళపతి. తల్లి ఉండీ అనాథగా పెరిగిన కర్ణుడి లాంటి యువకుడు పెద్దయ్యాక దుర్యోధనుడుతో స్నేహం చేసి నేరప్రపంచంలో అడుగు పెట్టడమనే పాయింట్ ని తీసుకుని దాని చుట్టూ యాక్షన్, సెంటిమెంట్, కమర్షియల్, లవ్ ఇలా అన్ని అంశాలు సమకూర్చుకున్నారు. మమ్ముట్టి క్యారెక్టర్ కు దుర్యోధనుడిని స్ఫూర్తిగా తీసుకున్నప్పటికీ హీరో ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా మంచి లక్షణాలు ఆపాదించారు.

రజిని తమ్ముడి పాత్రకోసం లియో కాఫీ యాడ్ లో నటించిన అరవింద స్వామిని తీసుకున్నారు మణి. చాలా కీలకమైన తల్లి రోల్ కోసం శ్రీవిద్యను ఎంచుకున్నారు. ఈవిడ రజని కంటే కేవలం మూడేళ్ల చిన్నవయసు కావడం గమనార్హం. శోభన ఒక హీరోయిన్ గా మరో డీ గ్లామర్ రోల్ కోసం భానుప్రియ ఫిక్స్ అయ్యింది. ఇళయరాజా దీనికి అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. చిలకమ్మా చిటికేయంగా పాట బిబిసి వరల్డ్ టాప్ టెన్ పాపులర్ సాంగ్స్ లో నాలుగో స్థానం దక్కించుకుంది. అప్పట్లో ఆడియో హక్కులు లహరి సంస్థ 72 లక్షలకు కొనుగోలు చేయడం రికార్డు. తమిళ వెర్షన్ 1991 నవంబర్ 5న రిలీజ్ కాగా తెలుగు డబ్బింగ్ అదే నెల 21న విడుదలయ్యింది. రెండు చోట్లా బ్లాక్ బస్టర్ ఫలితాన్ని అందుకుంది. మణిరత్నం-ఇళయరాజా కాంబోలో వచ్చిన చివరి సినిమా దళపతి
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp