ఖాకీ చొక్కాకు గౌరవం తెచ్చిన అంకుశం - Nostalgia

By iDream Post Sep. 28, 2021, 08:30 pm IST
ఖాకీ చొక్కాకు గౌరవం తెచ్చిన అంకుశం - Nostalgia

నిజ జీవితంలో మనం పోలీస్ స్టేషన్ వెళ్లేందుకు భయపడతాం. అక్కడ పాతుకుపోయిన జవాబుదారీతనం లేని వ్యవస్థ వల్లో లేక ఖాకీ డ్రెస్సు మీద ఉండాల్సిన గౌరవడం తగ్గడం వల్లో కారణం ఏదైతేనేం మొత్తానికి ఒకరకమైన భావన ఎందరిలోనో ఉంది. ఇప్పుడు పర్వాలేదు కానీ ఒకప్పుడు ఇది మరీ తీవ్రంగా ఉండేది. దాన్ని తగ్గించే దిశగా ప్రయత్నించిన దర్శకులు వచ్చిన సినిమాలు లేకపోలేదు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అంకుశం. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా రాజశేఖర్ కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తీసుకొచ్చిన బ్లాక్ బస్టర్ గా ఇప్పటికీ దీన్ని విపరీతంగా ఇష్టపడే అభిమానులు లక్షల్లో ఉన్నారు. మూడు దశాబ్దాలు దాటినా ఆ ముద్ర అలా పడిపోయింది.

1989కు ముందు రాజశేఖర్ దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్ లో సూపర్ హిట్స్ వచ్చాయి. ఆహుతి, తలంబ్రాలు, స్టేషన్ మాస్టర్ కమర్షియల్ గా మంచి సక్సెస్ దక్కించుకున్నవి. మొదటి రెండింట్లో నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ రాజశేఖర్ కు చాలా పేరు వచ్చింది. వాటిని నిర్మించిన ఎంఎస్ రెడ్డి మళ్ళీ ఈ కాంబినేషన్ కి శ్రీకారం చుట్టి అంకుశంని ప్రారంభించారు. అప్పటిదాకా ఒకరమైన మూస ఫార్ములాలో చూపించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలకు భిన్నంగా సీరియస్ గా ఆవేదనతో ఆవేశంతో రగిలిపోయే ఒక అనాధగా తీర్చిదిద్దారు. ఈ పాయింటే సామాన్య మాస్ కు హీరోను విపరీతంగా దగ్గర చేసింది. ముఖ్యమంత్రి క్యారెక్టర్ ని ఎంఎస్ రెడ్డి స్వయంగా పోషించారు

విలనంటే రావుగోపాల్ రావు లాంటి ఒకరిద్దరు ఆప్షన్లు తప్ప ఇంకెవరు లేని టైంలో సహజత్వం కోసం రామిరెడ్డిని తీసుకోవాలన్న కోడిరామకృష్ణ ఆలోచన అద్భుతంగా పండింది. 1989 జూలై 13న విడుదలైన అంకుశం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ జీవిత, క్లైమాక్స్ లో హీరో రాజశేఖర్ చనిపోవడం ప్రేక్షకులను కదిలించింది. థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. రిలీజ్ కు ముందు మ్యూజిక్ డైరెక్టర్ సత్యం చనిపోవడంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ శ్యామ్ తో చేయించారు. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇప్పటికీ మర్చిపోలేని మెలోడీ. సినిమాకు మూడు నంది అవార్డులు వచ్చాయి. దీన్నే హిందీలో చిరంజీవి హీరోగా అల్లు అరవింద్ రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రీమేక్ చేస్తే అక్కడా హిట్టు కొట్టింది. కన్నడలో రవిచంద్రన్ చేశారు

Also Read : శేఖర్ కమ్ముల గీసిన కాలేజీ పెయింటింగ్ - Nostalgia

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp