'మేజర్ చంద్రకాంత్'గా చిరంజీవి - Nostalgia

By iDream Post Sep. 26, 2020, 09:21 pm IST
'మేజర్ చంద్రకాంత్'గా చిరంజీవి - Nostalgia

అదేంటి మేజర్ చంద్రకాంత్ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి సినిమా కదా మరి చిరంజీవికి పెట్టడం ఏంటి అనుకుంటున్నారా. అటెన్షన్ కోసం ఇలా హెడ్డింగ్ పెట్టలేదు. ఇది నిజమే. డీటెయిల్స్ లోకి వెళ్ళాక మీకే అర్థమవుతుంది. మెగాస్టార్ అతిథి పాత్రల్లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అడపాదడపా అయిదారు నిముషాలు కనిపించేవి చెప్పుకోదగ్గగా సంఖ్యలోనే చేశారు కానీ అరగంటకు పైగా నడిచే ఎపిసోడ్ మాత్రం ఒకేఒక్క చిత్రంలో జరిగింది. అదే సిపాయి. 1996లో శాండల్ వుడ్ స్టార్ హీరో రవిచంద్రన్ కన్నడలో ఓ భారీ బడ్జెట్ మూవీ తీశారు. సౌందర్య హీరోయిన్. ముత్యమంత ముద్దు, శాంతి క్రాంతి లాంటి సినిమాలతో మనకూ పరిచయమున్న హంసలేఖ సంగీతం అందించారు. 

ఇందులో సెకండ్ హాఫ్ సగమయ్యాక వచ్చే కీలక పాత్ర ఒకటుంది. అదే మేజర్ చంద్రకాంత్ రోల్. సౌందర్యకు బలవంతంగా వేరే వాడితో పెళ్లి జరిపిస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి రవిచంద్రన్ గుడికి వెళ్తాడు. రౌడీలను ఎదురుకుంటున్న క్రమంలో మిలిటరీ నుంచి వచ్చిన స్నేహితుడు మేజర్ చంద్రకాంత్ వచ్చి స్నేహితుడికి అండగా నిలిచి విలన్ల తుప్పు రేగొట్టి వేడుకను ఆపేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ ఈ ఇద్దరూ ఆర్మీలో స్నేహితులన్న విషయం అప్పుడు బయట పడుతుంది.అప్పటికే ఎడమొహం పెడమొహంగా ఉన్న రవిచంద్రన్, సౌందర్యలను కలిపే బాధ్యత తీసుకుంటాడు చిరు. ఈలోగా ఒక పై నుంచి ఎమర్జెన్సీ పిలుపు వస్తుంది. దీంతో సిపాయి కూడా మేజర్ చంద్రకాంత్ తో బయలుదేరతాడు. కానీ అక్కడ శత్రువులతో జరిగిన పోరాటంలో చిరంజీవి పాత్ర వీరోచితంగా ప్రాణ త్యాగం చేస్తుంది. తర్వాత సిపాయి, సౌందర్య ఇద్దరూ ఒక్కటవుతారు.

ఇది కన్నడలో సూపర్ హిట్ మూవీ. ముఖ్యంగా 11 పాటలు ఆడియో పరంగా సంచలనం సృష్టించాయి. దీన్నే తెలుగులో మేజర్ పేరుతో డబ్బింగ్ చేశారు కానీ ఇక్కడ ఆశించిన స్పందన దక్కించుకోలేదు.చిరు ఆఖర్లో చనిపోవడం, ముప్పాతిక సినిమా రవిచంద్రన్, సౌందర్యల లవ్ ట్రాక్ మీద నడవటం మనవాళ్లకు కనెక్ట్ కాలేదు. దీంతో మేజర్ ఫలితం అంతంతమాత్రంగానే మిగిలింది. రవిచంద్రన్ తో తనకున్న స్నేహం వల్ల హిట్లర్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ చిరంజీవి ఈ సినిమా ఒప్పుకున్నారు. నిడివి తక్కువగానే ఉన్నా చిరుకి రెండు ఫైట్లు, రెండు పాటలు పెట్టడం విశేషం. ఆడియో క్యాసెట్ ఫస్ట్ బంచ్ లో రేపర్ మీద చిరు ఫోటో లేకపోతే అక్కడి ఫ్యాన్స్ గొడవ చేశారు. దీంతో సెకండ్ బంచ్లో ఆ పొరపాటు సరిద్దిదుకుంది కంపెనీ. మేజర్ చంద్రకాంత్ పాత్ర లేకపోతే సిపాయి యావరేజ్ గా మిగిలిపోయేదని రవిచంద్రన్ పలు సందర్భాల్లో చెప్పడం గమనార్హం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp