స్కూలు ఎగ్గొట్టి వెండి గ్లాసు అమ్మేసి - Nostalgia

By iDream Post Aug. 03, 2020, 06:58 pm IST
స్కూలు ఎగ్గొట్టి వెండి గ్లాసు అమ్మేసి - Nostalgia

పరిశ్రమలో ఇప్పుడిప్పుడే గీతరచనలో ఓనమాలు దిద్దుకుంటున్న వర్ధమాన రచయితలతో మొదలుపెట్టి ఉద్దండపండితుల దాకా మనసు కవి ఆచార్య ఆత్రేయ అంటే తెలియని వారు ఉండరు. తన కలంతోనే కాదు బుద్ధిబలంతోనూ అవతలి వారిని చమత్కారంతో గిలిగింతలు పెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఆత్రేయ గారి గురించి ఇప్పటి తరంలో తెలిసిన వాళ్ళు తక్కువే. అందుకే ఈ ముచ్చట. ఆత్రేయ గారి జన్మస్థలం సూళ్ళూరుపేటకు దగ్గరలో మంగళంపాడు గ్రామం. 1921 మే 21న పుట్టారు. వారి కుటుంబం సనాతనమైనది, ఆస్తిపాస్తులు ఉన్నదీనూ. పెద్దవాళ్ళ మాటలు పెద్దగా లెక్క చేయని తత్వం చిన్నప్పుడే ఉండేది. ఆ క్రమంలోనే చదువు కన్నా ఎక్కువగా నాటకాల మీద దృష్టి మళ్ళింది.

గ్రామంలో ఉంటె బాగుపడడని భావించిన తల్లిదండ్రులు ఆత్రేయను చిత్తూరు కాన్వెంట్ స్కూల్లో చేర్పించారు. అదేదో సామెత చెప్పినట్టు పట్నం చేరగానే కొత్తగా సిగరెట్లు తాగడం, పాఠశాలకు డుమ్మా కొట్టడం లాంటివి అలవాటయ్యాయి. అయితే నాటకాలు, వక్తృత్వ పోటీలు లాంటి వాటిలో ఫస్ట్ వచ్చేవాళ్ళు. ఓ ఫ్రెండ్ ఇచ్చిన స్ఫూర్తితో కవిత్వం, ఇంటర్ కాలేజీలో వెంకోబరావు అనే లెక్చరర్ ప్రోత్సాహం వెరసి ఆత్రేయలోని రైటర్ బయటికి వచ్చేసి చదువుకు గుడ్ బై చెబుతున్నట్టు అమ్మానాన్నకు కబురు పెట్టేశారు. ఓసారి చెప్పాపెట్టకుండా వెండి గ్లాసు అమ్మేసి రాజన్ అనే ఫ్రెండ్ సహాయంతో లారీ ఎక్కి మదరాసు వెళ్లిపోయారు.

చాలా కష్టాలు పడ్డారు. తెనాలిరామకృష్ణలో ఇష్టం లేకపోయినా జూనియర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఓసారి వీధి దీపం కింద కూర్చుకుని గౌతమ బుద్ధ అనే నాటకం రాస్తే దానికి 50 రూపాయలు వచ్చాయి. అప్పుడాయనకి అదే పెద్ద మొత్తం. ఇది నెల్లూరులో ప్రదర్శిస్తున్న టైంలో రమణారెడ్డితో పరిచయం ఏర్పడింది. రెండో నాటకం నిజమెవరికి ఎరుక. ఓసారి మదరాసులో నాటక పోటీలు జరుగుతుండగా ఆత్రేయ రాసిన శాంతి బాగా పొద్దుపోయాక ప్రదర్శించారు. అందరూ వెళ్ళిపోయి ఉన్న నలుగురు బాగుందని మెచ్చుకున్నారు. కానీ నిరాశ చెందిన మనసు కవి కొంత కాలం బ్రేక్ తీసుకున్నారు. ఆంధ్ర నాటక పరిషత్ వాళ్ళు పెట్టిన పోటీలో ఆత్రేయ రాసిన ఎదురీత నాటకం అవార్డు తెచ్చుకుని కొత్త ఉత్సాహం ఇచ్చింది. ఆ తర్వాత కొందరు మిత్రులు సినిమా తీస్తూ ఈయన్నే రచయితగా పెట్టుకున్నారు.

టైటిల్ సంసారం. మాటలు పాటలు రాశారు. కానీ అది సెట్ కు వెళ్ళలేదు. స్క్రిప్ట్ కార్యరూపం దాల్చలేదు. వేరొకరు అదే పేరుతో తీశారు. ఎల్వి ప్రసాద్ దగ్గర అసిస్టెంట్ గా కొంత కాలం చేశాక దీక్ష చిత్రంలో గీతరచయితగా మారారు. ఆ తర్వాత మనోహరతో హిట్టు కొట్టాక వరసగా అవకాశాలు రావడం మొదలయ్యింది. అర్ధరాత్రి 2 తర్వాత మేల్కొని రాయడం ఆత్రేయగారికున్న ఓ వింత అలవాటు. రాసి ప్రేక్షకులను రాయకుండా నిర్మాతలను ఏడిపిస్తారని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. మూగ మనసులు లాంటి సినిమాల్లో ఆత్రేయ పాటలు పండిత పామరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొత్త జనరేషన్ లో కూడా ప్రేమ, అభినందన సినిమాలకు అజరామరమైన సాహిత్యాన్ని చిరకాలం నిలిచే స్థాయిలో ఇచ్చారు. మనమధ్య ఆత్రేయ భౌతికంగా లేకపోయినా పాటల రూపంలో ఈ భూమి ఉన్నన్నాళ్ళు మన మధ్యే తిరుగుతూనే ఉంటారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp