రౌడీయిజం మీద 'ప్రతిఘటన'కు 35 ఏళ్ళు - Nostalgia

By iDream Post Oct. 11, 2020, 09:46 pm IST
రౌడీయిజం మీద 'ప్రతిఘటన'కు 35 ఏళ్ళు - Nostalgia

మహిళలు వంటింటికే పరిమితమనుకునే రోజులవి. అందులోనూ సినిమాల్లో హీరోయిజం అంటే కేవలం మగాళ్లకు మాత్రమే అన్వయించాలని దర్శకులు కథలు కూడా అలాగే రాసేవాళ్ళు. కానీ జనంలో చైతన్యం రగిలించి స్ఫూర్తిదాయక సినిమాలు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్న టి.కృష్ణ(హీరో గోపీచంద్ తండ్రి)ఆలోచనలు వాళ్ళ లాగా ఉండేవి కావు. ఝాన్సీ లక్ష్మి బాయ్ లాంటి వీరనారీమణుల గాధలు పుస్తకాల్లో చదవడమే తప్ప నిజ జీవితంలో చూసింది లేదు. నిజంగా అలాంటి అబలలు సమాజంలో ఉంటే ఏం జరుగుతుందన్న పాయింట్ మీద ఆయన రాసుకున్న కథే ప్రతిఘటన. మయూరి తర్వాత నిర్మాత రామోజీరావుకు రాష్ట్రలో పెచ్చుమీరిపోతున్న గూండాయిజం కాన్సెప్ట్ మీద కమర్షియల్ గా కాకుండా సీరియస్ గా గునపం గుచ్చినట్టు చెప్పే డైరెక్టర్ తో ఓ సినిమా తీయాలనుకున్నారు.

నేటి భారతం, దెశ్గంలో దొంగలు పడ్డారు, వందేమాతరం వరస విజయాలతో అప్పటికే టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారిన టి కృష్ణని అందుకు ఎంచుకున్నారు. మాటల రచయిత ఏంవిఎస్ హరనాథరావుతో కలిసి కసితో ప్రతిఘటన స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు కృష్ణ. ఝాన్సీ(విజయశాంతి)అనే కాలేజీ లెక్చరర్ కు, దందాలు చేసే రౌడీ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకునే కాళీ(చరణ్ రాజ్)అనే గూండా మధ్య జరిగిన సంఘర్షణకు సమకాలీన సంఘటనలను జోడించి అద్భుతంగా ఫైనల్ వెర్షన్ ను తయారు చేశారు. షూటింగ్ మొత్తం దాదాపు వైజాగ్ లోనే జరిగింది. క్యాస్టింగ్ ని టి కృష్ణ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నారు. చంద్రమోహన్, సుత్తివేలు, నర్రా వెంకటేశ్వర్రావు, వై విజయ, రాళ్ళపల్లి, పిఎల్ నారాయణ తదితరులు తమ పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. కాళీ చేతిలో చనిపోయి నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్ నటన ఆయన కెరీర్ ని ఒకేసారి పది మెట్లు ఎక్కించేసింది. 'ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో' పాట ఎందరినో వెంటాడింది.

రోమాలు నిక్కబొడుచుకునేలా చక్రవర్తి-వేటూరి ద్వయం ఇచ్చిన గీతాలు సంచలనం రేపాయి. స్టార్ లేకుండా కేవలం కథాబలంని నమ్ముకుని 1985 అక్టోబర్ 11న ప్రతిఘటన విడుదలయ్యింది. మొదటి ఆట నుంచే ప్రభంజనం మొదలయ్యింది. ఈ సినిమా చూడకపోతే సిగ్గుచేటు అనేలా ప్రచారం జరగడంతో పెద్ద హీరోలు సైతం నోరు తెరుచుకుని చూసేలా వసూళ్ల జాతర జరిగింది. ఏకంగా 25 కేంద్రాల్లో వందరోజులు ఆడి చరిత్ర సృష్టించింది. బెంగుళూరు మెజెస్టిక్ థియేటర్లో రోజు 5 ఆటల చొప్పున 203 రోజులు ప్రదర్శింపబడటం ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డు. విజయశాంతి, టి కృష్ణ, వేటూరి గార్లకు ఎన్ని అవార్డులు రివార్డులు వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. కాశయ్యగా కోట విలనీ బ్రహ్మాండంగా పండి ఆయన్ను బిజీ ఆర్టిస్టుగా మార్చేసింది. క్లైమాక్స్ లో కాళీని ఝాన్సీ చంపే సీన్ కు పూనకాలు రావడం ఒక్కటే తక్కువ. మహిళా చైతన్యం మీద ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ 35 ఏళ్ళ తర్వాత కూడా ప్రతిఘటన స్థానం మాత్రం ఎప్పటికీ బంగారు సింహాసనం మీదే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp