బాక్సాఫీసును దోచుకున్న 'వేటగాడు' - Nostalgia

By iDream Post Aug. 08, 2020, 04:29 pm IST
బాక్సాఫీసును దోచుకున్న 'వేటగాడు' -  Nostalgia

భారీ వసూళ్ళకు, థియేటర్ల పోషణకు కమర్షియల్ సినిమాలను మించినవి లేవు. ఇది చరిత్ర గత కొన్ని దశాబ్దాలుగా రుజువు చేస్తున్న సత్యం. వైవిధ్యతకు పీటలు వేస్తూ ఇప్పటి దర్శకులు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా మాస్ వర్గాన్ని ఆకర్షించి కాసులు రాబట్టాలంటే ఫార్ములా మార్గం తప్పదు. దీనికి ఆద్యం పోసిన వాళ్ళలో ప్రముఖంగా దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గురించి చెప్పుకోవచ్చు. స్వర్గీయ ఎన్టీఆర్ ఇమేజ్ ని కొత్త మలుపు తిప్పిన అడవిరాముడుతో ఆయన చేసిన మాయాజాలం ఇప్పటికీ ఒక గ్రామర్ పుస్తకంగా భావించాలి. ఒక పాట కోసమే ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ హాలుకు వచ్చేలా చేయడం కూడా ఈయనకే చెల్లింది.

వీరి కాంబినేషన్ లో ఆ తర్వాత సింహబలుడు, కేడి నెంబర్ వన్, డ్రైవర్ రాముడు వచ్చాయి. మూడోది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాలుగోది వేటగాడు. నిర్మాత అర్జునరాజుకు ఎన్టీఆర్ తో ఇది మొదటి సినిమా. ఇది చేయాలనుకున్న టైంకి హీరో డేట్స్ లేవు. దాంతో అప్పటికే కాల్ షీట్స్ బుక్ చేసుకున్న తోట సుబ్బారావు దగ్గర అడిగి మరీ కొనుక్కున్నారు అర్జునరాజు. హీరోతో పాటు ఓ పులి నగరానికి వస్తే ఏమవుతుండానే చిన్న ఆలోచనను జంధ్యాల గారికి చెప్పి భాగవతంలోని శమంతకమణి ఎపిసోడ్ తో లింక్ చేయించి అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేయించారు దర్శకేంద్రులు. శ్రీదేవిని హీరొయిన్ గా తీసుకున్నప్పుడు అందరూ షాక్. బడిపంతులులో ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించిన శ్రీదేవి దీనికి సూట్ కాదేమో అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.

ఇది తప్పని ఋజువు చేయడానికే రాఘవేంద్రరావు ముందు ఆకు చాటు పిందే తడిసే పాట షూట్ చేసి అందరికీ చూపించారు. ఎవరికీ నోట మాట రాలేదు. అంత ఫెంటాస్టిక్ గా వచ్చింది. జ్వరం ఉన్నా వర్షంలో తడుస్తూ అతిలోకసుందరి వేసిన స్టెప్పులకు యూనిట్ లో అందరూ క్లాప్స్ కొట్టారు. కేవలం 32 రోజుల్లో 33 లక్షల బడ్జెట్ తో చెన్నై, ఊటి లొకేషన్స్ లో షూటింగ్ పూర్తి చేశారు. కాంబినేషన్ క్రేజ్ వల్ల భారీ బిజినెస్ జరిగింది. 1979 జూలై 5 న విడుదల చేశారు. యాభై రోజులు దాటడం ఆలస్యం కోటి రూపాయలు వసూలు కావడం చూసి ట్రేడ్ మతులు పోయాయి. పాటలకు యువత వెర్రెక్కిపోయారు. కథాబలం కుటుంబాలను బారులు తీరేలా చేసింది. ఫలితంగా మరో ఇండస్ట్రీ హిట్టు దక్కించుకున్నారు ఎన్టీఆర్-రాఘవేంద్రరావు. చక్రవర్తి సంగీతం మరోసారి చిందులు తొక్కింది. రావుగోపాల్ రావు వెరైటీ విలనిజం కొత్తగా పండింది. అడవిరాముడుకి భిన్నంగా వేటగాడు సినిమా స్కోప్ లో కాకుండా 35 ఎంఎంలో తీసినప్పటికీ జనం బ్రహ్మరధం పట్టారు. అలా కమర్షియల్ గ్రంధంలో వేటగాడు ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp