కౌబాయ్ పంజాకు 30 ఏళ్ళు - Nostalgia

By iDream Post Aug. 09, 2020, 06:01 pm IST
కౌబాయ్ పంజాకు 30 ఏళ్ళు - Nostalgia

కమర్షియల్ హీరోలకు మార్కెట్ ఎంత పెద్దగా ఉన్నా ఇమేజ్ వల్ల వచ్చిన ప్రతిబంధకాలు కొన్నిసార్లు ప్రయోగాలు చేయకుండా అడ్డుపడతాయి. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి అయితే చెప్పేదేముంది. కొన్నిసార్లు రిస్క్ చేసి సాహసం చేయక తప్పదు. అప్పుడే మనలోని నటతృష్ణను తీర్చుకోగలం. 1990వ సంవత్సరం. చిరు ఇమేజ్ శిఖరాగ్రంలో ఉంది. తనలో నటుడికి ఛాలెంజ్ చేసేలా ఆరాధన, రుద్రవీణ, స్వయంకృషి లాంటి సినిమాలు చేసినప్పటికి అవి నిర్మాతలకు మెగా లాభాలు ఇవ్వలేకపోయారు. అందుకే అప్పటి నుంచి ఆచితూచి అడుగులు వేస్తున్న టైంలో నటులు కైకాల సత్యనారాయణ సోదరుడు నాగేశ్వరరావు చిరంజీవితో కౌబాయ్ మూవీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది.

అప్పటిదాకా ఈ జానర్ లో కృష్ణ ఒక్కరే బ్లాక్ బస్టర్ సాధించారు. మోసగాళ్లకు మోసగాడు ఓ మాస్టర్ పీస్ గా నిలిచిపోయింది. అలాంటిది పడితే ఎలా ఉంటుందో ఊహించుకుని కొదమసింహంకు రూపకల్పన చేయించారు. ఉద్దండ రచయితలు పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, శివశక్తిదత్తా తదితరులు ఇంగ్లీష్ సినిమాల వీడియో క్యాసెట్లు చూసి మన నేటివిటీకి ఆడియన్స్ టేస్ట్ కి సూటయ్యేలా స్క్రిప్ట్ రాయించారు. దర్శకుడిగా మురళీమోహన్ రావుని తీసుకున్నారు. అప్పటికే చిరుతో సంఘర్షణ చేసిన అనుభవం ఉంది ఆయనకు. మెయిన్ హీరోయిన్లుగా సోనమ్, రాధా మరో చిన్న పాత్రలో వాణి విశ్వనాధ్ సెట్ అయ్యారు. విలన్లుగా కన్నడ నుంచి ప్రభాకర్, బాలీవుడ్ నుంచి ప్రాణ్ వచ్చారు. సత్యనారాయణ, సుధాకర్, ప్రసాద్ బాబు, చలపతిరావు, రంగనాథ్, అల్లు రామలింగయ్య, అన్నపూర్ణ, గొల్లపూడి, జయంతి, బ్రహ్మానందం ఇలా క్యాస్టింగ్ ని రిచ్ గా తీసుకున్నారు.

అప్పటికే హీరోగా ఇమేజ్ వచ్చిన మోహన్ బాబుని కామెడీ విలనీ సుడిగాలి పాత్ర కోసం ప్రత్యేకంగా ఒప్పించారు. ఆయనా అంచనాలకు మించి అద్భుతంగా పండించారు. రాజ్ కోటి 5 అద్భుతమైన పాటలు ఇచ్చారు . మదరాసు, రాజస్థాన్ ఎడారులు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున షూటింగ్ జరిపారు . అప్పట్లోనే 4 కోట్లకు పైగా బడ్జెట్ కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కేవలం వారం రోజుల షూటింగ్ కోసం చెంగల్పట్ లో కౌబాయ్ సెట్వేయడం అప్పట్లో సెన్సేషన్. ఇది మెకన్నాస్ గోల్డ్ స్ఫూర్తితో తీశారని చెప్పొచ్చు. హాలీవుడ్ లో ఉదృతంగా ఉన్న కౌబాయ్ ట్రెండ్ టైంలో వచ్చిన సినిమాలను జల్లెడ పోసి మరీ కథ రాసుకున్నారు. కన్నతండ్రి మీద దొంగతనం నిందపడి తల్లి జైలు శిక్ష అనుభవిస్తుండగా కొడుకు దీనికి కారణమైన నిధిని బయటికి తీసుకొచ్చి విలన్ల ఆటకట్టించడం అనే పాయింట్ మీద మనదైన శైలిలో తెలుగు డ్రామాను జొప్పించారు.

ఇంత భారీ కాన్వాస్ ను మురళీమోహన్ రావు ఎలాంటి బెరుకు లేకుండా అద్భుతంగా టేకప్ చేశారు. లియో కంపెనీ ద్వారా విడుదలైన ఆడియో క్యాసెట్లు సంచలనం సృష్టించాయి. ఎన్నడూ లేనివిధంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి ఇందులో కనిపించినంత స్టైలిష్ గా ఇంకే హీరో కౌబాయ్ వేషంలో కనిపించలేదన్నది వాస్తవం. దీనికన్నా మోసగాళ్లకు మోసగాడే పెద్ద హిట్ అయినప్పటికీ స్టైలింగ్ విషయంలో మాత్రం కొదమసింహందే పైచేయి. 1990 ఆగస్ట్ 9న కొదమసింహం విడుదలయింది. మొదటిసారి హైదరాబాద్ జంటనగరాల్లో 30 థియేటర్లలో రిలీజ్ కావడం కొత్త రికార్డు. అయితే జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి ఆల్ టైం క్లాసిక్ తర్వాత తక్కువ గ్యాప్ లో వచ్చిన మూవీ కావడంతో కొదమసింహం ఆ స్థాయిలో రికార్డులు సృష్టించలేదు కానీ డీసెంట్ గా వందరోజులు పూర్తి చేసుకుంది. రజినీకాంత్ ముఖ్యఅతిధిగా వేడుక కూడా జరిగింది. దీన్నే పాటలు కట్ చేసి ఇంగ్లీష్ లో హంటర్స్ అఫ్ ఇండియన్ ట్రెజర్ పేరుతో ఇంగ్లీష్ లో డబ్ చేశారు. తమిళ్ లో వెట్రివీరన్ గా అనువదించారు. ఆ టైంలో ఎలా ఆడిందన్నది పక్కనపెడితే ఇప్పుడు కొదమసింహం చూస్తే మాత్రం స్టైలిష్ కౌబాయ్ ఎంటర్టైనర్ గా మెప్పిస్తుంది.


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp