మెగాస్టార్ మొదటి సినిమా - Nostalgia

By iDream Post Aug. 04, 2020, 07:37 pm IST
మెగాస్టార్ మొదటి సినిమా - Nostalgia

అదేంటి చిరంజీవి మొదటిసినిమా ప్రాణం ఖరీదు అయితే ఇక్కడ వేరే పోస్టర్ ఉందేంటి అనుకోకండి. ఇక్కడో పాయింట్ ఉంది. ఇప్పుడు మనకు మెగాస్టార్ గా చిరు సుపరిచితుడే కానీ 1988 దాకా ఆయన్ను సుప్రీమ్ హీరో, డైనమిక్ హీరో, డాషింగ్ హీరో అంటూ రకరకాల ట్యాగులు వాడేవాళ్ళు. ఇలా కాదని ఒకటే ఉండి అది కూడా చరిత్ర చిరస్థాయిగా గుర్తుపెట్టుకోవాలని నిర్మాత కేఎస్ రామారావు గారు తన మరణమృదంగం సినిమా నుంచి మెగాస్టార్ అనే బిరుదుని ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాంతోనే చిరు సార్థకనామధేయులుగా కొనసాగుతున్నారు. అయితే ఇదేదో సింపుల్ గా జరిగిన తతంగం కాదు.

ఓ సభలో దీన్ని సీనియర్ నటులు కం విలన్ రావు గోపాల్ రావు గారు గ్రాండ్ గా ప్రకటించారు. ఈ మెగాస్టార్ అనే పదం కోసం కేఎస్ రామారావు చాలా రీసెర్చ్ చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఫైనల్ చేశారు. అయితే విచిత్రంగా ఈ బిరుదును ప్రపంచానికి పరిచయం చేసి రావుగోపాలరావు గారు ఈ ఒక్క సినిమాలోనే కనిపించరు . ఆ టైంలో దాదాపు అన్ని చిరు మూవీస్ లో ఉన్న ఆయన ఇందులో మాత్రం లేకపోవడం వింతే. అదే బ్యానర్ లో రూపొందిన ఛాలెంజ్, రాక్షసుడు, అభిలాషలో కీలక పాత్రలు చేసినప్పటికీ ఏవో కారణాల వల్ల ఇందులో మాత్రం లేరు. ఇక మరణమృదంగం విషయానికి వస్తే ఇది సుప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఇదే టైటిల్ తో రాసిన నవల ఆధారంగా రూపొందింది. అప్పటిదాకా దేనికీ పెట్టనంత భారీ ఖర్చుతో రామారావు దీన్ని రూపొందించారు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం, ఇళయరాజా సంగీతం, లోక్ సింగ్ ఛాయాగ్రహణం దీనికి దన్నుగా నిలిచాయి.

కాల్ షీట్స్ క్లాష్ అయిన కారణంగా ఓసారి డైరెక్టర్ అందుబాటులో లేకపోతే ఇంట్రోలో వచ్చే ఫైట్ ని చిరునే తీశారు. నాగబాబుకి ఇది అప్పటికి రెండో సినిమా. వినయ విదేయ రామ విలన్ వివేక్ ఒబెరాయ్ తండ్రి సురేష్ ఒబెరాయ్ ఇందులో ప్రతినాయక పాత్ర పోషించారు. రాధ సుహాసిని హీరొయిన్లుగా నటించారు. భారీ అంచనాల ఆగస్ట్ 4న విడుదలైన మరణ మృదంగం ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేక యావరేజ్ హిట్ గా మిగిలిపోయింది. అయితే కరిగిపోయాను కర్పూరవీణలా, సరిగమపదనిస పాటలు చాలా ప్రజాదరణ పొందాయి. యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మరణ మృదంగంతోనే చిరు మెగాస్టార్ అయ్యారు కాబట్టి దీన్ని అలా మొదటి సినిమాగా పేర్కొనడం జరిగింది. విడుదలై 32 ఏళ్ళు అవుతున్నా మెగాస్టార్ గా ఇప్పటికీ సింహాసనాన్ని అధీష్టించిన చిరంజీవికి అందుకే ఇది స్పెషల్ మూవీగా నిలిచిపోయింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp