25 ఏళ్ళ అపురూప ప్రేమ - Nostalgia

By iDream Post Oct. 20, 2020, 08:27 pm IST
25 ఏళ్ళ  అపురూప ప్రేమ - Nostalgia

ఒక బ్లాక్ బస్టర్ తాలూకు ప్రభావం కొంత కాలం వరకు ఉండటం సహజం. కానీ దశాబ్దాలు గడుస్తున్నా అది అలాగే కొనసాగితే దాన్నేమని పిలవాలి. ఇండియన్ సినిమా హిస్టరీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే ఈ రోజుతో 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ దాని జ్ఞాపకాలు తాజాగా ఉన్నాయంటే ఈ సినిమాకు ప్రతిఒక్కరు ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. సుప్రసిద్ధ దర్శకులు యాష్ చోప్రా అబ్బాయి ఆదిత్య చోప్రా తన తండ్రికి చాందిని, డర్, లమ్హే లాంటి చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసిన అనుభవంతో స్వంతంగా కథలు రాసుకున్నారు. ముందు మొహబ్బతే(2000)ని తెరకెక్కించాలనుకున్నప్పటికీ ఏవో కారణాల వల్ల డిడిఎల్జె ముందుకు వచ్చింది. దీన్ని డైరెక్ట్ చేయమని ఆదిత్య తండ్రినే కోరారు. కానీ ఆయన ఇలాంటి కథను యువకుడైన నీలాంటి వాడు డీల్ చేయడం కరెక్ట్ అని ప్రోత్సహించారు. దీంతో 1994 సెప్టెంబర్ లో షూటింగ్ మొదలుపెట్టారు. ఏడాది పాటు చిత్రీకరణ సాగింది. స్విజ్జర్ ల్యాండ్, ఇంగ్లాండ్, ఇండియాలో మొత్తం పూర్తి చేశారు.

తండ్రి కూతురు, నాన్న కొడుకు ఎమోషన్స్ ని ఆధారంగా చేసుకుని ఆదిత్య చోప్రా అల్లిన ఓ అందమైన ప్రేమ కథ దిల్వాలే దుల్హనియా లేజాయేంగే. 1992లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన షారుఖ్ ఖాన్ కి అప్పటికి ఇమేజ్ ఉంది కానీ అది లవ్ బాయ్ తరహా కాదు. అంజామ్, దీవానా, డర్ ల దెబ్బకు హింసించి భయపెట్టే అమర ప్రేమికుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పుడు చేసిందే ఈ డిడిఎల్. నిజానికి ఆదిత్య చోప్రా ఆలోచన వేరు. జంధ్యాల గారి పడమటి సంధ్యారాగం తరహాలో హీరో పాత్రకు ఓ ఫారినర్ ని అందులోనూ టామ్ క్రూజ్ ను తీసుకోవాలని అనుకున్నాడు. కానీ యాష్ చోప్రా వారించారు. ఇక్కడి సినిమా మార్కెట్ కి విదేశీయులను లీడ్ రోల్ లో పెడితే మాస్ జనం దూరమవుతారని హెచ్చరించారు. దీంతో మార్పులు చేసి రాజ్ మల్హోత్రా పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. సిమ్రాన్ క్యారెక్టర్ అద్భుతంగా కుదిరింది. వీళ్ళకు సమానమైన స్పాన్ తో అమ్రిష్ పూరి, అనుపమ్ ఖేర్ ల పాత్రలను తీర్చిద్దిద్దిన తీరు తర్వాత రోజుల్లో ఎన్నో సినిమాల్లో తండ్రి పాత్రలకు మార్గం చూపించింది.

1995 అక్టోబర్ 20న విడుదలైన దిల్వాలే దుల్హనియా లేజాయేంగేకు వచ్చిన స్పందన గురించి చెప్పాలంటే సునామి అనే పదం చాలా చిన్నది. చిన్నా పెద్ద క్లాసు మాస్ తేడా లేకుండా పిల్లా జెల్లా పెద్దా పీచు అందరూ కుటుంబ సమేతంగా థియేటర్లకు క్యూ కట్టారు. వారాల తరబడి టికెట్లు దొరకడం గగనమైపోయింది. జతిన్-లలిత్ స్వరపరిచిన ఏడు పాటలు దేశవ్యాప్తంగా మారుమ్రోగాయి. చాలా చోట్ల ఆడియో క్యాసెట్లు స్టాక్ లేక పైరసీ విలయ తాండవం చేసింది. అలా మొదలైన డిడిఎల్ మాయాజాలం 25 ఏళ్ళు అవుతున్నా ఇంకా వెంటాడుతూనే ఉంది. షారుఖ్ చలాకీతనం, ఒద్దికకు ప్రతిరూపంగా ఉండే కాజల్ స్వభావం అలా అందరి మనస్సుల్లో నిలిచిపోయింది. 10 ఫిలిం ఫేర్ అవార్డులు, ఒక జాతీయ అవార్డు సాధించినప్పటికీ జనం మెచ్చి ఇచ్చిన ప్రశంసలు దీన్నో ల్యాండ్ మార్క్ మూవీగా నిలబెట్టాయి. వసూళ్ల గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే రాయొచ్చు. ముంబై మరాఠా మందిర్ థియేటర్లో దశాబ్దాల తరబడి ప్రదర్శించిన సినిమాగా డిడిఎల్ సృష్టించిన రికార్డు ఇప్పటికే కాదు ఎప్పటికీ చెక్కుచెదిరిపోదు. తెలుగులో ప్రేమించి పెళ్లాడుతాగా డబ్బింగ్ చేసి విడుదల చేస్తే ఇక్కడా చాలా కేంద్రాల్లో వంద రోజులు ఆడటం చిన్న విషయం కాదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp