తారలంతా ఒకే చోట ఒకే పాట - Nostalgia

By iDream Post Aug. 07, 2020, 09:37 pm IST
తారలంతా ఒకే చోట ఒకే పాట - Nostalgia

సాధారణంగా మనకు ఇష్టమైన స్టార్లందరినీ ఒకే చోట చూడాలంటే వాళ్ళలో ఎవరింట్లో అయినా పెద్ద వేడుక జరగాలి లేదా ఏదైనా ఆడియో రిలీజ్ లాంటి ఫంక్షన్ లో కలుసుకోవాలి. అంతే. కానీ అదే తెరమీద చూడగలిగితే. ఊహకే అందదు కదూ. కాని 1987లో నిర్మాత టి సుబ్బరామిరెడ్డి దాన్ని ఓ పాట రూపంలో నిజం చేసి చూపించారు. వివరాల్లోకి వెళ్తే విక్టరీ వెంకటేష్, యాక్షన్ కింగ్ అర్జున్, నటకిరీటీ రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో ఆయన 'త్రిమూర్తులు' సినిమా తీశారు. కె మురళీమోహన్ రావు దర్శకులు. ఇది హిందీ బ్లాక్ బస్టర్ మూవీ 'నసీబ్'కి రీమేక్. కొంత ఆలస్యంగానే అయినా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో భారీ బడ్జెట్ తో విదేశాలలో కూడా షూటింగ్ జరిపి మరీ పూర్తి చేశారు. అందులో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది.

ఓ ప్రముఖ పత్రికకు సంబంధించిన ఈవెంట్ ఒకటి వెంకటేష్ పనిచేసే హోటల్ లోనే జరుగుతుంది. దానికి అప్పటి టాలీవుడ్ తారలందరూ కదిలి వస్తారు. ఒకరు మిస్ అయ్యారు అనే మాటరాకుండా సుబ్బరామిరెడ్డి అందరిని ఒకచోటకు చేర్చడంలో సఫలమయ్యారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్, మురళీమోహన్, గొల్లపూడి, పద్మనాభంతో పాటు ఎందరో ప్రముఖ దర్శకులు ప్రొడ్యూసర్లు పాల్గొన్నారు. హీరొయిన్ల విషయానికి వస్తే విజయశాంతి, రాధా, భానుప్రియ, విజయనిర్మల, రాధిక, శారద, జయమాలిని, అనురాధ, వై విజయ ఇలా సీనియర్ జూనియర్లు అందరూ కలిసి వచ్చారు. సంగీత దర్శకులు బప్పిలహరి కంపోజ్ చేసిన ఒకే మాట ఒకే బాట సాంగ్ కు వేటూరి సాహిత్యం సమకూర్చగా ఎస్పి బాలు స్వరం అందించారు.

ఇండస్ట్రీ తమ మధ్య ఎంత స్నేహం ఉందో చాటి చెప్పేలా అందులో అర్థాన్ని రాయించడం విశేషం. ఈ పాట కోసమే ప్రత్యేకంగా సినిమాకు వెళ్ళిన ప్రేక్షకులు ఉన్నారు. సినిమాలో మెయిన్ హీరొయిన్లుగా శోభన, ఖుష్బూ, అశ్విని నటించారు. మిగిలిన తారాగణం కూడా పెద్దగా సెట్ చేసుకున్నారు. అయితే త్రిమూర్తులు సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ముగ్గురు హీరోలు, ఆల్రెడీ ప్రూవ్ అయిన కథ ఉన్నప్పటికీ ఎందుకో ఆడియన్స్ కు నచ్చలేదు. అయినప్పటికీ ఈ పాట మాత్రం మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. మళ్ళీ ఇదే తరహా సాంగ్ చాలా ఏళ్ళ తర్వాత నాగార్జున కింగ్ లో ట్రై చేశారు కానీ అందులో పరిశ్రమలో ఉన్న స్టార్స్ అందరూ కనిపించరు. కేవలం హీరొయిన్స్ మాత్రమే హై లైట్ అయ్యారు. త్రిమూర్తులులో జరిగిన ప్రయోగం మాత్రం అంతకు ముందు ఆ తర్వాత ఎవరూ ఆ స్థాయిలో ట్రై చేయలేదన్నది వాస్తవం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp