ఆటో జానీ అల్లరికి 29 ఏళ్ళు - Nostalgia

By iDream Post Oct. 18, 2020, 10:49 pm IST
ఆటో జానీ అల్లరికి 29 ఏళ్ళు - Nostalgia

తెలుగు సినిమాల్లో ద్విపాత్రాభినయంది ప్రత్యేక స్థానం. ఏఎన్ఆర్ ఇద్దరు మిత్రులు, ఎన్టీఆర్ రాముడు భీముడు, వాణిశ్రీ గంగ మంగ, బాలకృష్ణ అపూర్వ సహోదరులు, నాగార్జున హలో బ్రదర్, వెంకటేష్ సూర్యవంశం ఇలా ప్రతిఒక్కరికి మరపురాని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. వాటి వరసలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి రౌడీ అల్లుడు గురించి. 1991 అక్టోబర్ 18న విడుదలైన ఈ మూవీ అప్పట్లో కలెక్షన్ల దుమ్ము దులిపింది. కథ మరీ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఒక పెద్ద కంపెనీకి అధిపతి అయిన కళ్యాణ్ స్థానంలో విలన్ పన్నిన పన్నాగం వల్ల ముంబైలో ఆటో నడుపునే జానీ వస్తాడు. కానీ వాళ్ళ దురుద్దేశాలు పసిగట్టిన ఈ ఇద్దరూ కొత్త తరహాలో గేమ్ ఆడి దుర్మార్గుల ఆట కట్టిస్తారు. సింపుల్ గా ఇదే స్టొరీ. రొటీన్ గా చిన్నప్పుడే తప్పిపోయిన అన్నదమ్ముల కథలా కాకుండా ఇద్దరికీ అసలు సంబంధమే లేదన్నట్టు చూపించిన ట్రీట్మెంట్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది.

ముఖ్యంగా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ ఊర మాస్ ఆటో జానీ పాత్రలో చిరంజీవి విశ్వరూపానికి మాస్ జనం ఊగిపోయారు. అందులోనూ ఆఫీస్ లో చేసిన కామెడీకి థియేటర్ల పైకప్పులు ఎగిరిపోయేలా అభిమానులు పండగ చేసుకున్నారు. తెలుగు హిందీని మిక్స్ చేస్తూ సరికొత్త స్లాంగ్ తో చిరు చేసిన ప్రయోగం అద్భుతంగా పేలింది. దొంగమొగుడులోనూ ఇలాంటి రోల్స్ చేసినప్పటికీ దానికి పదింతలు ఎక్కువ వినోదాన్ని తన బాడీ లాంగ్వేజ్, మ్యానరిజంస్ తో అందించారు మెగాస్టార్. బొబ్బిలిరాజాతో టాలీవుడ్ లో గట్టి జెండా పాతిన దివ్యభారతి, హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శోభన ఇద్దరు చిరులకు సరిజోడి అనిపించారు. కోట, అల్లు రామలింగయ్య కామెడీ విలనీ పండించగా కెప్టెన్ రాజు సీరియస్ పాత్ర ద్వారా బిజీ ఆర్టిస్ట్ గా మారాడు. సత్యానంద్ రచన ఎన్నో చమక్కులు మెరిపించింది. డైలాగులు పదే పదే తలుచుకుని ప్రేక్షకులు నవ్వుకునేవారు.

ఇక బప్పీలహరి సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పటికే స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్ ఆల్బమ్స్ తో చిరుకి అదిరిపోయే పాటలను ఇచ్చిన ఈయన రౌడీ అల్లుడుతో వెర్రెక్కిపోయే ట్యూన్స్ తో అదరగొట్టారు. బోలో రాణి బోలో రాణి, ప్రేమా గీమా తస్సాదియ్యా, లవ్ మీ మై హీరో సాంగ్స్ ఊరువాడా హోరెత్తిపోగా చిలుకా క్షేమమా చాలా కాలం మెలోడీ లవర్స్ ని వెంటాడింది. గ్యాంగ్ లీడర్ స్థాయిలో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టకపోయినా రౌడీ అల్లుడు అంచనాలు నిలబెట్టుకుంటూ ఇరవై కేంద్రాలకు పైగా వంద రోజులు ప్రదర్శింపబడటం విశేషం. ఇప్పటికీ మాస్ ఎంటర్ టైనర్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రౌడీ అల్లుడుకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందుకే 29 ఏళ్ళు అవుతున్నా సోషల్ మీడియా వేదికగా దాని జ్ఞాపకాలలో చిరు అభిమానులు తడిసిపోతున్నారు. ఈ స్థాయిలో ఆ తర్వాత మళ్ళీ చిరంజీవికి డ్యూయల్ రోల్ హిట్ మూవీ ఇంకొకటి రాలేదంటే ఇదెంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదేమో

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp