గురి తప్పిన అభిమన్యుడు - Nostalgia

By iDream Post Aug. 06, 2020, 09:12 pm IST
గురి తప్పిన అభిమన్యుడు -  Nostalgia

అది 1989 సంవత్సరం. సుప్రసిద్ధ నిర్మాత, దర్శకులు విబి రాజేంద్ర ప్రసాద్ తన వారసుడు జగపతిబాబుని హీరోగా లాంచ్ చేశారు. మొదటి సినిమా సింహస్వప్నంలో డ్యూయల్ రోల్ వేయించినా లాభం లేకపోయింది. బొమ్మ డిజాస్టర్ అయ్యింది. సేఫ్ గేమ్ కోసం హిందీ రీమేక్ ని ఎంచుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. ఆ తర్వాత బయటి నిర్మాతకు జగపతిబాబు మరో రీమేక్ చేశారు. అదే 'అడవిలో అభిమన్యుడు'. మలయాళంలో మోహన్ లాల్, సురేష్ గోపి కీలక పాత్రల్లో 'దౌత్యం' వచ్చింది. అనిల్ దర్శకుడు. అది ఎంత పెద్ద హిట్టంటే డైరెక్టర్ కు అదే ఇంటి పేరుగా మారిపోయింది. ఇంకేముంది ఇక్కడా ఆడుతుందనే నమ్మకంతో హక్కులు కొనేసి ఎం వెంకటరత్నం నిర్మించారు.

ఒరిజినల్ వెర్షన్ తో మెప్పించిన అనిల్ నే ఇక్కడా తీసుకున్నారు. వినోద్ కుమార్ మరో హీరోగా ఫిక్స్ అయ్యాడు. కీలకమైన మిలిటరీ డాక్యుమెంట్స్ తో సురేష్(వినోద్ కుమార్)అడవిలో తప్పిపోతాడు. అతన్ని వెతికి తీసుకొచ్చే బాద్యతను ఎవరూ తీసుకోకపోవడంతో సమర్ధుడైన అభిమన్యు(జగపతిబాబు)ని వన్ మ్యాన్ కమాండో ఆపరేషన్ గా పంపిస్తారు. అప్పటికే ఆ ఇద్దరికీ శత్రుత్వం ఉంటుంది. అభిమన్యు ప్రేమించిన అమ్మాయి(ఐశ్వర్య)ను సురేష్ చేసుకుని ఉంటాడు. ఇదేమీ మనసులో పెట్టుకోకుండా హీరో అడవికి బయలుదేరతాడు. స్నేహితుడిని ఎలా బయటికి తీసుకొచ్చాడు అనేదే కథ. వినడానికి మంచి యాక్షన్ డ్రామాగా అనిపించినా స్క్రీన్ మీద వచ్చేటప్పటికి ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. అందులోనూ జగపతిబాబు ఇంత హెవీ సబ్జెక్టుని రెండో సినిమాకే ఎంచుకోవడం వాళ్ళకు నచ్చలేదు.

అప్పటికి మలయాళ ఆడియన్స్ అభిరుచి ప్రకారంగా ఇలాంటి సినిమాలు ఎక్కువగా వచ్చేవి. కాని మన దగ్గర మాస్ చిత్రాలు రాజ్యమేలుతున్న కాలమది. దీంతో ఇక్కడ ఎవరికీ కనెక్ట్ కాలేక అడవిలో అభిమన్యుడు డిజాస్టర్ అయ్యింది. రంగనాథ్, గుమ్మడి లాంటి సీనియర్లు, మామ కెవి మహదేవన్ సంగీతం ఇవేవి కాపాడలేకపోయాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తొందరగా ఇమేజ్ వచ్చేయాలన్న తపనతో ఇలాంటి రీమేక్ కథలను ఎంచుకున్న జగపతిబాబు దానికి తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆలోచన మార్చుకుని కొంత కాలం సోలో హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్స్ చేయడం మొదలుపెట్టాడు. అలా రెండు మూడేళ్ళు గడిచాక పెద్దరికం రూపంలో మొదటి బ్రేక్ లభించింది. ఫ్యామిలీ రివెంజ్ కావడంతో ఈ మూవీ హిట్టు కొట్టింది. ఇదీ రీమేకే కావడం అసలు ట్విస్టు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp