ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత 'ఖైదీ' - Nostalgia

By iDream Post Oct. 28, 2020, 09:33 pm IST
ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత 'ఖైదీ' - Nostalgia

ఏ హీరోకైనా స్టార్ డం రావడానికి ఒక మైల్ స్టోన్ లాంటి సినిమా ఉంటుంది. అప్పటిదాకా ఒక ఎత్తు అక్కడి నుంచి మరో ఎత్తు అనేలా కొత్త అధ్యాయం మొదలవుతుంది. అతనిలోని అసలైన సత్తా బయటికి తీసుకొచ్చే కాంబినేషన్ అరుదుగా కుదురుతుంది. అలాంటిదే చిరంజీవికి ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం కలిగించిన ఖైదీ. 1982 సంవత్సరం. నిర్మాతగా మారాలని నెల్లూరు నుంచి వచ్చిన డాక్టర్ తిరుపతిరెడ్డి తన ముగ్గురు స్నేహితులతో కలిసి మరో మిత్రుడైన దర్శకుడు కోదండరామిరెడ్డిని ఒప్పించి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి డేట్స్ సంపాదించారు. ముందో కథ అనుకున్నారు. యూనిట్ లో ఎవరికీ నచ్చలేదు. అప్పటికే షూటింగ్ ఓపెనింగ్ డేట్ తో సహా చిరు కాల్ షీట్లు కూడా ఫిక్స్ అయ్యాయి. సమయం దగ్గరపడుతోంది. అందరిలోనూ ఒకటే టెన్షన్. అప్పుడు రంగంలోకి దిగారు పరుచూరి బ్రదర్స్.

అంతకు ముందు ఏడాది వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన హాలీవుడ్ మూవీ రాంబో ఫస్ట్ బ్లడ్ లోని హీరో ఇంట్రోని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడి గ్రామీణ నేపధ్యానికి అనుగుణంగా కథను అల్లడం మొదలుపెట్టారు. ఆరు గంటల్లో కథ, మూడు రోజుల్లో డైలాగు వెర్షన్ సిద్ధమయ్యిందని తెలిసి చిరంజీవితో సహా అందరూ షాక్. కానీ స్టోరీ మాత్రం అద్భుతంగా వచ్చింది. మాస్ ని ఆకట్టుకునేందుకు ఏమేం కావాలో అన్నీ సమకూరాయి. ఇక ఆలస్యం చేయలేదు. జూన్ 16న మదరాసులో కృష్ణ ముఖ్యఅతిథిగా సినిమా మొదలుపెట్టారు. విఘ్నాలు ఎదురుకాకపోయినా షూటింగ్ పూర్తయ్యి ఫస్ట్ కాపీ సిద్ధం కావడానికి ఏడాది పట్టింది. 1983 అక్టోబర్ 28న కేవలం 35 ప్రింట్లతో విడుదల చేస్తే ఆ సమయంలో రాష్ట్రంలో తుఫాను. వర్షాన్ని జనం లెక్కచేయలేదు. కలెక్షన్లు దుమ్ము రేపుతున్నాయి. ఏకంగా 20 కేంద్రాలలో వంద రోజులు ఆడటం చిరంజీవి కెరీర్లో అప్పటికి పెద్ద రికార్డు. హైదరాబాద్ శాంతి థియేటర్లో మార్నింగ్ షోతో ఏకధాటిగా 365 రోజులు ఆడింది.

అప్పటిదాకా చిరుని ఎన్నడూ చూడని మాస్ యాక్షన్ అవతారంలో చూసి అభిమానులే కాదు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. అదే ఏడాది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సినిమాల్లో ఆయన నెంబర్ వన్ స్థానాన్ని ఎవరు తీసుకుంటారా అనే ప్రశ్నకు సమాధానం ఖైదీ వసూళ్ల సాక్షిగా చిరంజీవి దశాబ్దాలకు సరిపడా సమాధానం ఇచ్చాడు. చక్రవర్తి సంగీతం దీన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లింది. రగులుతోంది మొగలిపొద పాట హోరెత్తిపోయింది. మిగిలినవి కూడా ఊరువాడా మారుమ్రోగిపోయాయి. హీరోయిన్ మాధవికి వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. రావుగోపాల్ రావు, నూతన ప్రసాద్, రంగనాథ్, సుమలత, పిఎల్ నారాయణ, సంగీత, చలపతిరావు, సుత్తివేలు తదితరులు ఈ అద్భుతసృష్టిలో భాగం పంచుకున్నారు. ఖైదీ దెబ్బకు చిరంజీవికి అభిమాన సంఘాలు విపరీతంగా పుట్టుకొచ్చాయి. కొన్నేళ్ల పాటు ఈ సినిమా రీ రిలీజులు చేసుకుంటూనే వచ్చింది. ఇలాంటి బ్లాక్ బస్టర్ తమకు రాలేదే అని బాధపడిన కో స్టార్స్ అప్పట్లో ఎందరో. తెలుగు చిత్రానికి కొత్త నడవడిక నేర్పిన ఖైదీ వచ్చి 37 ఏళ్ళు అవుతున్నా అందులో హీరో సూర్యం మాత్రం ఇప్పటికీ నిప్పులు చిందే కళ్ళతో, కసితో చరిత్రలో తన పేజీలను చెదలు పట్టకుండా చూసుకుంటూనే ఉన్నాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp